Maa Behen : ‘మా బెహన్’ మూవీ రివ్యూ.. తల్లి, ఇద్దరు కూతుళ్లు కలిసి ఏం చేశారు..
ముగ్గురు ఆడవాళ్ళతో డార్క్ కామెడీ సినిమాని ట్రై చేసాడు దర్శకుడు. (Maa Behen Review)
Maa Behan Review
Maa Behen Review : మాధురి దీక్షిత్, త్రిప్తి దిమ్రి, ధర్నా దుర్గ, రవికిషన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా మా బెహన్. అబుందన్తియా ఎంటర్టైన్మెంట్, ఓపెనింగ్ ఇమేజ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సురేష్ త్రివేణి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ గా ఈ మా బెహన్ సినిమా రిలీజ్ అయింది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమా.
కథ విషయానికొస్తే..
మొదటి భర్త చనిపోయి, రెండో భర్త వదిలేసిన తర్వాత రేఖ(మాధురి దీక్షిత్) ఒంటరిగా ఓ కాలనీలో జీవిస్తుంది. తన పెద్ద కూతురు జయ(త్రిప్తి దిమ్రి) పెళ్లి చేసుకొని అత్తారింట్లో కష్టాలు పడుతూ ఉంటుంది. చిన్న కూతురు సుష్మ(ధర్నా దుర్గ) కూడా వేరే ఊళ్ళో ఉంటుంది. రేఖపై ఆ కాలనీ వాళ్లకు మొదట్నుంచి సదభిప్రాయం ఉండదు. ఓ రోజు అర్ధరాత్రి రేఖ ఇద్దరు కూతుళ్ళకు ఫోన్ చేసి ఎదురింటి గుప్తా(రవి కిషన్) తమ ఇంట్లో చనిపోయాడు, భయమేస్తుంది తొందరగా రమ్మని ఏడుస్తుంది. దీంతో ఇద్దరు కూతుళ్లు తెల్లారేసరికి తల్లి దగ్గర ఉంటారు.
గుప్తా కూతురి పెళ్లి త్వరలోనే ఉండటంతో వాళ్ళింట్లో వేడుకలు జరుగుతుంటాయి. గుప్తా శవాన్ని తల్లీకూతుళ్లు ముగ్గురూ కలిసి ఓ నదిలో పారేద్దామని ప్లాన్ చేసుకుంటారు కానీ అతను బతికే ఉన్నాడని తెలుస్తుంది. అయినా అతన్ని కట్టేసి ఇంట్లోనే దాచిపెడతారు. గుప్తా కనిపించట్లేదని అతని ఇంట్లో వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అసలు గుప్తా రేఖ ఇంటికి ఎందుకు వచ్చాడు? రేఖ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? రేఖని ఎందుకు అందరూ తప్పుగా అనుకుంటారు? గుప్తా బతికి ఉన్నా ఎందుకు అతన్ని కట్టేసి ఉంచుతారు? జయ అత్తారింట్లో పడే కష్టాలు ఏంటి? గుప్తాని ఈ ముగ్గురు ఏం చేస్తారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : NBK 111 Glimpse : బాలయ్య బాబు NBK 111 సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. బాలయ్య స్టైలిష్ అవతారం..
సినిమా విశ్లేషణ..
ముగ్గురు ఆడవాళ్ళతో డార్క్ కామెడీ సినిమాని ట్రై చేసాడు దర్శకుడు. ఇటీవల ఇలాంటి ఫ్యామిలీ డార్క్ కామెడీ సినిమాలు చాలానే వస్తున్నాయి. అయితే డార్క్ కామెడీ కంటే కూడా సినిమాలో ప్రతి సీన్ లో అంతర్లీనంగా కొంతమంది ఆడవాళ్లను సమాజం ఎలా చూస్తుంది, ఇంకా అత్తారింట్లో ఆడవాళ్లు పడే కష్టాలు, మహిళల గురించి ఉండే తప్పుడు అభిప్రాయాలు అనే అంశాలను చూపించారు.
రేఖ పాత్రని మొదట్నుంచి బ్యాడ్ గా చూపించి చివర్లో ఎమోషన్ ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఓపెనింగ్ ముగ్గురు పాత్రల పరిచయం చేసి డైరెక్ట్ కథలోకి వెళ్లిపోయారు. కథ అంతా ఆల్మోస్ట్ ఒకే ఇంట్లో, కాలనీలో జరుగుతుంది. కొన్ని సీన్స్ బాగా సాగదీశారు. క్లైమాక్స్ కూడా క్లారిటీ లేకుండా సింపుల్ గా తేల్చేసారు. అక్కడక్కడా కామెడీ ట్రై చేశారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కథనం ఒక క్రైమ్ సీరియల్ నేరేషన్ లో జరుగుతున్న కథని చూపెట్టే ప్రయత్నం చేశారు కానీ అది కథకు అడ్డంకిగా మారింది. జయ, సుష్మ తండ్రులు వేరని, ఆ తండ్రుల కథలు, అందులో రేఖ జీవితం, అక్కాచెల్లెళ్ల మధ్య గొడవలు, కూతుళ్లు ఇద్దరికీ కూడా తల్లిపై నెగిటివ్ అభిప్రాయం ఉండటం.. ఆ సీన్స్ అన్ని కూడా చివరివరకు కామెడీగా సాగదీసి చివర్లో ఎమోషన్ పండించాలి అనుకున్నారు. ఫార్వార్డ్ చేసుకుంటూ ఒకసారి చూడొచ్చు. ఒక డార్క్ కామెడీ కథకి సమాజంలో మహిళలు అనే అంశాన్ని తీసుకొని మెసేజ్ ఇద్దామని ప్రయత్నం చేశారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్, త్రిప్తి దిమ్రి తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసారు. ధర్నా దుర్గ బాగానే నటించినా కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. రవి కిషన్ పర్వాలేదనిపించారు. గీతాంజలి కులకర్ణి, అరుణోదయ్ సింగ్.. మిగిలిన నటీనటునటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Sreeja Konidela : నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ.. చిరంజీవి కూతురు వీడియో వైరల్..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది. క్రైమ్ నేరేషన్ లేకుండా స్క్రీన్ ప్లే సింపుల్ గా రాసుకొని ఉంటే బాగుండేది. ఫ్యామిలీ క్రైమ్ కథతో దర్శకుడు సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాని తీశారు అని తెలుస్తుంది.
మొత్తంగా ‘మా బెహన్’ సినిమా ఓ తల్లి ముగ్గురు కూతుళ్లు కలిసి ఏం చేశారు అని సస్పెన్స్ డార్క్ కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
