The Red Bag Review: ‘ది రెడ్ బ్యాగ్’ మూవీ రివ్యూ.. రెడ్ బ్యాగ్ లో ఏముంది?
The Red Bag Review: ది రెడ్ బ్యాగ్ సినిమా నేడు ఆగస్ట్ 21న థియేటర్స్ లో రిలీజయింది.
The Red Bag Review
The Red Bag Review : రాధ్య, మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష, కబీర్ సింగ్.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ది రెడ్ బ్యాగ్. మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి, ప్రసాద్ బెహరా.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ది రెడ్ బ్యాగ్ సినిమా నేడు ఆగస్ట్ 21న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే..
విన్నీ(రాధ్య) వేరే దేశంలో మైక్(కబీర్ సింగ్) ఆధీనంలో నడిచే ఓ వ్యభిచార గృహంలో వేశ్యగా ఉంటుంది. అక్కడ చాలా మంది అమ్మాయిలు బందీలుగా వేశ్యలుగా మారి ఉంటారు. అక్కడికి ఈషా, బేబ్, ఈవ్.. అనే మరో ముగ్గురు అమ్మాయిలు మూడు నెలలు అగ్రిమెంట్ తో డబ్బుల కోసం వేశ్యలుగా వచ్చి అక్కడ పరిస్థితులు చూసి భయపడతారు. ఆ ముగ్గురు మూడు నెలల అగ్రిమెంట్ అయిపోవడంతో పాస్ పోర్ట్స్, డబ్బులు ఇచ్చి పంపించేయమని అడగ్గా మైక్ వాళ్ళ అగ్రిమెంట్ పేపర్స్ చింపేసి ఇక్కడే జీవితాంతం ఉండాల్సిందే అని కొడతాడు.
దీంతో అందులో ఒక అమ్మాయి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది. అది చూసి విన్నీ వీళ్ళని ఓదార్చగా అసలు వీళ్ళు ముగ్గురు ఎందుకు అక్కడికి వచ్చారో తమ కథ చెప్తారు. దీంతో విన్నీ ఆ ముగ్గురు పారిపోవడానికి హెల్ప్ చేయాలనుకుంటుంది. మరి ఈ నలుగురు అమ్మాయిలు ఆ వేశ్య గృహం నుంచి బయట పడతారా? ఆ ముగ్గురు కథేంటి? ఎందుకు వేశ్యలుగా మారారు? విన్నీ కథేంటి? విన్నీ వేశ్యగా ఎందుకు మారింది? ఈ మైక్ ఎవరు? అక్కడ్నుంచి తప్పించుకునే క్రమంలో వీళ్ళకు ఎదురైన సమస్యలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also See : Sapthami Gowda : కాంతార హీరోయిన్ వరలక్ష్మి వ్రతం.. సప్తమి గౌడ ఫొటోలు..
సినిమా విశ్లేషణ..
రెడ్ బ్యాగ్ అంటూ ఇదేదో బ్యాగ్ చుట్టూ తిరిగే క్రైమ్ కథ అని టీజర్, ట్రైలర్స్, ప్రమోషన్స్ తో బాగానే అంచనాలు నెలకొల్పారు. ఓపెనింగ్ అక్కర్లేని డైలాగ్స్, AI విజువల్స్ తో కాసేపు సాగదీశారు. హీరోయిన్ రాశిని కలవడం, ఆమె కూతురు దగ్గరికి వెళ్లి తమ కథ చెప్పడం వరకు నిదానంగా సాగుతుంది.
విన్నీ తన కథ మొదలుపెట్టిన దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. వేరే దేశంలో ఓ వ్యభిచార గృహం, అక్కడి మనుషులు, అక్కడ పబ్ సెటప్ తో సాగదీసి అక్కడక్కడే కాసేపు నడిపించారు. ముగ్గురు అమ్మాయిలు ఎంటర్ అవడం, వాళ్ళ కథ ఫ్లాష్ బ్యాక్ తో బాగా సాగదీశారు. డబ్బులు, అవసరాలు కోసమే అమ్మాయిలు ఇలా మారతారు అనే రొటీన్ సీన్స్ తోనే నడిపించారు. అయితే ఆ ముగ్గురు డబ్బుల కోసం ఎందుకు అంత దూరం వచ్చారు అనే పాయింట్ బాగుంటుంది. ఒక మంచి పనికోసం అని తెలిసాక అప్పటిదాకా సిల్లీగా సాగిన కథ కాస్త పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది ఆ ముగ్గురు పాత్రల మీద.
ఆ వేశ్య గృహం నుంచి తప్పించుకొని వెళ్లిన తర్వాత సెకండ్ హాఫ్ ఏమవుతుంది అనే ఆసక్తి అయితే నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఛేజింగ్ సీన్స్, ఆ నలుగురు అమ్మాయిలు ఓ రెడ్ బ్యాగ్ ని పట్టుకొని పారిపోవడం, వాళ్ళ వెనక పడే విలన్స్ తో బాగా సాగదీశారు. మధ్యలో ప్రసాద్ బెహరా కామెడీ కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఇక ఆ అమ్మాయిలు ఇండియాకు తిరిగి వెళ్ళారా లేదా, విన్నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సెకండ్ హాఫ్ కథ. విన్నీ ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీన్ సీన్స్ తోనే సాగుతుంది. ఇక రెడ్ బ్యాగ్ అని టైటిల్ పెట్టారు కానీ ఆ బ్యాగ్ కి కథకి పెద్దగా సంబంధం ఉండదు. అన్ని సినిమాల్లోలాగే ఆ బ్యాగ్ లో ఉండేది ఏదో విలన్ కి కావాలి, దాని కోసం ఛేజింగ్ అన్నట్టు సాగుతుంది.
గ్రాఫిక్స్ అస్సలు బాగోలేవు. గ్రీన్ మ్యాట్ మీద తీసిన కార్ డ్రైవింగ్ సీన్స్ వరస్ట్. ఆ కార్ నడిపే సీన్స్ కూడా ఎక్కువ సేపు సాగదీశారు. ఎమోషనల్ సీన్స్ మాత్రం పండలేదు. ఇక వేరే దేశం అని చెప్పి అన్ని ఇక్కడే లోకల్ లొకేషన్స్ లో, సగం కథ ఓ పబ్ లోనే సాగింది. మధ్యలో ఓ ఫ్లాష్ బ్యాక్, సాంగ్ కి మాత్రం థాయిలాండ్ కి వెళ్లొచ్చారు. అమ్మాయిలు ఇలా వేశ్యగా మారడానికి కారణాలు ఏంటి? అలా మారిన వాళ్లకు సమాజం, సొంత వాళ్ళు ఎలా చూస్తారు అనే ఓ మెసేజ్ తో సినిమాని ముగించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
కన్నడ నటి రాధ్య విన్నీ పాత్రలో పర్వాలేదు అనిపించింది. మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష అందాల ఆరబోతతో అక్కడక్కడా యాక్టింగ్ లో పర్వాలేదు అనిపించారు. కబీర్ సింగ్ విలన్ గా బాగానే నటించాడు. ప్రసాద్ బెహరా అక్కడక్కడా నవ్వించాడు. గాయత్రి భార్గవి, రాశి గెస్ట్ అప్పీరెన్స్ లో కనిపించారు.
Also See : Upendra : ఫ్యామిలీతో కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. ఫొటోలు..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా సెట్ అవ్వలేదు. రెండు మెలోడీ ఎమోషనల్ సాంగ్స్ మాత్రం బాగున్నాయి. ఎడిటింగ్ లో చాలా ల్యాగ్ సీన్స్ కట్ చేయొచ్చు. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఒక చిన్న మెసేజ్ చెప్పడానికి వేశ్య పాత్రల చుట్టూ రాసుకున్న కథ బాగానే ఉన్నా సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘ది రెడ్ బ్యాగ్’ కొంతమంది వేశ్యల చుట్టూ తిరిగే క్రైమ్ తో పాటు మెసేజ్ ఇచ్చే కథ. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

