Pallichattambi : ‘పళ్లిచట్టంబి’ రివ్యూ.. మలయాళం స్టార్ టొవినో థామస్ సినిమా ఎలా ఉందంటే..
పళ్లిచట్టంబి అంటే.. చర్చ్‌ని కాపాడుకునేందుకు ఉండే రక్షకుడు లేదా రౌడీ అని అర్థం. (Pallichattambi)
Pallichattambi
Pallichattambi : టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘పళ్లిచట్టంబి’. గత వారమే మలయాళంలో రిలీజ్ అవ్వగా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది. డిజో జోస్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు.
కథ విషయానికి వస్తే..
స్వాతంత్ర్యం రాక ముందు 1930 కాలంలో కర్ణాటక, కేరళ సరిహద్దులో నంబియార్ అనే పెద్ద దొర ఉండేవాడు. అతని ఇలాకాలోకి ఆంగ్లేయులు అడుగు పెట్టేందుకు కూడా భయపడిపోయేవారు. ఆ తరువాత 1950లో కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చి భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేస్తుంది. ఈ చట్టంతో కొన్ని చర్చి భూములను తీసుకోవాలని చూస్తారు. అలాంటి టైంలో అల్లర్లు జరుగుతాయి. కమ్యూనిస్టుల నుంచి కున్నుపురం చర్చిని కాపాడుకునేందుకు అక్కడి ఫాదర్, ఆ మతస్థులు పళ్లిచట్టంబి/క్రిష్టోఫర్(రక్షకుడు లేదా రౌడీ)ని నియమించాలని చూస్తుంది.
ఈ క్రమంలో తోమాపురంకి చెందిన హిందువు కృష్ణ పిళ్లై(టొవినో థామస్)ని క్రిష్టోఫర్‌గా కణియార్ గ్రామానికి తీసుకు వస్తారు. వచ్చీ రావడంతో కమ్యూనిస్టుల్ని ఎదుర్కొంటాడు. అయితే కమ్యూనిస్ట్ కార్యకర్త రెబెక్కా (కయాదు లోహర్)తో ఈ క్రిష్టోఫర్ ప్రేమలో పడతాడు. క్రిష్టోఫర్ ఆ చర్చిని కాపాడతాడా? రెబెక్కాతో ప్రేమకథ ఏంటి? అసలు ఎందుకు ఆ భూముల గురించి గొడవలు? ఆ ఊరికి దగ్గర్లో ఉండే కొండ, దాని వెనుకున్న రహస్యం ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Thimmarajupalli TV Review: ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రివ్యూ.. కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేసిన సినిమా ఎలా ఉందంటే..?
సినిమా విశ్లేషణ..
పళ్లిచట్టంబి అంటే.. చర్చ్‌ని కాపాడుకునేందుకు ఉండే రక్షకుడు లేదా రౌడీ అని అర్థం. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అక్కడి చారిత్రక ఘటనలు తెలిసిన వారికి అంతో ఇంతో ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ తెలుగు వారికి మాత్రం ఒక్క పాయింట్ కూడా కనెక్ట్ అవ్వదు. అక్కడి ఊరి పేర్లు, మనుషుల పేర్లు ఇవేవీ కూడా డబ్బింగ్ లో మార్చకపోవడం గమనార్హం.
అసలు కథలో ఏం జరుగుతుంది అనే క్లారిటీ చాలావరకు రాదు. ఫస్ట్ హాఫ్ అంతా గందరోగోళంగానే సాగుతుంది. చట్టంబిగా చర్చిని కాపాడేందుకు హీరో రావడం, అక్కడి వారికి ఆత్మరక్షణలో మెలుకువలు నేర్పడం, శిక్షణ ఇప్పించడం, నాటకాలు వేసే రెబెక్కాతో హీరో పరిచయం ఇలా సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్‌కి కథ కాస్త రక్తికట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ ప్రారంభం కూడా నెమ్మదిగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది.
ఈ అల్లర్ల వెనుకున్నది ఎవరు? ఫస్ట్ సీన్లో చూపించిన ఆ దొర ఎవరు? హీరో ఫ్లాష్ బ్యాక్‌కి ఈ దొరకి ఉన్న కనెక్షన్ ఏంటి? అన్నది తెలిసిన తరువాత కాస్త ఆసక్తి పెరుగుతుంది. ఇక క్లైమాక్స్ ఫైట్ మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. అయితే కేవలం చర్చ్‌లను మాత్రేమ ఎందుకు టార్గెట్ చేస్తారు? ఈ గొడవలు ఎందుకు అని మరింత క్లారిటీ ఇవ్వాల్సింది.
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొంతమంది మలయాళం మేకర్స్ సినిమాలు తీయడం లేదా సినిమాల్లో సీన్స్ పెట్టడం చేస్తుంటారు. ఈ సినిమాలో కూడా అలాంటి సీన్స్ పెట్టారు. ఇవి మలయాళంలో పట్టించుకోకపోయినా ఇక్కడ వివాదానికి దారి తీయొచ్చు. కథ బేసిక్ పాయింట్ మన అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమాని గుర్తుచేస్తుంది. మలయాళం నేటివిటీ నచ్చేవాళ్ళు ఈ సినిమా చూడొచ్చు. రెండో పార్ట్ కూడా ఉందని ప్రకటించడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
టొవినో థామస్ యాక్టింగ్ బాగుంటుంది. కామెడీతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. ఇక ఎమోషనల్ సీన్స్‌లో అందరినీ కట్టి పడేస్తాడు. కయాదు లోహర్ ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. అందంగా కనిపించడమే కాకుండా ఆకట్టుకునేలా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ షేడ్స్ లో పాత్ర కొద్ది సేపే కనిపించినా బాగానే నటించాడు. తెలుగు యాక్టర్ శత్రుకి మంచి పాత్ర పడింది. మిగిలిన మలయాళీ ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలో పర్వాలేదనిపించారు.
Papam Prathap : ‘పాపం ప్రతాప్’ మూవీ రివ్యూ.. పాపం అంటూనే నవ్వుకోవచ్చు..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. జేక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. కథ పాతదే అయినా కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా స్క్రీన్ ప్లే తో కొత్తగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. మలయాళ సినిమాలంటే లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయని తెలిసిందే. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘పళ్లిచట్టంబి’ తెలుగు రిలీజ్ మలయాళం సినిమాలు చూసే తెలుగు వారి కోసం. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
