The Short Cut : ది షార్ట్ కట్ మూవీ రివ్యూ..
విజయానికి అడ్డదారులు ఉండవు అనే కాన్సెప్ట్ తో సినిమా పరిశ్రమలో డైరెక్టర్ అవుదామని వచ్చిన ఓ వ్యక్తి లైఫ్ ఏమైంది అని థ్రిల్లర్ కథలా చూపించారు.

Aata Sandeep The Short Cut Movie Review and Rating
The Short Cut Movie Review : అట సందీప్, షాజ్ఞ శ్రీ జంటగా తెరకెక్కిన సినిమా ది షార్ట్ కట్. విజయానికి అడ్డదారులు ఉండవు ట్యాగ్ లైన్. శ్రీమతి కంచి షర్మిల సమర్పణలో డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రంగారావు తోట, రజనీకాంత్ పున్నాపు నిర్మాతలుగా కంచి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ది షార్ట్ కట్ సినిమా నవంబర్ 8న రిలీజయింది.
కథ విషయానికొస్తే.. సినిమా డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు ప్రకాష్(ఆట సందీప్). ఎంతమంది నిర్మాతలకు కథలు చెప్పినా ఒక్కటీ ఓకే అవ్వదు. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ దివ్య (షాజ్ఞ శ్రీ) సినిమా, డైరెక్షన్ వర్కౌట్ అవ్వదు నువ్వు ఉద్యోగం చేస్తే తప్ప మనిద్దరికీ పెళ్లి అవ్వదు అంటుంది. కానీ ఎలాగైనా డైరెక్టర్ అయి తీరుతాను అని ప్రయత్నాలు చేస్తుంటాడు ప్రకాష్. మరోవైపు హైదరాబాదులో డ్రగ్స్ మాఫియాని అంతం చేసే పనిలో పోలీసులు ఉంటారు. ఈ క్రమంలో ఓ డ్రగ్స్ ఉన్న బ్యాగ్ ప్రకాష్ దగ్గరకు వస్తుంది. దీంతో ఆ డ్రగ్స్ అమ్మి వచ్చిన డబ్బుతో తనే నిర్మాతగా సినిమా తీయాలనుకుంటాడు. కానీ అనుకోకుండా డ్రగ్స్ మాఫియా డాన్ కు చిక్కుతాడు ప్రకాష్. మరి ఆ డాన్ నుంచి తప్పించుకున్నాడా? ప్రకాష్ డైరెక్టర్ అయ్యాడా? ఆ డ్రగ్స్ ఎవరివి? ప్రకాష్ – దివ్య ప్రేమ వర్కౌట్ అయిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ అంతా హీరో కథలు చెప్తూ డైరెక్టర్ అవ్వడంకోసం ప్రయత్నాలు చేయడం, హీరోయిన్ తో ప్రేమతో సాగుతుంది. సెకండ్ హాఫ్ డ్రగ్స్ కేసులోకి హీరో రావడం, డ్రగ్స్ చుట్టూ థ్రిల్లర్ లా సాగుతుంది. ఒక సినిమా కథకు డ్రగ్స్ లింక్ పెట్టి బాగానే చూపించే ప్రయత్నం చేసారు. గతంలో సినిమా ఇండస్ట్రీ కష్టాలకు డ్రగ్స్ కథని లింక్ చేసి భరతనాట్యం అనే సినిమా కామెడీగా చూపిస్తే ఇందులో అదే పాయింట్ ని థ్రిల్లర్ లా చూపించారు.
Also Read : Pushpa 2 : దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో పుష్ప 2 భారీ ఈవెంట్స్.. ట్రైలర్ లాంచ్ అక్కడే..
నటీనటుల పర్ఫార్మెన్స్.. డ్యాన్సర్ గా ఇన్నాళ్లు మనల్ని మెప్పించిన ఆట సందీప్ మొదటిసారి హీరోగా బాగానే మెప్పించాడు. ఇటీవలే ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాతో పలకరించిన షాజ్ఞ శ్రీ ఈ సినిమాలో హీరోయిన్ గా మెరిపించింది. పోలీస్ పాత్రలో ఈటీవీ ప్రభాకర్, లోకల్ డాన్ గా రాకేష్ మాస్టర్, బల్వీర్ సింగ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు కొంత ప్లస్ అవుతుంది. సినిమా కష్టాల కథకు డ్రగ్స్ పాయింట్ ను జతచేసి థ్రిల్లర్ లా మొదటి సినిమాని బాగానే తెరకెక్కించాడు దర్శకుడు కంచి రామకృష్ణ. ఇక చిన్న సినిమా అయినా కావాల్సినంత ఖర్చుపెట్టారు నిర్మాతలు.
మొత్తంగా ‘ది షార్ట్ కట్’ విజయానికి అడ్డదారులు ఉండవు అనే కాన్సెప్ట్ తో సినిమా పరిశ్రమలో డైరెక్టర్ అవుదామని వచ్చిన ఓ వ్యక్తి లైఫ్ ఏమైంది అని థ్రిల్లర్ కథలా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.