చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ జరిగింది: ప్రభాకర్..

Actor Prabhakar Respond on Shiva Parvati issue: తను కరోనాతో హాస్పటిల్‌లో అడ్మిట్ అయితే పట్టించుకునేవారే కరువయ్యారని, తను చనిపోయినా పరిస్థితి ఇలాగే ఉండేదని ‘వదినమ్మ’ సీరియల్‌లో నటిస్తున్న సీనియర్ నటి శివపార్వతి భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. తన గురించి ఆ సీరియల్ నటుడు, నిర్మాత ప్రభాకర్ పట్టించుకోలేదని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇదంతా ఓ చిన్న పొరపాటు వల్లే జరిగిందని పేర్కొంటూ ప్రభాకర్ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు.
‘‘శివపార్వతి అమ్మ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని మీద స్పందించమని నన్ను అభిమానించే వాళ్లు, అలాగే అది నిజమని నమ్మిన వాళ్లు, మీడియా ఛానల్స్ వాళ్లు, అసలేం జరిగిందని తెలసుకోవాలనుకునేవాళ్లు.. అందరూ అడిగారు. ఇంతమంది అడుగుతున్నా కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటే.. ఇన్ని రోజుల తర్వాత అమ్మని నిన్న వీడియోలో చూడటమే. ఆ వీడియోలో ఆమె మాటలు వినడమే. ఎందుకంటే నాకు అటునుంచి ఫోన్లు రాలేదు. నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ మాట్లాడలేదు, వాళ్ల అబ్బాయి మాట్లాడాడు.
ఇవన్నీ అమ్మకు పెద్దగా తెలియకపోవడం వల్ల చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ జరిగి బాధపడి, వీడియో రిలీజ్ చేశారు. అయినా నేను అమ్మ కోలుకోవాలి, అమ్మ కోలుకున్న తర్వాత ఈ విషయం మాట్లాడదామని రియాక్ట్ అవలేదు. కానీ ఇందాక శివ పార్వతమ్మ నాకు ఫోన్ చేసి ‘‘బాబు.. సారీ, చిన్న పొరపాటు జరిగింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలా జరిగింది. నేను అది యూట్యూబ్‌లో కూడా పెట్టలేదు. నాకు సోషల్ మీడియా గురించి కూడా తెలీదు. ‘వదినమ్మ’ గ్రూప్‌లో మాత్రం పెట్టాను. అది బయటకు ఎలా వెళ్లిందో నాకు తెలియదు. నాకు విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. అసలేం జరిగిందనేది మళ్లీ ఇంకో వీడియో పెడతాన’’న్నారు. ఈ వీడియోలు పెట్టడాలు వదిలేయండి. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండమ్మా అని చెప్పాను.
అమ్మకు ఏ అవసరం వచ్చినా చూసుకోడానికి మేమున్నాం, ఎప్పటికీ ఉంటాం కూడా! అమ్మే కాదు, ఇండస్ట్రీలో ఎవరికి ఏం ఆపద వచ్చినా అందరం సాయం చేస్తాం. ఈ సందర్భంగా శివ పార్వతి అమ్మకు కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చేంతవరకు సహాయపడ్డ మా ఇండస్ట్రీలోని గొప్ప వ్యక్తులకు, ముఖ్యంగా శివబాలాజీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, జీవితా రాజశేఖర్, ఇంకా ఎవరెవరు ముందుకొచ్చి అమ్మకు సహాయపడ్డారో వాళ్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ విషయం గురించి తప్పకుండా నేను వివరణ ఇస్తాను. అమ్మ కూడా వివరణ ఇస్తుంది. ప్రస్తుతానికి అమ్మ కోలుకోవాలని మనస్ఫూర్తిగా మనమందరం ప్రార్థిద్దా’’ అని ప్రభాకర్ తెలిపారు. దీంతో శివపార్వతి ఆరోపణలను గూర్చిన రూమర్లకు బ్రేక్ పడింది.
https://www.facebook.com/tvmegastar/posts/998844220562878