ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు: అక్షయ్ కుమార్

ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు: అక్షయ్ కుమార్

Updated On : December 7, 2019 / 1:06 PM IST

కెనడా పౌరసత్వం ఉన్న అక్షయ్ కుమార్ .. భారత పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కెనడియన్ అంటూ పలువురు చేస్తున్న విమర్శలకు విసిగిపోయిన అక్షయ్.. వేరెవ్వరికీ మరో అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనను తాను భారతీయుడిగా నిరూపించుకోవడానికి డాక్యుమెంట్లు చూపించాల్సిన రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఢిల్లీలో జరిగిన హెచ్‌టీ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొని మాట్లాడారు. తనకు కెనడా పౌరసత్వం ఎలా వచ్చిందో వివరించారు. ‘ఒకానొక సమయంలో వరుసగా 14 సినిమాలు ఆశించినంత మేర ఆడలేదు. బతకడానికి ఏదో ఒకటి చేయాలనుకుని నా స్నేహితుడొకరు కెనడాలో ఉంటే అతని దగ్గరకు వెళ్లాను. భారత్‌కు చెందిన వ్యక్తే అయినా అక్కడే స్థిరపడ్డాడు’

‘కలిసి పనిచేద్దామని చెప్పడంతో కెనడా పాస్‌పోర్ట్‌ తీసుకున్నా. సినీ జీవితం ముగిసినట్లే. మళ్లీ తిరిగి రానని అనుకున్నా. అదృష్టవశాత్తు నా 15వ సినిమా హిట్ అందుకోవడంతో సినీ రంగంలో తిరిగి చూసుకోలేదు. అదే సమయంలో భారత పాస్‌పోర్ట్‌ రెన్యూవల్ చేసుకోవడం మరిచిపోయా. ఎప్పుడైతే వివాదం చెలరేగిందో అప్పుడు భారత పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేశా’

‘పాస్‌పోర్టు లేని విషయాన్ని పదే పదే ప్రస్తావించడం ఇష్టం లేక, అలాంటి వారికి మరోసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో భారతీయుడినేనని నిరూపించుకోవడం కోసం పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేశా. నా భార్య, కొడుకు ఇద్దరూ భారతీయులే. మా కుటుంబ సభ్యులంతా భారతీయులే. పన్నులన్నీ ఇక్కడే చెల్లిస్తున్నా. నా జీవితం ఇక్కడే’ అని అక్షయ్‌ వివరించారు.