All Film Industry Getting Huge Losses with High Budget Movies
Film Industry Losses : ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్.. అటు ఇటుగా దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో వినిపిస్తున్న మాట ఇది. భారీ బడ్జెట్.. అంతకుమించి భారీగా అంచనాలతో రిలీజ్ అవుతున్న మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బొక్కా బోర్లా పడుతున్నాయ్. ఫ్లాప్‌లుగా మిగులుతూ సినిమా ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయ్. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు దాదాపుగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. స్టోరీ సెలక్షన్, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో పాన్ ఇండియా లెవల్‌లో ఆడియెన్స్ అటెన్షన్ డ్రా చేస్తున్న మళయాళ ఇండస్ట్రీ కూడా ఇటీవల భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. చిన్న సినిమాలు మాత్రమే మెప్పిస్తున్నాయ్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు తుస్సుమంటున్నాయ్.
2024లో 650 నుంచి 7వందల కోట్ల వరకు మళయాళ ఇండస్ట్రీ నష్టపోయింది. పోనీ ఈ ఇయర్ అయినా బౌన్స్‌బ్యాక్ అవుతుందా అంటే ఒక్క జనవరిలోనే కనీసం వంద కోట్ల నష్టం వచ్చింది. మలయాళంలో 2024లో మొత్తం 204 సినిమాలు రిలీజ్ కాగా అందులో హిట్‌గా నిలిచినవి 26 మూవీస్ మాత్రమే. వెయ్యి కోట్ల ఖర్చుతో సినిమాలు చేస్తే వచ్చిన కలెక్షన్లు దాదాపు 350 కోట్లు మాత్రమే. మంజుమల్ బాయ్స్, ప్రేమలు, కిష్కింధకాండంలాంటి చిన్న సినిమాలు మినహాయిస్తే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపుగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయ్. వందల కోట్ల నష్టాన్ని మిగిల్చాయ్. మోహల్‌లాల్ భారీ ప్రాజెక్ట్ బరోజ్ పెద్ద దెబ్బ వేయగా, మలైకొట్టి వాలిబన్, మళయాళీ ఫ్రమ్ ఇండియా, కొండల్ లాంటి హై బడ్జెట్ మూవీస్ అట్టర్‌ఫ్లాప్‌లుగా మిగిలిపోయాయ్. తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే నష్టం తక్కువే అయినా ఆ లాస్ ఇండస్ట్రీని ఊపిరాకుండా చేస్తోంది.
ఈ ఫ్లాప్స్ దెబ్బకు చాలామంది మళయాళీ నిర్మాతలు దేశం విడిచి వెళ్లిపోతున్నారని సమాచారం. మాములుగా మళయాళీ మూవీస్ అంటే తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్‌తో కంప్లీట్ చేస్తారనే పేరు ఉంది. అలాంటి ఇండస్ట్రీని కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయ్. ఒక్క ఏడాదే 7వందల కోట్ల నష్టం అంటే మాలీవుడ్ కోలుకోవడానికి చాలా టైమ్ పట్టే చాన్స్ ఉంటుంది. ఇటీవల పెరిగిన యాక్టర్ల రెమ్యునరేషన్లకు తోడు కేరళలో ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ కూడా చాలా ఎక్కువ. దీంతో నష్టాలు రెట్టింపు అవుతున్నాయ్. ఈ దెబ్బకు జూన్ ఫస్ట్ నుంచి మాలీవుడ్ నిరసనలకు రెడీ అవుతోంది. షూటింగ్స్, సినిమా హాళ్లు బంద్ అని ప్రకటించాయి. ఓటీటీలు కూడా భారీ బడ్జెట్ సినిమాల కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది.
ఇక తమిళ ఇండస్ట్రీది దాదాపుగా ఇదే పరిస్థితి. 2024లో 3వేల కోట్లు ఖర్చు చేస్తే వెయ్యి కోట్లకు పైగా నష్టమే మిగిలింది. గతేడాది ఓవరాల్‌గా 241 సినిమాలు రిలీజ్ అయితే తమిళ్ లో 18 మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయ్. సక్సెస్ రేషియో 7 శాతం ఉంటే.. ఫెయిల్యూర్ 93శాతంగా ఉంది. ఈ ఇయర్ సూర్య కంగువా, కమల్‌హాసన్ ఇండియన్ 2, రజనీకాంత్ వేట్టయాన్ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నాయ్. ఈ మూడు సినిమాలే దాదాపు 400 కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. తమిళ్ లో 2024 రిలీజ్ సినిమాల్లో దాదాపు 150 మూవీస్ పరిస్థితి అయితే మరింత దారుణం. డిజిటల్, ప్రింట్ ప్రమోషన్‌కు అయిన ఖర్చంత కలెక్షన్లు కూడా రాలేదు. ఇది చాలదా తమిళ ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి. గోట్, అమరన్, రాయన్, అరన్మణి 4, మహారాజాతో పాటు మరో 9 సినిమాలు మాత్రమే తమిళ్ బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచాయ్. 2025 మీద కోలీవుడ్ భారీగా ఆశలు పెట్టుకుంది. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, రజనీకాంత్ కూలీ, కమల్‌హాసన్ థగ్ లైఫ్, సూర్య రెట్రోతో పాటు శివకార్తికేయన్ మూవీ కూడా రాబోతోంది. వీటి మీదే ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది.
Also Read : Naari Song : ఆమని ‘నారి’ సినిమా నుంచి.. స్ఫూర్తిదాయక సాంగ్ విన్నారా..?
బాలీవుడ్‌లోనూ ఇదే సీన్. 2024లో దాదాపు 17వందల కోట్లు నష్టపోయింది. 2023లో బాలీవుడ్ ఓవరాల్ కలెక్షన్లు 5వేల 380 కోట్లు ఉంటే 2024కు అది 4వేల 679 కోట్లకు పడిపోయింది. గతేడాది వచ్చిన కలెక్షన్లలో 31శాతం దక్షిణాది డబ్బింగ్ సినిమాలతోనే. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ మూవీస్ ఘోరంగా బోల్తా పడ్డాయ్. ఓ రేంజ్ అంచనాలతో వచ్చిన బడే మియాన్ చోటే మియాన్, జిగ్రా, సర్‌ఫిరా.. లాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక పోయాయ్. ఈ ఏటాది చావాతో మంచి ఓపెనింగ్ వచ్చినా బాలీవుడ్ ఇది కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది డౌటే. ఇలా ఓవరాల్‌గా బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు ఒక్క హిట్ ప్లీజ్ అన్నట్లుగా ప్రతీ ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. మిగతా ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే టాలీవుడ్ కాస్తలో కాస్త బెటర్ అనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
మిగతా ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే.. టాలీవుడ్ పరిస్థితులు కాస్త పర్వాలేదనిపిస్తున్నాయ్. విడుదల అయినవి ఎక్కువ విజయాలు తక్కువ అన్నట్లే కనిపించినా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం నిరాశపరచలేదు పెద్దగా. 2024లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని టాలీవుడ్ ఏలేసింది. హై బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు మంచి ప్రదర్శనే చేశాయ్. హనుమ్యాన్ నుంచి కల్కి, దేవర పార్ట్ 1.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయ్. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక పేజీని రాసుకున్నాడు పుష్ప. భారీ బడ్జెట్ సినిమాల్లో కొన్ని ఘనవిజయాలు సాధించినా మరికొన్ని చిత్రాలు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలను మిగిల్చాయ్. మిగతా ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే టాలీవుడ్ కాస్త పర్వాలేదనిపించే స్థితిలో ఉంది. 2025 లో ఆల్రెడీ గేమ్ ఛేంజర్ నష్టాలను మొదలుపెట్టినా సంక్రాంతికి వస్తున్నాం లాభాలు తెచ్చింది. మరి 2025 లో టాలీవుడ్ ఎలా ఉంటుందో చూడాలి.
Also See : Prisha Singh : బాబోయ్.. పర్ఫెక్ట్ ఫిగర్ తో ప్రీషా సింగ్.. హాట్ పోజులు..
భాష ఏదైనా.. ఇండస్ట్రీ ఏదైనా.. డిజాస్టర్ లకు చాలానే కామన్ కారణాలు కనిపిస్తున్నాయ్. భారీ బడ్జెట్ సినిమాల వల్లే.. ఇండస్ట్రీకి భారీగా నష్టం వస్తోంది. క్లిక్ అయితే పర్లేదు కానీ కాస్త తేడా కొట్టినా నష్టం అంతే భారీగా ఉంటోంది. సినిమా బడ్జెట్ ఆకాశానికి చేరిపోవడానికి మెయిన్ రీజన్. యాక్టర్ల రెమ్యునరేషన్‌లు మరో రీజన్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్.. ఇప్పుడు మాలీవుడ్ వరకు.. ఇండస్ట్రీ నష్టాలకు ఇదే ప్రధాన కారణం. నిర్మాతలు ఊహించని లెవల్‌లో హీరోలు రెమ్యునరేషన్‌లు డిమాండ్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్‌లో దాదాపు 60శాతం హీరోకు రెమ్యునరేషన్ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. దీంతో బడ్జెట్ కొండంత అవుతోంది. హిట్ అయితే పర్లేదు ఫ్లాప్ అయితే హీరోలు పట్టించుకోకపోవడంతో నిర్మాతల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో ఇదే పరిస్థితి. 1960 నుంచి 1990 మధ్య సినిమాకు గోల్డెన్ ఎరా. ప్రతీ ఒక్కరి రెమ్యునరేషన్‌ను నిర్మాతే డిసైడ్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు సీన్ మారింది. మూవీ అనేది నిర్మాత చేతుల్లో ఉండట్లేదు. దీంతో బడ్జెట్‌కు బోర్డర్ కూడా కనిపించట్లేదు. సినిమా ఇండస్ట్రీ నష్టానికి ఇదే ప్రధాన కారణం.
భారీ బడ్జెట్.. అవాక్కయ్యే స్టార్ క్యాస్టింగ్ ఎంత ఉన్నా స్టోరీలో దమ్ము లేకపోతే ప్రేక్షకుడు సినిమాను నిర్దాక్షిణ్యంగా శిక్షించేస్తున్నాడు. స్క్రీన్ మీద ఏదో హడావుడి చేసేస్తే సరిపోద్ది అనుకునే పరిస్థితులు లేవ్. స్టోరీ, స్క్రీన్‌ప్లే, మేకింగ్.. ప్రతీ విషయాన్ని ప్రేక్షకులు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఒకప్పుడు ఇండియన్ సినిమాను ఏలిన బాలీవుడ్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తోంది అందుకే. కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలాసార్లు ప్రూవ్ అయింది. కాంబినేషన్ సెట్ అయింది కదా అని వందల, వేలు కోట్లు పెట్టినంత మాత్రాన ఎలాంటి లాభం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు నిర్మాతలు, దర్శకుడు ఈ విషయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. నష్టాలు ఇదే లెవల్‌లో కంటిన్యూ అయితే సినిమా ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది.