Allu Aravind Comments on Congress Winning in Telangana
Allu Aravind : తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడనుంది. తెలంగాణలో కొత్త సీఎం, కొత్త ప్రభుత్వం రానుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కాంగ్రెస్ విజయం, ప్రభుత్వ మార్పుతో సినీ పరిశ్రమలో కూడా చర్చలు మొదలయ్యాయి. ఇకపై సినీ పరిశ్రమ ఎలా ఉండనుంది? సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారాలు ఎలా ఉండనున్నాయి? సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరు? ఇకపై అయినా నంది అవార్డులు ఇస్తారా.. అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కాంగ్రెస్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. తాజాగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా కాంగ్రెస్ గెలుపుపై స్పందించారు. నేడు ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న అల్లు అరవింద్ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయి. ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. త్వరలోనే సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం అని అన్నారు.