Allu Arjun Interesting Comments on National Award in Unstoppable Show
Allu Arjun : అల్లు అర్జున్ కు పుష్ప సినిమాకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మొదటి సారి ఓ తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఈ అవార్డుపై బన్నీతో పాటు టాలీవుడ్ అంతా సంతోషించింది. తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు అల్లు అర్జున్ రాగా నేషనల్ అవార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అది కొంతమందికి డేడికేట్ చేశాడు.
నేషనల్ అవార్డు గురించి బాలయ్య అన్‌స్టాపబుల్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేషనల్ అవార్డు ఎవరికీ రాలేదని తెలిసి అది రౌండప్ చేసి దాన్ని కొట్టాలని అనుకున్నాను. సుకుమార్ నాకు కథ చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను నాకు ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావాలని. ఇది నేను అనుకుంటే రాదు నువ్వే అనుకోవాలి అన్నాడు సుకుమార్. షూటింగ్ సమయంలో నేను యాక్ట్ చేసిన తర్వాత సుకుమార్ మానిటర్ లో చూసి నేషనల్ అవార్డుకు ఇది సరిపోదు అనేవాడు. సినిమాకు ప్రతి షాట్, సీన్ నేషనల్ అవార్డు టార్గెట్ పెట్టుకొని చేశాను. ఇప్పుడు అవార్డు కొట్టాను కాబట్టి చెప్తున్నాను. అది గురి చూసి సాధించాలని కొట్టాను. అలాగే కమర్షియల్ సినిమాలంటే చిన్నచూపు ఉంది. అందరూ ఆదరించేవే కమర్షియల్ సినిమాలు. వాటికి అవార్డు వస్తే గౌరవం పెరుగుతుంది అని ఎలాగైనా పుష్పకు అవార్డు రావాలని అనుకున్నాను అని అన్నారు.
అలాగే.. నాకు వచ్చిన నేషనల్ అవార్డును మన తెలుగు హీరోలందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఈ మాట ఎక్కడా చెప్పలేదు. మీ అందరి తరపున నాకు వచ్చింది అని ఫిల్ అవుతున్నాను అని అన్నారు అల్లు అర్జున్. దీంతో వెంటనే బాలయ్య లేచి వచ్చి అల్లు అర్జున్ ని కౌగలించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ తన నేషనల్ అవార్డుని తెలుగు హీరోలందరికీ డెడికేట్ చేయడంతో మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా బన్నీ ని అభినందిస్తున్నారు.