Ananya Nagalla Anveshi Movie Review and Rating
Anveshi Movie Review : వకీల్ సాబ్, మల్లేశం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనన్య నాగళ్ళ(Ananya Nagalla) పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తుంది. తాజాగా అనన్య నాగళ్ళ, విజయ్ ధరన్, సిమ్రాన్ గుప్తా(Simran Gupta) ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన అన్వేషి సినిమా నిన్న నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కొత్త దర్శకుడు VJ ఖన్నా దర్శకత్వంలో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గణపతి రెడ్డి నిర్మాణంలో తెరకెక్కింది అన్వేషి సినిమా.
కథ విషయానికొస్తే.. విక్రమ్(విజయ్ ధరన్) అను(సిమ్రాన్ గుప్తా)ని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం మారేడు కోన అనే ఓ గ్రామానికి ఆమెని వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే అక్కడ ఉన్న ఓ హాస్పిటల్ దగ్గర్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఊర్లో వాళ్లంతా గతంలో హాస్పిటల్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన డాక్టర్ అను(అనన్య నాగళ్ళ) ఆత్మగా మారి ఈ హత్యలు చేస్తుందని భావిస్తారు. దీంతో విక్రమ్.. డాక్టర్ అను ఎవరు? ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అనేది చేధించడానికి ట్రై చేస్తాడు. ఈ క్రమంలో విక్రమ్ కి ఎదురైన అనుభవాలేంటి? డాక్టర్ అను ఎలా చనిపోయింది? హత్యలు ఎవరు చేస్తున్నారు? విక్రమ్ ప్రేమ ఫలించిందా అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. మొదట కాసేపు ప్రేమకథ చూపిస్తారు. హీరో – హీరోయిన్ మధ్య సాగే సన్నివేశాలు మాములు ప్రేమకథల్లానే ఉంటాయి. హీరో గ్రామానికి వెళ్ళాక అక్కడ హత్యలు, హాస్పిటల్ గురించి, డాక్టర్ అను గురించి తెలుసుకోవడం కథని ఆసక్తికరంగా తీసుకెళ్తాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కావడంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పర్వాలేదనట్టుగానే సాగుతుంది అన్వేషి. చివర్లో విలన్ క్యారెక్టర్ ని సింపుల్ గా ముంగిచేస్తారు. క్లైమాక్స్ ఇంకొంచెం బలంగా అంటే బాగుండు అనిపిస్తుంది.
నటీనటుల విషయానికొస్తే.. హీరోగా నటించిన విజయ్ ధరన్ అటు ప్రేమ కథతో, ఇటు మిస్టరీని ఛేదించడంతో తన నటనతో పర్వాలేదనిపిస్తుంది. సిమ్రాన్ గుప్తా తన అందాలతో ఆకట్టుకుంటూనే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో నటనతో కూడా మెప్పిస్తుంది. ఇక అనన్య నాగళ్ళ మంచి డాక్టర్ పాత్రలో అందర్నీ మెప్పిస్తుంది. అజయ్ ఘోష్ నెగిటివ్ రోల్ లో అదరగొడతారు. రచ్చ రవి, నాగి అక్కడక్కడా తమ కామెడీతో పర్వాలేదనిపించారు.
Also Read : Sapta Sagaralu Dhaati Side B : సప్త సాగరాలు దాటి సైడ్ B రివ్యూ.. హీరో జైలు నుంచి బయటకు వచ్చి ఏం చేశాడు?
టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. థ్రిల్లర్ సబ్జెక్ట్ ని డైరెక్టర్ స్క్రీన్ ప్లే బాగానే గ్రిప్పింగ్ గా రాసుకున్నాడనే చెప్పొచ్చు. సస్పెన్స్ సాగే సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. కెమెరా విజువల్స్ కూడా గ్రామంలో జరిగే కథ కావడంతో అక్కడి లొకేషన్స్ కి తగ్గట్టు అందంగా చూపించారు. నిర్మాణ విషయంలోనూ బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తానికి అన్వేషి హత్యల నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథ. థ్రిల్లింగ్, మర్డర్ మిస్టరీ సినిమాలు ఇష్టపడేవాళ్లు ఈ సినిమాని చూసేయొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..