Arjun Chakravarthy : ‘అర్జున్ చక్రవర్తి’ మూవీ రివ్యూ.. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కథ..

అర్జున్ చక్రవర్తి సినిమా నల్గొండకు చెందిన ఓ మాజీ కబడ్డీ ప్లేయర్ కథను ఆధారంగా తీసుకొని కల్పితంగా రాసుకొని తెరకెక్కించారు.(Arjun Chakravarthy)

Arjun Chakravarthy : ‘అర్జున్ చక్రవర్తి’ మూవీ రివ్యూ.. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కథ..

Arjun Chakravarthy

Updated On : August 29, 2025 / 7:13 AM IST

Arjun Chakravarthy : విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘అర్జున్ చక్రవర్తి’. శ్రీని గుబ్బల నిర్మాణంలో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ కి ముందే ఈ సినిమా పలు దేశాల్లో ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకుంది. అర్జున్ చక్రవర్తి సినిమా నేడు ఆగస్టు 29న థియేటర్స్ లో రిలీజయింది.(Arjun Chakravarthy)

కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా 1980 నుంచి 1996 మధ్యలో జరుగుతుంది. అర్జున్ చక్రవర్తి(విజయ్ రామరాజు) ఓ అనాథ. మాజీ కబడ్డీ ప్లేయర్ అయిన రంగయ్య(దయానంద్ రెడ్డి) అర్జున్ ని తెచ్చుకొని పెంచుకుంటాడు. వీరిద్దరూ సొంత మామ అల్లుడిలా క్లోజ్ అవుతారు. రంగయ్య స్పూర్తితో అర్జున్ కూడా కబడ్డీ నేర్చుకుంటాడు. ఇండియన్ నేషనల్ టీమ్ కి ఆడాలని అర్జున్ కల. డిస్ట్రిక్ లెవల్ ఆడేటప్పుడు దేవకి(సిజా రోజ్)పరిచయమై ప్రేమలో పడతారు. స్టేట్ లెవల్ కి వెళ్ళినప్పుడు దేవకికి పెళ్లి అయిపోతుంది. దీంతో అర్జున్ బాధపడుతూ కూర్చుంటే తన మామ రంగయ్య ని చూసి మళ్ళీ ఆట మీద ఫోకస్ పెట్టి నేషనల్స్ కి ఆడతాడు.

నేషనల్ టీమ్ తరపున ఆడి గెలిచి వచ్చాక కబడ్డీ కోచింగ్ పెడదాం అనుకుంటాడు. కానీ అర్జున్ పేదవాడు కావడం, గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు, భూములు అధికారులు నొక్కేసి ఇవ్వకపోవడం, తండ్రిలా పెంచిన రంగయ్య చనిపోవడంతో అర్జున్ తాగుడుకు బానిసయి ఒంటరిగా ఉండిపోతాడు. అలాంటి సమయంలో కోచ్ కులకర్ణి(అజయ్) అర్జున్ ని వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ ఆడమని అడుగుతాడు. మరి అర్జున్ మళ్ళీ కబడ్డీ ఆడతాడా? ఆటలో, జీవితంలో గెలుస్తాడా? దేవకి మళ్ళీ అర్జున్ కి తారసపడుతుందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Tribanadhari Barbarik : ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ రివ్యూ.. మహాభారతం పాత్రకు ఇప్పటి క్రైమ్ ని లింక్ చేసి..

సినిమా విశ్లేషణ..

మన దగ్గర స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువగా వస్తుంటాయి. జెర్సీ తర్వాత అలాంటి సినిమా మళ్ళీ రాలేదు. ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నల్గొండకు చెందిన ఓ మాజీ కబడ్డీ ప్లేయర్ కథను ఆధారంగా తీసుకొని కల్పితంగా రాసుకొని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో రివర్స్ స్క్రీన్ ప్లే తో అర్జున్ కథ, అర్జున్ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలవడం, ప్రేమకథతో సాగుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ కి వేరే పెళ్లి అయిపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ చాలా వరకు విషాద గాధలాగానే నడిపించారు. రంగయ్యతో ఎమోషన్, ప్రేమించిన అమ్మాయి దూరమయింది, గవర్నమెంట్ అధికారులు ఆటగాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం.. ఈ సీన్స్ అన్ని చాలా ఎమోషనల్ గా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి కన్నీళ్లు పెట్టాల్సిందే. ఇక క్లైమాక్స్ లో హీరో మళ్ళీ ఆడతాడా లేదా అనే ఆసక్తితో ఉంటుంది.(Arjun Chakravarthy)

కబడ్డీ మ్యాచ్ లు అన్ని ఉత్కంఠంగా రాసుకున్నా చాలా కంటిన్యుటీ మిస్టేక్స్ ఉన్నాయి. జెర్సీ లో ఎన్నో బాల్, ఎన్ని రన్స్, ఫీల్డ్ లో ప్లేయర్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ ఇందులో అవుట్ అయిన ప్లేయర్స్ లోపల ఉండటం, రిపీటెడ్ షాట్స్ వాడటం, ఒకే లోకేషన్ ని అటు ఇటు వేరు మ్యాచ్ లకు చూపించడం.. ఇలాంటివన్నీ ఇంకా క్లారిటీగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా కాస్త స్లో నేరేషన్ ఉంటుంది.

ఈ సినిమా కథ ప్రకారం అయితే హ్యాపీ ఎండింగ్ కంటే విషాద ముగింపు అయితే ఇంకా బాగుండు ఏమో అనిపిస్తుంది. జెర్సీ హిట్ అవ్వడానికి రియాల్టీగా విషాదంతో ముగించారు అనేది కూడా ఒక కారణం. కానీ ఇందులో చివరికి హీరోయిక్ గా మారిపోయి, హీరో లైఫ్ మారిపోవడం అప్పటివరకు చూపించిన సినిమా కథకు సింక్ అవ్వదు. భీమిలి కబడ్డీ జట్టులా ఒక కన్నీటి ముగింపు ఇచ్చి ఉంటే ప్రేక్షకులు అదే భారమైన ఎమోషన్ తో బయటకు వెళ్ళేవాళ్ళు. 1980,90 ల కాలంలో కథ రాసుకొని ఆ కాలాలకు తగ్గట్టే ఎక్కడా అనుమానం రాకుండా విజువల్ గా కూడా అలాగే చూపించారు.

Arjun Chakravarthy

నటీనటుల పర్ఫార్మెన్స్..

టైటిల్ రోల్ పోషించిన విజయ్ రామరాజు ప్రాణం పెట్టి చేసాడు అనిపిస్తుంది. తన పాత్రలో వేరియేషన్స్ కోసం తన బాడీని సీన్స్ కి తగ్గట్టు మార్చుకొని కష్టపడ్డాడు. నటన పరంగా కూడా చక్కగా మెప్పించాడు. సిజా రోజ్ ప్రేమ కథలో క్యూట్ గా కనిపించి మెప్పిస్తుంది. దయానంద్ రెడ్డి కూడా రెండు మూడు ఏజ్ వేరియేషన్స్ లో చాలా బాగా నటించాడు. చాన్నాళ్లకు దయానంద్ కి ఒక మంచి పాత్ర పడింది. అజయ్ కోచ్ పాత్రలో పర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also See : Mirai Trailer Launch Event : ‘మిరాయ్‌’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లొకేషన్స్, విజువల్స్ 80,90 ల కాలానికి తగ్గట్టు బాగానే చూపించారు. లొకేషన్స్ కోసం బాగానే వెతికి కష్టపడినట్టు తెలుస్తుంది. కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. కబడ్డీ ఆట విజువల్స్ లో కూడా ఎడిటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మెలోడీ సాంగ్స్ నచ్చేవారు రిపీట్ మోడ్ లో వినొచ్చు. ఒక వ్యక్తి కథ ఆధారంగా కల్పిత అంశాలు జోడించి ఎమోషనల్ కథగా దర్శకుడు బాగానే రాసుకున్నాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘అర్జున్ చక్రవర్తి’ సినిమా జీవితంలో, కబడ్డీ ఆటలో ఓడి గెలిచిన ఓ ఆటగాడి కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.