Tribanadhari Barbarik : ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ రివ్యూ.. మహాభారతం పాత్రకు ఇప్పటి క్రైమ్ ని లింక్ చేసి..
ఘటోత్కచుడి కొడుకు బార్బరీకుడు టైటిల్ పెట్టి హైప్ ఇవ్వడంతో మైథలాజి టచ్ ఉంటుందని సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Tribanadhari Barbarik)

Tribanadhari Barbarik
Tribanadhari Barbarik : వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ సినిమాలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన, వీటివి గణేష్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది. ముందుగానే పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు.(Tribanadhari Barbarik)
కథ విషయానికొస్తే.. శ్యామ్(సత్యరాజ్) ఒక పెద్ద సైక్రియాట్రిస్ట్. తన మనవరాలు నిధి(మేఘన)తో కలిసి ఉంటాడు. ఇండిపెండెన్స్ డే రోజు స్కూల్ కి వెళ్లిన నిధి రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తను కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. దీంతో అక్కడ SI ఒక పోలీస్(సత్యం రాజేష్) ని ఇచ్చి శ్యామ్ తో పంపిస్తాడు. దీంతో వీరిద్దరూ వీళ్లకు దొరికిన క్లూలతో నిధిని వెతకడం మొదలుపెడతారు.
మరో వైపు రామ్(వసిష్ఠ సింహ) అమెరికాకు వెళ్లాలని ట్రై చేస్తూ ఉంటాడు. అందుకు కావాల్సిన డబ్బుల కోసం తన ఫ్రెండ్, వాకిలి పద్మ(ఉదయభాను) అల్లుడు అయిన దేవా(క్రాంతి కిరణ్)తో కలిసి అడ్డదారులు తొక్కుతాడు. దేవాని దాసన్న(రాజేంద్రన్)తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇమ్మని బెదిరిస్తాడు. మరి దేవా, రామ్ లు డబ్బులు ఎలా సంపాదిస్తారు? నిధి ఏమైంది? నిధి దొరికిందా? నిధి కోసం శ్యామ్ ఏం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Sundarakanda : ‘సుందరకాండ’ మూవీ రివ్యూ.. బాబోయ్ ట్విస్ట్, లవ్ స్టోరీ మాములుగా లేదుగా..
సినిమా విశ్లేషణ..
మహాభారతంలో ఘటోత్కచుడి కొడుకు బార్బరీకుడు టైటిల్ పెట్టి ప్రమోషన్స్ లో హైప్ ఇవ్వడంతో ఇదేదో మైథలాజి టచ్ ఉంటుందని సినిమాపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. బార్బరీకుడు మూడు బాణాలతోనే యుద్ధం అంతం చేయగల సామర్ధ్యుడు. ఆ మూడు బాణాలు ఏంటి? వాటికి సంబంధించిన కథ ఏంటి అని గ్రాండ్ గా ఊహించుకొని వెళ్తాము. కానీ సినిమాలో వీటి గురించి ఓ నాటకంలో, అక్కడక్కడా మాములు విజువల్స్ తో చెప్పేసి ఆ మూడు బాణాలకు అర్ధం ఏంటో దానికి తగ్గట్టు విలన్ ని ఎలా చంపారు అనేది చూపించడంతో కథకి ఆ టైటిల్ కి అసలు సంబంధమే లేదు అని అనిపిస్తుంది.(Tribanadhari Barbarik)
ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆమెకు సంబంధించిన వాళ్ళు చేతికి మట్టి అంటకుండా ఎలా రివెంజ్ తీర్చుకుంటారు అంతే కథ. ఈ కథ ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో వచ్చింది. ఈ కథని త్రిబాణధారి బార్బరిక్ అని, అక్కడక్కడా బార్బరీకుడి బాణాల గురించి చెప్తూ అతనికి కథని లింక్ చేయాలని డైరెక్టర్ బాగా ప్రయత్నించాడు. ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే ప్రస్తుతం, గతానికి తిరుగుతున్నట్టు ఆసక్తిగా రాసుకున్నా అక్కడక్కడా కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది.
సినిమా కాస్త స్లో నేరేషన్ లోనే సాగుతుంది. కాకపోతే అవసరం అయిన చోట ఎలివేషన్స్ మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సపోర్ట్ తో బాగానే ఇచ్చారు. క్లైమాక్స్ లో రెండు మూడు ట్విస్టులు బాగుంటాయి కానీ రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు, డైలాగ్స్ చాలా వరకు ముందే ఊహించేయొచ్చు. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని బార్బరీకుడికి కనెక్ట్ చేసి కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేసాడు డైరెక్టర్. అక్కడక్కడా సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు వర్కౌట్ అయ్యాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్..
వశిష్ఠ సింహ రెండు వేరియేషన్స్ లో బాగానే మెప్పించాడు. సాంచి రాయ్ లవ్ స్టోరీతో పాటు ఓ బరువైన ఎమోషన్ మోస్తున్న పాత్రలో బాగానే నటించింది. సత్యరాజ్ తన మనవరాలి కోసం పడే బాధతో, సైకియాట్రిస్ట్ గా మెప్పిస్తారు. మనవరాలి పాత్రలో మేఘన పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
ఈ సినిమాతో యాంకర్, నటి ఉదయభాను రీ ఎంట్రీ ఇచ్చింది కానీ ఆమె పాత్రకు అసలు కథకు సంబంధమే ఉండదు. కానీ తనకిచ్చిన తెలంగాణలో లేడీ డాన్ పాత్రలో న్యాయం చేసింది. శవం చూస్తే మూర్ఛపోయే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే పాత్రలో సత్యం రాజేష్ బాగా నటించాడు. క్రాంతి కిరణ్, వీటివి గణేష్, రాజేంద్రన్, కార్తికేయ దేవ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.(Tribanadhari Barbarik)
Also See : Mirai Trailer Launch Event : ‘మిరాయ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. కథ చాలా వరకు రాత్రి పూటే జరుగుతుంది. దానికి తగ్గట్టు పర్ఫెక్ట్ విజువల్స్ చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. పాటలు యావరేజ్. ఒక రొటీన్ కథని బార్బరీకుడు, అతని మూడు బాణాలకు లింక్ పెట్టి రాసుకోవాలి అనే ఆలోచనకు దర్శకుడిని మెచ్చుకోవచ్చు. ఎడిటింగ్ పరంగా కొని సీన్స్ షార్ప్ కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తానికి ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కి బార్బరీకుడి మూడు బాణాల కథకి లింక్ చేస్తూ కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.