Audience in anger : విచ్చల విడి శృంగారం, బూతు డైలాగులు.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌కి తెగులు పట్టిందా?.. మండిపడుతున్న సగటు ప్రేక్షకులు
ఓటీటీలు, వెబ్ సిరీస్‌లలో శృంగారం మోతాదు ఎక్కువైందని, బూతు డైలాగ్స్‌తో చూడటానికి అభ్యంతరకరంగా ఉంటున్నాయని ప్రేక్షకులు మండిపడుతున్నారు. వీటిపై ప్రభుత్వాలు సెన్సారు తరహాలో నియంత్రణ తీసుకురావాలని లేదంటే భవిష్యత్‌లో బూతు సినిమాలు మాత్రమే తెరపై చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

Audience in anger
Audience in anger : సినిమా అంటే ఒకప్పుడు పూర్తిగా ఎంటర్టైన్‌మెంట్.. కొత్త సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని జనం ఎదురుచూసేవారు. కుటుంబ సమేతంగా వెళ్లి చూసేవారు. సినిమాలో పాటలు, డైలాగులు, డ్రెస్సులు ఏవీ అభ్యంతరకరంగా ఉండేవి కావు. ఒక ఐటం సాంగ్ గురించి, ఒక ముద్దు సీన్ గురించి చాలా విచిత్రంగా చెప్పుకునేవారు. కాలం చాలా ఫాస్ట్‌గా మారిపోయింది. రాబోయే రోజుల్లో తెలుగు తెరపై బూతు సినిమాలు మాత్రమే చూడాల్సి వస్తుందేమో అని ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది. అటు యూట్యూబ్ ఛానెల్స్, ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌పై నియంత్రణ లేకపోవడం కూడా ఈ తరహా సినిమాలు వీడియోలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ప్రేక్షకులు వాపోతున్నారు.
Lust Stories 2 Trailer : లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ రిలీజ్.. తమన్నా, విజయ్ వర్మ రొమాన్స్!
సినిమా పరిధి పెరిగింది. అవకాశాలు పెరిగాయి. ఎంతోమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ఇటు సోషల్ మీడియా సైతం టాలెంట్ ఉన్నవారికి మంచి వేదిక అయ్యింది. ప్రతి ఒక్కరూ తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ ఈ క్రమంలోనే కొందరు పరిథులు దాటిపోతున్నారు. శృంగార వీడియోలు, బూతు డైలాగ్స్‌తో కూడిన వీడియోలు యూట్యూబ్ చానెల్స్‌లో కుప్పలు తెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. ఎలాంటి వీడియోలు చేయడానికైనా కొందరు ఆలోచించట్లేదు. ఏ కంటెంట్ చూపించినా జనం గొర్రెల్లా చూస్తున్నారని డిసైడ్ అయిపోయారు.
ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో ప్రత్యర్థులపై రాజకీయ నేతలు, సినిమా స్టార్లు, సామాన్యులు పచ్చి బూతులతో చేసుకునే మాటల దాడులు చూస్తున్నాం. ఎంతో ఫేమ్ ఉన్నవారు సైతం తమ స్ధాయిని దిగజార్చుకుని ఇలాంటి వీడియోలు చేస్తూ కంటెంట్ ఇవ్వడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తోంది. కొన్ని వీడియోలు ఫాలో అవుతూ పిల్లలు సైతం పెడదారిన పడ్డారన్న వార్తలు కూడా వింటున్నాం. వీటిపై గట్టి నిఘా లేకపోవడం.. చర్యలు లేకపోవడంతో కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.
ఇక ఓటీటీకి వచ్చేసరికి.. పెద్ద స్టార్లు, చిన్న స్టార్లు చాలామంది ఇప్పుడు ఓటీటీపై ఎగబడుతున్నారు. సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో వచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నారు బోల్డ్ సీన్స్ చేయడానికి పెద్ద నటులు సైతం నో చెప్పట్లేదు. ఒకప్పుడు వారిపై ఆడియన్స్‌కి ఉన్న అభిప్రాయాల్ని తారుమారు చేస్తూ భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. వారిపై ట్రోలింగ్ జరుగుతున్నా అది కూడా ఫేమ్ లాగ భావిస్తున్నారు. ఇంట్లో పిల్లల మధ్య కూర్చుని చూడలేని సీన్స్, డైలాగులతో సినిమాలు హోరెత్తిపోతున్నాయి. ఇలాంటి సినిమాలపై నియంత్రణ పెట్టండి అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. తమ పిల్లలు చెడిపోతున్నారని వాపోతున్నారు. ఇవేమీ ప్రభుత్వం చెవికెక్కడం లేదు.
ఇటీవల కాలంలో మంచి కథలు ఉన్న సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు కరువైపోయాయని సగటు ప్రేక్షకుడు గగ్గోలు పెడుతున్నాడు. కోట్లు పెట్టి సినిమాలు తీసినా ట్రైలర్, టీజర్లు రిలీజ్ చేసేటప్పుడు ఉన్న హడావిడి సినిమాలో ఉండటం లేదు. సినిమాకు కోట్లు పెట్టామా? ఎంత వసూలైంది? ఎన్ని రికార్డులు బద్దలు కొట్టామా? అని నిర్మాతలు చూసుకుంటున్నారు కానీ.. చాలా సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండటం లేదు. అవి ఎప్పుడు వచ్చి పోతున్నాయో కూడా తెలియడం లేదు. సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు బోల్డ్ సినిమాల్లో నటిస్తూ బోలెడు చెడ్డ పేరు మూట కట్టుకుంటున్నారు. కరోనా పుణ్యమా అని ఇప్పటికే థియేటర్లను ప్రేక్షకులు చాలామంది మర్చిపోయారు. ఇక ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల్ని ప్రేక్షకుడు బ్యాన్ చేయకుండా బతికించుకోవాలంటే వాటికి పట్టిన తెగులు వదిలించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం వీటిపై ఎలాంటి దృష్టి పెడుతుందో చూడాలి.