VanaVeera Review : ‘వనవీర’ మూవీ రివ్యూ.. సామాన్యుడు వర్సెస్ రాజకీయ నాయకుడు..
టీజర్, ట్రైలర్స్ చూసి హనుమంతుడి రిఫరెన్స్, బైక్ చుట్టూ కథ అని ఊహించుకొని వెళ్తే కులాల చుట్టూ తిరిగే కథ చెప్పడం గమనార్హం. (VanaVeera Review)
VanaVeera Review
VanaVeera Review : అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘వనవీర’. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి నిర్మాణంలో అవినాష్ తిరువీధుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మొదట వానర అనే టైటిల్ తో ప్రచారం చేయగా సెన్సార్ బోర్డు సినిమా కంటెంట్ చూసి ఆ టైటిల్ కి అభ్యంతరం చెప్పడంతో వనవీర అని మార్చారు. వనవీర సినిమా నేడు జనవరి 1న థియేటర్స్ లో రిలీజయింది.(VanaVeera Review)
కథ విషయానికొస్తే..
రఘు(అవినాష్) ఓ ఊళ్ళో ఖాళీగా తన మరదలు(సిమ్రాన్ చౌదరి)తో తిరుగుతూ ఉంటాడు. రఘు తండ్రి(శివాజీరాజా) దుబాయ్ లో ఉన్న తన పెద్ద కొడుకు దగ్గరకు వెళ్తాడు. అదే ఊళ్ళో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న దేవా(నందు) పార్టీ పెద్దల ముందు తన బలం చూపించుకోడానికి బైక్ ర్యాలీ నిర్వహిస్తాడు. ఇందుకు భారీగా బైక్ లు కావాల్సి రావడంతో దేవా మనుషులు రఘు బైక్ కూడా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తారు.
కానీ బైక్ తిరిగి ఇవ్వకపోవడంతో తన దగ్గర బైక్ తీసుకున్న బసవన్న(ప్రభాకర్) వెనకే బైక్ కోసం తిరుగుతూ దేవా అడ్డాలోకి ఎంటర్ అవుతాడు రఘు. అక్కడ రఘుని తక్కువ చేసి కులంతో అవమానించడం, కొన్ని పనులు చెప్పడంతో ఎలాగైనా బుద్ది చెప్పాలి, దేవాని కలవాలి అనుకుంటాడు. అసలు రఘు బైక్ ఏమైంది? దేవాకు – రఘుకు మధ్య ఏం జరిగింది? దేవా ఎమ్మెల్యే అవుతాడా? దేవాతో పెట్టుకొని రఘు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Psych Siddhartha Review : ‘సైక్ సిద్దార్థ’ రివ్యూ.. దరిద్రం అంతా వీడి లైఫ్ లోనే ఉందిగా..
సినిమా విశ్లేషణ..
వానర అని మొదట ప్రచారం చేసి, గ్లింప్స్, టీజర్ , ట్రైలర్స్ లో కూడా రామాయణంలో వానర సేన అంటూ లింక్ పెట్టడంతో ఇదేదో పురాణాలతో లింక్ అయి ఉంది అని అంచనాలు నెలకొన్నాయి. ఇక చివర్లో సెన్సార్ అభ్యంతరంతో టైటిల్ మార్చడం, హీరో స్టేజి మీద ఎమోషనల్ అవ్వడం, నందు మీద విమర్శలు చేయడం, నందు కౌంటర్ ఇవ్వడం.. వీటన్నిటితో వనవీర సినిమాకు గట్టిగానే ప్రమోషన్ అయింది.
సినిమాలో రామాయణం, వానరులకు ఈ కథకు ఏదో లింక్ ఉంది అనుకోని వెళ్తే అసలు ఎలాంటి లింక్ ఉండదు అని క్లారిటీగా అర్ధమవుతుంది. ఇటీవల డివోషనల్ టచ్ ఇచ్చి, చివర్లో దేవుడ్ని హైలెట్ చేస్తే సినిమాలు వర్కౌట్ అవుతున్నాయని అందరూ అదే చేస్తున్నారు. ఇందులో కూడా కథకు సంబంధం లేకపోయినా వానరులు, హనుమంతుడిని లింక్ చేసారు. టైటిల్ కి సెట్ అవ్వాలి కాబట్టి సినిమా ముందు AI తో ఓ కథ చెప్పారు. మధ్యమధ్యలో వానరులు అని కథ స్వభావాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కానీ కథకి వానరులకు సంబంధమే లేదు. అసలు ఈ కులాల కథలోకి హనుమంతుడు ఎందుకు వచ్చాడో.
VanaVeera Review
ఇక ఇదొక రెగ్యులర్ కథే. ఖాళీగా ఊళ్ళో తిరిగే ఓ అబ్బాయి అనుకోకుండా ఓ రాజకీయ నాయకుడు జీవితంలోకి రావడం, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, కొన్ని ఫ్లాష్ బ్యాక్ లతో రొటీన్ గానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్, ఫ్యామిలీల పరిచయం, బైక్ కథతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ముందు దేవా మనుషులను రఘు కొట్టడం, బైక్ గురించి ఓ ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ లో రెగ్యులర్ ట్విస్ట్ లు, అవే పాత కులం కథలు, రొటీన్ ఫ్లాష్ బ్యాక్ లు, హీరో జనాల్ని మార్చేసి విలన్ ని ఓడించడం.. అంటూ సాగుతుంది.
వనవీర, వానర అని టైటిల్ పెట్టి కుల పిచ్చి అని, కొన్ని కులాలను మరీ తక్కువ చేసి చూస్తున్నారని చూపించారు. కులానికి సంబంధించి చూపించిన కొన్ని సీన్స్ చూస్తే.. ఎపుడో ఓ ముప్పై నలభై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు అప్పటి సినిమాల్లో చూపించిన సీన్స్ పెట్టుకొని సమాజం ఇంకా అక్కడే ఉందేమో అని భ్రమపడుతూ దర్శకుడు ఇంకా అక్కడే ఆగిపోయాడు అనిపిస్తుంది. ఇలాంటి కథకు వానర, వనవీర అనే టైటిల్ ఎలా పెట్టారో దర్శకుడికే తెలియాలి. సెన్సార్ టైటిల్ కి అభ్యంతరం చెప్పడం మంచిదయింది అనిపిస్తుంది.
ఇక చివర్లో ఇటీవల వచ్చే డివోషనల్ సినిమాల్లాగే హైప్ కోసం హనుమంతుడి రిఫరెన్స్ తీసుకొచ్చారు. క్లైమాక్స్ లో సత్య కామెడీ తప్ప మిగిలిన కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ అన్ని ట్విస్ట్ లు ముందే ఊహించేయొచ్చు. ఇక టీజర్, ట్రైలర్స్ చూసి హనుమంతుడి రిఫరెన్స్, బైక్ చుట్టూ కథ అని ఊహించుకొని వెళ్తే కులాల చుట్టూ తిరిగే కథ చెప్పడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
కొత్త హీరో అవినాష్ ఓ పక్క డైరెక్షన్ చేస్తూనే మరో పక్క హీరోగా కూడా తన పాత్రకు ఒక యాటిట్యూడ్ చూపిస్తూ బాగానే నటించాడు. నందు విలన్ గా నెగిటివ్ రోల్ లో బాగా మెప్పించాడు. ఈ సినిమా తర్వాత భవిష్యత్తులో నందుకు నెగిటివ్ రోల్స్ ఇంకా వస్తాయేమో చూడాలి.
సిమ్రాన్ చౌదరి అక్కడక్కడా కనిపించి గ్రామీణ యువతీ పాత్రలో మెరిపించింది. శివాజీ రాజా తండ్రి పాత్రలో బాగానే నటించారు. ఆమని, దేవి ప్రసాద్, ప్రభాకర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. రచయిత కోన వెంకట్ రాజకీయ నాయకుడి పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం గమనార్హం.
Also Read : Gatha Vaibhavam Review : ‘గత వైభవం’ మూవీ రివ్యూ.. జన్మజన్మల ప్రేమకథ..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్. రెగ్యులర్ కథని తీసుకొని దానికి వానర జాతిని జోడించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘వనవీర’ సినిమా కులాల కథకు వానరులకు లింక్ పెడుతూ కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
