Basil Joseph Malayalam Movie Maranamass Review
Maranamass Movie Review : మలయాళం స్టార్ బసిల్ జోసఫ్, అనిష్మ, సిజు సన్నీ,బాబు ఆంటోనీ, రాజేష్ మాధవన్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా మరణమాస్. సిజు సన్నీ కథ అందించగా శివ ప్రసాద్ దర్శకత్వంలో టోవినో థామస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. మరణమాస్ మలయాళంలో ఏప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా మే 15 నుంచి సోని లివ్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమా.
కథ విషయానికొస్తే.. వరుసగా రెండు హత్యలు జరుగుతాయి. ముసలివాళ్లను టార్గెట్ చేసి సీరియల్ కిల్లర్ SK (రాజేష్ మాధవన్) చంపుతూ ఉంటాడు. పోలీసులు లూక్(బసిల్ జోసెఫ్) ఈ హత్యలు చేస్తున్నాడేమో అని అనుమానించి తీసుకెళ్తారు. కానీ అతను కాదని తెలిసి వదిలిపెడతారు. ఆ తర్వాత ఊళ్ళో అందరూ లూక్ ని సరదాగా సీరియల్ కిల్లర్ అని పిలుస్తూ ఉంటారు. దీంతో జెస్సి(అనిష్మ) లూక్ కి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకో ముసలివ్యక్తిని చంపడంతో ఈ కేసుని స్పెషల్ పోలీసాఫీసర్ అజయ్ రామచంద్రన్(బాబు ఆంటోనీ)కి ఇస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ తన కుక్క మిస్ అయిందని బాధపడుతూ ఉంటాడు.
కేశవన్ అనే ముసలి వ్యక్తిని అతని కొడుకు ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తే అక్కడ్నుంచి తప్పించుకుంటాడు. సీరియల్ కిల్లర్ కేశవన్ ని వెతుకుతుంటే అతనే వస్తాడు. దీంతో సీరియల్ కిల్లర్ కేశవన్ ని చంపాలి అనుకునేలోపు ఇద్దరూ అనుకోకుండా ఓ బస్ ఎక్కుతారు. ఆ బస్ లో కేశవన్ జెస్సితో మిస్ బిహేవ్ చేయడంతో ఆమె పెప్పర్ స్ప్రే కొడుతుంది. దీంతో కేశవన్ చనిపోతాడు. బస్సులో ఆ సీరియల్ కిల్లర్, జెస్సి, డ్రైవర్, కండక్టర్ మాత్రమే ఉంటారు. అంతలో జెస్సిని వెతుక్కుంటూ లూక్ కూడా బస్సులోకి వస్తాడు. SK నే సీరియల్ కిల్లర్ అని బస్ లో అందరికి తెలిసిపోతుంది. SK కేశవన్ బాడీ ఇచ్చి అందర్నీ వెళ్లిపొమ్మని బెదిరిస్తాడు. అదే సమయంలో కండక్టర్ ఆ కేశవన్ చిన్నప్పుడు తప్పిపోయిన మా నాన్న అంటూ ఎమోషనల్ అవుతాడు. అసలు కేశవన్ ఎవరు? SK కేవలం ముసలి వాళ్లనే ఎందుకు చంపుతున్నాడు? బస్ కండక్టర్ ఫాదర్ కథేంటి? లూక్, జెస్సి కలిసారా? పోలీసులు సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నారా? పోలీసాఫీసర్ కుక్క దొరికిందా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
Also Read : Eleven : ‘లెవన్’ మూవీ రివ్యూ.. సీరియల్ కిల్లింగ్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్..
సినిమా విశ్లేషణ.. మలయాళం సినిమాలు స్లో నేరేషన్ తో సాగుతాయని తెలిసిందే. ఈ సినిమా కూడా అంతే. ఇటీవల బసిల్ జోసెఫ్ వరుస సినిమాలతో మెప్పిస్తుండటంతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యాడు. దీంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరో మొదట్నుంచే చూపించి అతన్ని ఎలా పట్టుకుంటారు, ఎవరు పట్టుకుంటారు అనే దానిపై కథని కాస్త సస్పెన్స్ తో కాస్త కామెడీతో సాగదీశారు. బస్ లో ఆ పెద్దాయన చనిపోయేవరకు సినిమా బోర్ కొట్టడం ఖాయం. అక్కడిదాకా కథ అంతా తలాతోక లేకుండా ఉంటుంది. మలయాళం సినిమాలు కొన్ని ఇంతే అని మనం సరిపెట్టుకోవడమే.
బస్ లో పెద్దాయన చనిపోయిన తర్వాత నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. చివరికి కిల్లర్ ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? లూక్ ఏం చేసాడు? కండక్టర్ ఎమోషన్ ఏంటి అని ఓ పక్క సస్పెన్స్ తో నడిపిస్తునే కామెడీని కూడా పండించారు. అయితే కిల్లర్ ఎందుకు ముసలివాళ్ళనే చంపుతున్నాడు అనేది ఇంకాస్త క్లారిటీగా చెప్తే బాగుండేది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించేశారు. సినిమాలో నాన్న ఎమోషన్ ని బాగా పండించి క్లైమాక్స్ లో దాన్ని కామెడీ చేయడం అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇక కేసుని పోలీసులు పెద్దగా డీల్ చేయకుండానే కిల్లర్ దొరకడం సింపుల్ గా ఉంటుంది. సీరియస్ గా కేసు డీల్ చేయాల్సిన పోలీసాఫీసర్ పాత్ర కూడా కామెడీగా రాసుకున్నారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఎప్పట్లాగే బసిల్ జోసెఫ్ తన పాత్రలో మెప్పించాడు. హీరో పాత్ర లాంటిది కాకపోయినా బసిల్ క్యారెక్టరయిజేషన్ ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది. అనిష్మ అక్కడక్కడా నవ్విస్తుంది. సిజు సన్నీ కాస్త ఎమోషన్ పండిస్తాడు. బాబు ఆంటోనీ, రాజేష్ మాధవన్.. మిగిలిన నటీనటులు అంతా ఎవరి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సగం సినిమా రాత్రి పూటే జరుగుతుంది. దానికి తగ్గట్టు విజువల్స్ పర్ఫెక్ట్ గా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. రొటీన్ సీరియల్ కిల్లర్ కథని డార్క్ కామెడీగా కొత్తకథనంతో రాసుకున్నారు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘మరణమాస్’ పూర్తి మలయాళం నేటివిటీతో ఉన్న డార్క్ కామెడీ సినిమా. ఒక్కసారి చూడొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.