Eleven : ‘లెవన్’ మూవీ రివ్యూ.. సీరియల్ కిల్లింగ్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్..
నవీన్ చంద్ర ఎక్కువగా పోలీస్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే చేస్తున్నాడు.

Naveen Chandra Abhirami Eleven Movie Review and Rating
Eleven Movie Review : నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ‘లెవన్’. AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రియా హరి నిర్మాణంలో లోకేశ్ అజిల్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. లెవన్ సినిమాని తమిళ్ – తెలుగులో మే 16న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్, రవి వర్మ, కిరీటి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఒక రోజు ముందే పలు థియేటర్స్ లో లెవన్ సినిమా ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే.. అరవింద్(నవీన్ చంద్ర) వైజాగ్ లో అసిస్టెంట్ కమిషనర్. సిన్సియర్ & స్మార్ట్ పోలీసాఫీసర్. అనేక కేసులను ఈజీగా డీల్ చేస్తూ ఉంటాడు. ఓ సమయంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. కాల్చి చంపి ఆనవాళ్లు దొరక్కుండా వాళ్ళని కాల్చేస్తూ ఉంటాడు కిల్లర్. ఈ కేసు డీల్ చేసే రంజిత్(శశాంక్)కి యాక్సిడెంట్ అవ్వడంతో ఈ కేసు అరవింద్ చేతికి వస్తుంది. అరవింద్ చేతికి కేసు వచ్చాక కూడా ఇంకొన్ని హత్యలు జరుగుతాయి.
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ ఇద్దర్ని అనుమానించి విచారిస్తే ట్విన్స్ అయిన వాళ్ళ తోబుట్టువులు చనిపోయినట్టు తెలుస్తుంది. అసలు ఈ హత్యలు అన్ని చేసేది ఎవరు? చనిపోయిన వాళ్ల మధ్య కనెక్షన్ ఏంటి? ట్విన్స్ లో ఒకరినే ఎందుకు చంపుతున్నాడు? అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? ఇంకా హత్యలు చేశాడా? అరవింద్ కిల్లర్ ని పట్టుకున్నాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : NTR – Aamir Khan : ఎన్టీఆర్ వర్సెస్ అమీర్ ఖాన్.. ఎవరు దాదా సాహెబ్ ఫాల్కే..? ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్..
సినిమా విశ్లేషణ.. నవీన్ చంద్ర ఎక్కువగా పోలీస్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే చేస్తున్నాడు. ఈ లెవన్ కూడా అదే కోవలోకి చెందింది. సీరియల్ కిల్లింగ్ కేసు అరవింద్ చేతికి వచ్చేదాకా సినిమా నిదానంగా సాగుతుంది. మధ్యలో ఓ లవ్ స్టోరీ ఇరికించినట్టు ఉంటుంది. ఆ చిన్న లవ్ స్టోరీకి అయినా ఒక మంచి హీరోయిన్ ని తీసుకుంటే బాగుండేది. నిర్మాతే హీరోయిన్ గా చేయడం సెట్ అవ్వలేదు. కిల్లర్ కేసు అరవింద్ చేతికి వచ్చాక సినిమా కాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని చాలా బాగా రాసుకున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఇంట్రెస్ట్ గా సాగుతుంది కథనం.
అయితే రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు ఇంటర్వెల్ కి విలన్ ఎవరు అనేది కనిపెట్టేయొచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో విలన్ ఇంకెవరో ఉన్నారు ఉన్నట్టు స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ అంతా ఇంట్రెస్ట్ గానే సాగుతుంది. మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లో మంచి ఎమోషన్ ని పండిస్తారు. క్లైమాక్స్ లో సినిమా అయిపోయింది ఇంకొన్ని పాయింట్స్ వదిలేసారు అనుకునేలోపు మళ్ళీ కొన్ని సీన్స్ తో మెప్పిస్తారు. అయితే ఇలాంటి కథనంతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. కిల్లింగ్ కాన్సెప్ట్, ఫ్లాష్ బ్యాక్, ఇన్వెస్టిగేషన్ కొత్తగా రాసుకున్నా విలన్ ప్లాట్ మాత్రం చాలా సినిమాల్లో ఉంటుంది. ట్విన్స్ కాన్సెప్ట్ కోసం రియల్ ట్విన్స్ ని చాలా మందిని తీసుకురావడానికి మాత్రం మూవీ యూనిట్ బాగా కష్టపడినట్టు తెలుస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. నవీన్ చంద్ర సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు. ఈ పాత్ర కోసం కాస్త బరువు తగ్గి మంచి ఫిట్ గా తయారయ్యాడు నవీన్ చంద్ర. ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆ పాత్రలో సెట్ అయ్యాడు. రియా హరి హీరోయిన్ పాత్రలో ఓకే అనిపించింది. SI పాత్రలో దిలీపన్, పోలీస్ పాత్రలో శశాంక్, ఆడుకాలం నరేన్ చక్కగా నటించి మెప్పిస్తారు. ఒకప్పటి హీరోయిన్ అభిరామికి మంచి పాత్ర పడింది. రవివర్మ, కిరీటి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Rajamouli : రాజమౌళి ఇండస్ట్రీని పాడు చేశారు.. డిస్ట్రిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా, కొన్నిచోట్ల అవసరం లేకపోయినా భయపెట్టడానికి మ్యూజిక్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. పాత కథే అయినా అదిరిపోయే స్క్రీన్ ప్లేతో బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కాస్త కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు. సినిమాలో నవీన్ చంద్ర బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఫైట్స్ బాగా డిజైన్ చేసారు.
మొత్తంగా ‘లెవన్’ సినిమా సీరియల్ కిల్లింగ్స్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.