Ponman : ‘పొన్ మ్యాన్’ మూవీ రివ్యూ.. పెళ్లిళ్లకు బంగారం అమ్మే ఏజెంట్ కథ..
బంగారం ఏజెంట్ కి డబ్బులు ఇవ్వకపోవడంతో తన బంగారం ఎలా తీసుకున్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అని ఆసక్తిగా చూపించారు.

Basil Joseph Ponman a Gold Agent Malayalam Movie Review
Ponman Movie Review : బసిల్ జోసెఫ్, సాజిన్ గోపు, లిజిమోల్ జోసే, ఆనంద్ మన్మథన్, దీపక్ పరంబోల్ పలువురు ముఖ్య పాత్రల్లో మలయాళంలో తెరకెక్కిన సినిమా ‘పొన్ మ్యాన్’. అజిత్ వినాయక ఫిలిమ్స్ బ్యానర్ పై వినాయక అజిత్ నిర్మాణంలో జోతిష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంలో థియేటర్స్ లో ఈ సినిమా జనవరి 20న విడుదలయింది. ఇటీవల మార్చ్ 14 నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే.. బ్రూనో(ఆనంద్ మన్మధన్) ఇంటిని పట్టించుకోకుండా ఓ రాజకీయ పార్టీ కోసం తిరుగుతూ ఉంటాడు. ఓ గొడవ వల్ల పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తుంది. అదే సమయంలో తన చెల్లి స్టెఫీ(లిజోమోల్ జోసే)కి 25 సవర్ల బంగారం కట్నంగా పెట్టి పెళ్లి చేయాలి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పీపీ అజేశ్ (బసిల్ జోసెఫ్) గోల్డ్ బ్రోకర్ గురించి తెలుస్తుంది. ఈ గోల్డ్ ఏజెంట్ పెళ్ళికి కావాల్సిన నగలు అన్ని తెచ్చి ఇస్తారు. పెళ్లి అయ్యేంతవరకు ఉండి చదివింపులకు వచ్చిన మొత్తం డబ్బులు జమ చేసుకుంటారు. ఆ డబ్బు సరిపోకపోతే మిగిలింది డబ్బు ఇవ్వాలి, లేదా దానికి తగ్గ బంగారం రిటర్న్ తీసుకుంటారు.
అలా స్టెఫీ పెళ్ళికి పీపీ అజేశ్ 25 సవర్ల బంగారం తెచ్చి ఇస్తాడు. బ్రూనో గొడవల వల్ల ఎక్కువమంది పెళ్ళికి రాకపోవడంతో వచ్చిన చదివింపులు 12 సవర్లకు సరిపోగా మిగిలిన 13 సవర్లు తిరిగి ఇమ్మంటాడు పీపీ అజేష్. కానీ స్టెఫీ తన భర్త మరియానో (సాజిన్ గోపు)తో కలిసి బంగారం తీసుకొని అత్తారింటికి వెళ్ళిపోతుంది. దీంతో బంగారం కోసం పీపీ అజేష్ అక్కడికి వెళ్తాడు. మరి స్టెఫీ నుంచి పీపీ అజేష్ బంగారంను తీసుకున్నాడా? అక్కడ స్టెఫీ భర్త నుంచి పీపీ అజేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు? బ్రూనో ఏం చేసాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. మలయాళం సినిమాలు చిన్న పాయింట్ ని తీసుకొని ఆసక్తిగా నడిపిస్తారని తెలిసిందే. ఈ సినిమాలో బంగారం తీసుకున్న పెళ్లి వాళ్ళు డబ్బులు పూర్తిగా కట్టకపోవడంతో మిగిలిన బంగారాన్ని కూడా ఇవ్వకపోవడంతో బంగారం ఏజెంట్ ఎలా వసూలు చేసాడు అనే పాయింట్ ని రెండు గంటలపాటు బాగానే నడిపించారు. సినిమా అంతా పూర్తిగా మలయాళం ఫ్లేవర్ లోనే ఉంటుంది.
బ్రూనో పాత్రతో సినిమా మొదలుపెట్టి తన చెల్లి స్టెఫీ పెళ్లి సమయంలో పీపీ అజేశ్ ఎంట్రీతో సినిమా కాస్త ఆసక్తిగా మారుతుంది. ఇక స్టెఫీ అత్తారింటికి వెళ్ళిపోయాక పీపీ అజేశ్ అక్కడికి వెళ్లి ఎలా బంగారం వసూలు చేసుకున్నాడు అని కాస్త సాగదీస్తూనే నడిపించారు. బంగారం వసూలు చేసుకుంటాడు అని అందరూ ఊహించినా చివర్లో వచ్చే క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించరు. అన్ని పాత్రలను చాలా బాగా రాసుకున్నారు.
కథలో రాజకీయ పార్టీల చుట్టూ తిరిగితే వాళ్ళేం పట్టించుకోరు అనే పాయింట్ ని, వరకట్నం పాయింట్ ని, బంగారం వల్ల సమస్యలు, ఆడవాళ్లకు బంగారం అంటే ఇష్టం అనే పాయింట్స్ ని బాగా చెప్పారు. పోన్ మ్యాన్ అంటే మలయాళంలో గోల్డ్ మ్యాన్ అని అర్ధం. ఇలా పెళ్లిళ్లకు బంగారం ఇచ్చి చదివింపులు డబ్బులుగా తీసుకోవడం అనే కొత్త కాన్సెప్ట్ బాగుంది. థ్రిల్లింగ్ సినిమా కాకపోయినా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండే సినిమానే. జియో హాట్ స్టార్ లో చూసేయొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. మలయాళం డబ్బింగ్ సినిమాలతో బసిల్ జోసెఫ్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నటుడిగా, దర్శకుడిగా అనేక సినిమాలతో మెప్పించాడు బసిల్ జోసెఫ్. తన గోల్డ్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అనే పాత్రలో ఈ సినిమాలో పోన్ మ్యాన్ గా మెప్పించాడు. నెగిటివ్ షేడ్స్ లో సాజిన్ గోపు బాగానే నటించాడు. ఒక పేదింటి పెళ్లికూతురు పాత్రలో లిజిమోల్ జోసే పర్ఫెక్ట్ గా సెట్ అయి నటనతో మెప్పించింది. ఆవేశం ఉన్న పాత్రలో ఆనంద్ మన్మథన్ చక్కగా ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Sai Rajesh : ఆ సినిమాకి చెత్త మిస్టేక్ అదే.. నాని సినిమాని పొగుడుతూనే ఒక్క విషయంలో తిట్టిన బేబీ డైరెక్టర్..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ఒక కొత్త పాయింట్ తీసుకున్నా కథనం రెండు గంటలపాటు దానిపైనే సాగదీయడంతో అక్కడక్కడా బోర్ కొడుతుంది. దర్శకుడు టేకింగ్ విషయంలో బాగానే కేర్ తీసుకున్నాడు. లొకేషన్స్ అన్ని కూడా కేరళ రియల్ లొకేషన్స్ లో తీయడంతో రియాల్టీగా అనిపిస్తుంది. నిర్మాణ పరంగా చిన్న బడ్జెట్ లో మంచిగా తెరకెక్కించారు.
మొత్తంగా ‘పోన్ మ్యాన్’ సినిమా బంగారం ఏజెంట్ కి డబ్బులు ఇవ్వకపోవడంతో తన బంగారం ఎలా తీసుకున్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అని ఆసక్తిగా చూపించారు.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.