అవును.. మేం విడిపోయాం – ‘ప్రేమ పావురాలు’ భాగ్యశ్రీ
ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన భర్తతో విడిపోయినట్టు తెలిపారు..

ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన భర్తతో విడిపోయినట్టు తెలిపారు..
బాలీవుడ్‌లో లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు కామన్ అయిపోయాయి. నిన్నటికి నిన్నబాలీవుడ్ నటి, రచయిత్రి, దర్శకురాలు కొంకణా సేన్ శర్మ ఆమె భర్త రణ్‌వీర్ షోరే విడాకులకు అప్లై చేశారు. 5 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్న ఈ జంట పరస్పర అంగీకారం మేరకు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూడా తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైనట్టు తెలిపింది.
‘మైనే ప్యార్ కియా’ వంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమ పావురాలు’ పేరుతో అనువాదమై విడుదలైంది. ‘మైనే ప్యార్ కియా’తో కుర్రాళ్లకు కంటికిమీద కునుకు లేకుండా చేసిన భాగ్యశ్రీ, 1990లో వ్యాపారవేత్త హిమాలయా దస్సానీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో మాత్రమే ఆమె నటించింది. తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ‘యువరత్న రాణా’ సినిమాలో నటించింది. భాగ్యశ్రీ తెలుగులో చేసిన ఏకైక చిత్రం ఇదే. ఇక భర్తే తన లోకమనుకుని సినిమా ప్రపంచంవైపు కన్నెత్తి కూడా చూడలేదామె. అయితే తాజాగా భర్త నుంచి విడిపోయినట్లు ప్రకటించడం విశేషం. తన పెళ్లి, విడిపోవడానికి దారి తీసిన పరిణామాల గురించి భాగ్యశ్రీ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘అవును, నాకు తొలిసారిగా ప్రేమ పుట్టింది హిమాలయా పైనే. అతణ్ణే పెళ్లాడాను కూడా. కానీ ఒకానొక సందర్భంలో మేం విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు నా మనస్సు కుంగిపోయింది. అంటే నా జీవితంలో అతనికి ఇంక చోటు లేదా? నేను మరొకరిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని ఊహించుకుంటే చాలు.. ఇప్పటికీ భయంతో వెన్నులో వణుకుపుడుతోంది.. ఎందుకంటే, మేం విడిపోయి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. భాగ్యశ్రీకి కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు అభిమన్యు దస్సానీ గతేడాది ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ చిత్రంతో కథానాయకుడిగా హిందీ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు.
See Also | సినిమా కష్టాలు – ప్రకాష్ రాజ్‌కు హైకోర్టు నోటీసులు
భాగ్యశ్రీ తెలుగులో అడవి శేష్, శివాని రాజశేఖర్ జంటగా హిందీ ‘2 స్టేట్స్’ రీమేక్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమాలో ప్రభాస్ తల్లిగా కనిపించనుంది భాగ్యశ్రీ.