S 99 Movie : S-99 మూవీ రివ్యూ.. బిగ్‌బాస్ శ్వేతా వర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?

సి.జగన్ మోహన్ మెయిన్ లీడ్ లో శ్వేతా వర్మ, దేవి ప్రసాద్, దయానంద్ రెడ్డి ముఖ్య పాత్రలలో సి.జగన్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా S-99.

New Action Thriller S 99 Movie Review and Rating

S 99 Movie Review : సి.జగన్ మోహన్ మెయిన్ లీడ్ లో శ్వేతా వర్మ, దేవి ప్రసాద్, దయానంద్ రెడ్డి ముఖ్య పాత్రలలో సి.జగన్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా S-99. టెంపుల్ మీడియా – ఫైర్ బాల్ బ్యానర్స్‌పై యతీష్, నందిని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ ‘ఎస్‌ 99’ సినిమా నేడు మార్చ్ 1న థియేట‌ర్‌ల‌లో విడుద‌లైంది.

కథ విషయానికొస్తే.. S – 99(సి. జగన్ మోహన్) ఓ రిటైర్డ్ ఎన్ఎస్ఏ అధికారి. ఓ మినిష్టర్ కి సంబంధించిన విలువైన సమాచారం ఒక మహిళా జర్నలిస్ట్ వద్ద ఉందని తెలుసుకొని మంత్రి ఆమెని చంపడానికి తాలుక్ దార్ పాషా అనే క్రిమినల్ కి కిరాయి ఒప్పందం ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న S 99 ఆ మహిళా జర్నలిస్ట్ ను కాపాడేలోపే పాషా ఆమెని కిడ్నాప్ చేస్తాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో కొంతమందిని చంపేస్తాడు S 99. దీంతో గతంలో చనిపోయిన S 99 మళ్ళీ ఎలా బ‌తికొచ్చాడు అని ఆశ్చర్యపోతూనే.. గతంలో, ఇప్పుడు కూడా తన దారికి అడ్డువస్తున్న S 99ని చంపాలనుకుంటాడు పాషా. అసలు పాషా, S 99కి మధ్య ఉన్న పాత కక్షలు ఏంటి? ఆ మహిళా జర్నలిస్ట్ వద్ద ఏం సమాచారం ఉంది? మంత్రి ఆమెని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఆ అమ్మాయిని S99 కాపాడాడా? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ S 99 అనే సినిమాని తెరకెక్కించారు. మొదటి హాఫ్ అంతా మంత్రి, మహిళా జర్నలిస్టు, పాషా చుట్టూ కథ తిరుగుతుంది. S 99 ఎంటర్ అయిన దగ్గర్నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. క్రైమ్ థ్రిల్లర్స్ లో ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాకి తీసుకొచ్చారు.

నటీనటులు.. మెయిన్ లీడ్ లో నటించిన సీనియర్ నటుడు సి జగన్మోహన్ మెప్పించారు. స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారు. నటుడిగానే కాకుండా మరోవైపు దర్శకుడిగా కూడా ఓకే అనిపించాడు. దయానంద్ రెడ్డి విలన్ గా, క్యాబ్ డ్రైవర్ పాత్రలో బిగ్ బాస్ భామ శ్వేతా వర్మ, కిరికిరి రాజారెడ్డిగా పోలీస్ పాత్రలో దేవిప్రసాద్‌, మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. విజయ్ కూరాకుల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. విజువల్ గా, సౌండ్ పరంగా ఈ సినిమా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇక మెయిన్ లీడ్ లో నటించిన జగన్ మోహన్ ఓ పక్క నటిస్తూనే మరో పక్క కథ, కథనం, దర్శకత్వం కూడా వహించి సక్సెస్ అయ్యారు. యాక్షన్ సీక్వెన్స్ స్టైలిష్ గా ఉన్నాయి. ఇక నిర్మాతలు యతీష్, నందిని చిన్న సినిమా అయినా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా నిర్మించారు.

మొత్తంగా S 99 సినిమా ఓ యాక్షన్ క్రైం థ్రిల్లర్ సినిమా. క్రైం థ్రిల్లర్స్ చూడాలనుకునేవాళ్ళు ఈ సినిమాని థియేటర్లో చూసేయండి. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు