పాకిస్తాన్ లో ‘RAW’ ఆఫీసర్ గా గోపీచంద్: చాణక్య టీజర్ చూశారా?

  • Published By: vamsi ,Published On : September 9, 2019 / 12:58 PM IST
పాకిస్తాన్ లో ‘RAW’ ఆఫీసర్ గా గోపీచంద్: చాణక్య టీజర్ చూశారా?

Updated On : September 9, 2019 / 12:58 PM IST

కోత్త కొత్త కథలతో ఎప్పుడూ కొత్తదనం అందించే సినిమాలను తీసేందుకు ముందుంటాడు యంగ్ హీరో గోపీచంద్. అయితే ఇటీవలికాలంలో మంచి హిట్ అందుకోలేకపోయిన ఈ యంగ్ హీరో తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ అనే సినిమాతో ముందుకు వస్తున్నాడు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని మొదలెట్టింది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే లేటెస్ట్ గా సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.

ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర చాణక్య సినిమాను నిర్మిస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన టీజర్ లో విజువల్స్ అయితే మరో స్థాయిలో ఉన్నాయి. ఇండో పాకిస్తాన్ బోర్డర్‌లోనే ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. తమిళంలో విశాల్ హీరోగా వచ్చిన వేటాడు వెంటాడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తిరు.. గోపీచంద్ ఇమేజ్‌కు సరిపోయేలా స్పై థ్రిల్లర్ స్టోరీని రాసుకుని తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ ‘RAW’ ఆఫీసర్ గా పాకిస్తాన్ వెళ్లి అక్కడేం చేసాడు అనేది అసలు కథ.

‘లౌక్యం’ తర్వాత సరైన హిట్టు లేని గోపీచంద్.. ఈ సినిమాతో హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. లడక్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే గోపీచంద్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సినిమా కాస్త ఆలస్యం అయ్యింది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకు సినిమాకు విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.