ఇకపై చిరంజీవి పేరు, ఫొటోలు, వీడియోలు వాడారనుకో.. జైలుకే.. ఏఐ దుర్వినియోగంపై కోర్టు ఆదేశాల్లో ఏం చెప్పిందంటే?
ఇప్పటికే ఇలాంటి పోస్టులు, వీడియోలు పెట్టిన 30 మందికి నోటీసులు కూడా పంపింది.
Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి పేరు, ఫొటోలు, వాయిస్ (మాటలు) ఎవరైనా ఆయన అనుమతి లేకుండా వాడితే కుదరదు! అలా వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఒక ముఖ్యమైన ఆదేశం ఇచ్చింది.
ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్ల పేరు, ఫొటోలను సోషల్ మీడియాలో తప్పుగా వాడుతున్నారు. ముఖ్యంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో ఫొటోలు మార్ఫింగ్ చేసి, వాయిస్‌లు మార్చి వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. దీనిపై చాలా మంది సినీ తారలు కోర్టులకు వెళ్తున్నారు.
చిరంజీవి ఫిర్యాదు, కోర్టు తీర్పు
ఈ సమస్యపై చిరంజీవి కూడా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. టీవీ రేటింగ్స్ (TRP) కోసం, లాభాల కోసం చిరంజీవి పేరును ఎవరైనా తప్పుగా వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
ముఖ్యంగా.. MEGA STAR, CHIRU, ANNAYYA అనే పేర్లతో పాటు, AI ద్వారా మార్పులు చేసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంపై కోర్టు నిషేధం విధించింది. ఇప్పటికే ఇలాంటి పోస్టులు, వీడియోలు పెట్టిన 30 మందికి నోటీసులు కూడా పంపింది. తదుపరి విచారణ అక్టోబర్ 27న జరుగుతుంది. ఇటీవల చిరంజీవి హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉల్లంఘనలను ఆపడానికి చట్టాలు మరింత బలంగా ఉండాలని కూడా వారిద్దరూ చర్చించుకున్నారు.
చిరంజీవి లీగల్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన!
మెగాస్టార్ చిరంజీవి లీగల్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం సోషల్ మీడియాలో చిరంజీవి పేరు, ఫొటోలు, వీడియోలు, వాయిస్ లేదా AI ద్వారా తయారు చేసిన ఏ కంటెంట్‌ను ఆయన అనుమతి లేకుండా వాడితే ఇకపై అది నేరం అవుతుంది.
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల వల్ల, చిరంజీవి పేరు, ఫొటోలు, వాయిస్ లేదా AI రీ-క్రియేషన్లను అనుమతి లేకుండా వాడటం, మార్చడం లేదా ట్రోల్ చేయడం చట్టవిరుద్ధం.
ఎవరైనా మెగాస్టార్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఏ విధంగానైనా కంటెంట్ సృష్టించినా లేదా షేర్ చేసినా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

చిరంజీవి కొత్త సినిమాలు:
ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, వశిష్ఠ దర్శకత్వంలో వచ్చే ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ సినిమాలో కూడా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక పెద్ద యాక్షన్ మూవీలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదే రిలీజ్ కానున్నాయి.
