సాయిధరమ్‌కు లక్కు కలిసొస్తుందా : చిత్రలహరి..హిట్టా..ఫట్టా

‘విన్నర్’ సినిమాతో టాలివుడ్ విన్నర్ అవుదామనుకున్నాడు. కుదరలేదు. ‘ఇంటిలిజెంట్’ మూవీతో ఇరగదీద్దామనుకున్నాడు. అదీ కుదరలేదు. ‘తేజ్ ఐలవ్యూ’ అంటూ..ఆడియన్స్‌ని ప్రేమలో పడేద్దాం అనుకున్నాడు. పాపం అదికూడా బెడిసికొట్టింది. ఇలా..‘సుప్రీమ్’ హీరోకి సూపర్ హిట్టు పడక..ఏళ్లు గడిచిపోయింది. మరి ఈసారైనా లక్కు కలిసొస్తుందా..?
టాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో..ఇప్పుడు ఖచ్చితంగా హిట్టు అవసరమైన హీరో ఎవరైనా ఉన్నారంటే. అది ఒక్క ‘సాయి ధరమ్ తేజ్’ మాత్రమే. ఎందుకంటే..ఈయనకు రెండేళ్లుగా హిట్టు సినిమా లేదు. వరుసగా ఆరు ప్లాపులు కొట్టిన మెగా హీరో..ఈసారి మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్, కిశోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కిన..‘చిత్రలహరి’ సినిమా ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం రిలీజ్ అయ్యింది. సుప్రీమ్ హీరో హోప్స్ అన్నీ..ఇప్పుడు చిత్రలహరి మీదే ఉన్నాయి.
గతేడాది జూలైలో వచ్చిన ‘తేజ్ ఐలవ్యూ’ తర్వాత..సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ ప్లాపుల నుంచి తేరుకునేందుకు..సినిమాలకి విరామం ఇచ్చి..మళ్లీ ఎక్స్ ట్రా ఎనర్జీతో తిరిగొచ్చాడు. 2018 నవంబర్ లో ‘చిత్రలహరి’ షూటింగ్ ప్రారంభమైంది. పెద్దగా హడావిడి చేయకుండా..సినిమాని కూల్ గా కంప్లీట్ చేసేశాడు. ఇప్పటికే రిలీజైన చిత్రలహరి టీజర్, సాంగ్స్ కి రెస్పాన్స్ బాగానే వచ్చింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న చిత్రలహరిలో..సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పెతురాజ్ నటించారు.
ఇక ఉన్నది ‘ఒకటే జిందగీ’, ‘నేను శైలజ’ లాంటి..యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్‌ని తెరకెక్కించిన..కిషోర్ తిరుమల డైరెక్టర్ కావడంతో..‘చిత్రలహరి’పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు 2016లో వచ్చిన సుప్రీమ్ తర్వాత..సాయి ధరమ్ తేజ్‌కి ఒక్క హిట్టు కూడా లేదు. వరుసగా తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐలవ్యూ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. మరి..ఈసారైనా గండం గట్టెక్కుతాడో లేదో చూడాలి.