Site icon 10TV Telugu

Bakasura Restaurant : ‘బకాసుర రెస్టారెంట్‌’ మూవీ రివ్యూ.. తిండిపోతు దయ్యంతో హారర్ కామెడీ..

Bakasura Restaurant

Bakasura Restaurant Movie Review : కమెడియన్ ప్రవీణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే మూవీస్‌ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మాణంలో ఎస్‌జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైవా హర్ష, కృష్ణభగవాన్, షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నేడు ఆగస్టు 8న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. పరమేష్(ప్రవీణ్) మరో నలుగురు బ్యాచిలర్స్ తో కలిసి ఓ రూమ్ లో ఉంటూ జాబ్ చేస్తూ ఉంటాడు. తనకు ఆ జాబ్ నచ్చదు. ఎప్పటికైనా ఒక రెస్టారెంట్ పెట్టాలని పరమేష్ కల. డబ్బుల కోసం పరమేష్, అతని రూమ్మేట్స్ యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేయాలని ప్లాన్ చేస్తారు. ఫస్ట్ వీడియో ఫెయిల్ అవ్వడంతో సెకండ్ టైం ఓ రియల్ హాంటెడ్ లొకేషన్ కి వెళ్తారు. అక్కడ వీరికి తాంత్రిక విద్యలు ఉన్న పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడుకొని డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. అందులో రాసి ఉన్నట్టు నిమ్మకాయతో ఓ మంత్రంతో ప్రయోగం చేయగా రెండొందల ఏళ్ళ క్రితం బక్కసూరి అలియాస్ బకాసురుడు(వైవా హర్ష) ఆత్మ బయటకు వస్తుంది.

ఆత్మ బయటకి వచ్చాక ఇంట్లో ఫుడ్ అంతా మాయమైపోతూ ఉంటుంది. మొదట్లో ఎవరు చేస్తున్నారో తెలిసేది కాదు. నిమ్మకాయలో ఆత్మ ఆ బ్యాచిలర్స్ లోనే ఎవరో ఒకరి శరీరంలోకి దూరి ఫుడ్ అంతా తినేస్తుందని తెలుసుకుంటారు. అదే టైంలో వీళ్ళ రూమ్ కి అంజిబాబు(ఫణి) వస్తాడు. అతను తెలియక ఆ నిమ్మకాయని కోసుకొని తాగేస్తాడు. దీంతో బకాసుర ఆత్మ అతనిలోకి వెళ్తుంది. ఇక అక్కడ్నుంచి బకాసుర ఆత్మ వల్ల ఈ బ్యాచిలర్స్ కి వచ్చిన కష్టాలు ఏంటి? అసలు బకాసుర కథ ఏంటి? అతను ఎందుకు అంత తింటున్నాడు? పరమేష్ హోటల్ పెట్టాడా? బకాసుర ఆత్మ ఎలా వెళ్ళిపోతుంది ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Mothevari Love Story : ‘మోతెవరి లవ్ స్టోరీ’ రివ్యూ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వెబ్ సిరీస్.. హీరోగా మారిన యూట్యూబర్..

సినిమా విశ్లేషణ.. బకాసుర రెస్టారెంట్‌ అనే టైటిల్ తో, ఈ టైటిల్ తో మూవీ యూనిట్ చేసిన ప్రమోషన్స్ తో సినిమాపై కాస్త ఆసక్తి కలిగించారు. కమెడియన్ ప్రవీణ్ మొదటిసారి మెయిన్ లీడ్ లో నటించాడు. ఫస్ట్ హాఫ్ అంతా బ్యాచిలర్స్ లైఫ్, వాళ్ళ కష్టాలు, యూట్యూబ్ వీడియోలు, తాంత్రిక పుస్తకం దొరకడం , ఆత్మ బయటకు రావడం, ఫుడ్ మాయమవుతుండంతో అక్కడక్కడా కామెడీ, కాస్త హారర్, కొంచెం సాగదీస్తూ సాగుతుంది. ఇంటర్వెల్ కి అంజిబాబు శరీరంలోకి బకాసుర ఆత్మ దూరడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ బ్యాచిలర్స్ అయిదుగురు ఆ ఆత్మతో పడ్డ ఇబ్బందులు ఏంటి? ఆ ఆత్మని ఎలా పంపించేశారు? ఆ ఆత్మని వాడుకొని వీళ్ళు ఏం చేసారు అని కాస్త సాగదీశారు. ఓ మూడు నాలుగు సీన్స్ లో హారర్ తో భయపెట్టడానికి ట్రై చేసారు. సెకండ్ హాఫ్ లో అక్కర్లేని దయ్యాల కామెడీ ట్రాక్ పెట్టి కథ పక్కకు తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. బ్యాచిలర్స్ కాసేపు పోకిరి పనులు చేసి వెంటనే ఎమోషన్ అవ్వడం, కష్టాలు గుర్తు తెచ్చుకొని మళ్ళీ వెంటనే కామెడీ చేయడంతో కొన్ని సీన్స్ సరిగ్గా రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది. బకాసుర ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బాగానే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో కాస్త ఎమోషన్ ట్రై చేసారు. క్లైమాక్స్ లో కూడా ఎమోషన్ పండించడానికి బాగానే ట్రై చేసారు. మధ్యమధ్యలో ప్రవీణ్ కి, మరో వ్యక్తికి చిన్న లవ్ స్టోరీలు అదనం. చివర్లో వీళ్ళ వల్ల మరో ఆత్మ బయటకు వచ్చినట్టు చూపించి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నాళ్లు కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ప్రవీణ్ మొదటిసారి మెయిన్ లీడ్ లో కామెడీ చేస్తూనే ఎమోషనల్ గా కూడా నటించి మెప్పించాడు. వైవా హర్ష టైటిల్ రోల్ బకాసుర పాత్రలో బాగానే ఒదిగిపోయాడు. షైనింగ్ ఫణి దయ్యం ఆవహించిన పాత్రలో బాగానే నటించాడు. కెజిఎఫ్ గరుడ రామ్ ఓ బైరాగి పాత్రలో అక్కడక్కడా కనిపిస్తాడు. చాన్నాళ్లకు కృష్ణ భగవాన్ స్క్రీన్ పై ఓ హోటల్ ఓనర్ గా కనిపించి పర్వాలేదనిపించారు. శ్రీకాంత్ అయ్యంగార్, మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో ఓకే అనిపిస్తారు.

Also Read : Su From So : ‘సు ఫ్రం సో’ మూవీ రివ్యూ.. కామెడీ హారర్.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకాస్త బెటర్ గా ఇవ్వాల్సింది.  కొన్ని సీన్స్ లో హెవీ మ్యూజిక్ తో డైలాగ్స్ డామినేట్ చేసారు. లొకేషన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. కథ మొత్తం అయిదారు లొకేషన్స్ లోనే నడుస్తుంది. తిండిపోతు దయ్యం అనే కొత్త పాయింట్ ని తీసుకున్నా కథనం మాత్రం రొటీన్ హారర్ కామెడీతో తెరకెక్కించారు. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘బకాసుర రెస్టారెంట్‌’ తిండిపోతు దయ్యం వస్తే ఓ అయిదుగురు బ్యాచిలర్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని హారర్ కామెడీగా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Exit mobile version