Mothevari Love Story : ‘మోతెవరి లవ్ స్టోరీ’ రివ్యూ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వెబ్ సిరీస్.. హీరోగా మారిన యూట్యూబర్..

అనిల్ గీలా మెయిన్ లీడ్ లో సిరీస్ అనడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.

Mothevari Love Story : ‘మోతెవరి లవ్ స్టోరీ’ రివ్యూ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వెబ్ సిరీస్.. హీరోగా మారిన యూట్యూబర్..

Mothevari Love Story

Updated On : August 8, 2025 / 7:18 AM IST

Mothevari Love Story Web Series Review : మై విలేజ్ షోతో ఫేమ్ తెచ్చుకున్న అనిల్ గీలా ఈ వెబ్ సిరిస్ తో హీరోగా మారాడు. అనీల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల మెయిన్ లీడ్స్ లో మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాణంలో శివ కృష్ణ బుర్రా దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘మోతెవరి లవ్ స్టోరీ’. ఈ సిరీస్‌‌‌ నేడు ఆగస్ట్ 8 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

కథ విషయానికొస్తే.. మోతెవరి అలియాస్ బొంగుల పరుశురాములు అనే ముసలాయన ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కొన్నాళ్ళకు ఆయన కొడుకులు సత్తయ్య(మురళీధర్ గౌడ్), నర్సింగ్ యాదవ్ (RS నంద) తన తండ్రి ఫ్రీగా పంచేసిన భూములను తిరిగి తీసుకుంటూ ఉంటారు. అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటారు. సత్తయ్య కూతురు అనిత(వర్షిణి) పర్శి(అనిల్ గీలా) ప్రేమించుకుంటారు. ఓ రోజు వీళ్ళిద్దరూ లేచిపోదాం అనుకోని రాత్రిపూట బయటకి వస్తారు కానీ అక్కడ జరిగే ఓ సంఘటనతో వెళ్ళలేరు.

మోతెవరి హైదరాబాద్ లో ఒక స్థలం పర్శి అమ్మమ్మ హనుమవ్వకు రాసిచ్చినట్టు తెలుస్తుంది. దీంతో సత్తయ్య, నర్సింగ్ హనుమవ్వ దగ్గరికి వెళ్లి కష్టాల్లో ఉన్నాం ఆ స్థలం కావాలి అని అడుగుతారు. ఇదే మంచి టైం అనుకోని పర్శి సత్తయ్య కూతుర్ని లవ్ చేస్తున్నాను అని అమ్మమ్మతో చెప్పడంతో ఆమె స్థలం ఇచ్చేస్తాను కానీ మీ బిడ్డను నా మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలని అడుగుతుంది. ఇందుకు సత్తయ్య స్థలం వస్తుందని వెంటనే ఒప్పుకుంటాడు. దీంతో స్థలం మొత్తం కొట్టేయడానికి సత్తయ్య ఈ పెళ్లి చేస్తున్నాడని నంద అన్నయ్యతో గొడవ పెట్టుకొని వెళ్లిపోతాడు.

అసలు మోతెవరి నీకు ఎందుకు స్థలం రాసిచ్చాడు అని పర్శి తన అమ్మమ్మని ప్రశ్నించగా 60 ఏళ్ళ క్రితం జరిగిన వాళ్ళ లవ్ స్టోరీ చెప్తుంది. మోతెవరి (యోంగ్ మోతెవరి రాజ్), నేను(యంగ్ హనుమవ్వ మాన్సి) ప్రేమించుకున్నాం కానీ మా నాన్న ఆయన దగ్గర డబ్బులు లేవని ఒప్పుకోలేదు. ఆయన దుబాయ్ కి వెళ్లి డబ్బులు సంపాదించి వద్దమనుకున్నాడు. వెళ్ళడానికి కూడా డబ్బులు లేకపోవడంతో నా బంగారు గాజులు ఇచ్చాను, అతని కోసం వెయిట్ చేశాను దుబాయ్ నుంచి వస్తాడని అని చెప్తుంది. ఇక పర్షి – అనితల పెళ్లి పనులు మొదలుపెట్టే సమయానికి నర్సింగ్ ఈ పెళ్లి జరగకూడదని అనిత బావని తీసుకొస్తాడు. మరి పర్శి – అనితల పెళ్లి జరిగిందా? అసలు మోతెవరి హనుమవ్వకు ఎందుకు స్థలం రాసిచ్చాడు? మోతెవరి దుబాయ్ నుంచి వచ్చాడా? సత్తయ్య – నర్సింగ్ అన్నదమ్ముల గొడవలు తీరాయా? మోతెవరి హనుమవ్వని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు మోతెవరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

Also Read : Chiranjeevi – Anchor Ravi : ఇది కదా మెగాస్టార్ అంటే.. రెండేళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని.. నేను చూసి నమ్మే దేవుడు.. చిరు గురించి యాంకర్ రవి ఏం చెప్పాడంటే..

సిరీస్ విశ్లేషణ.. అనిల్ గీలా మై విలేజ్ షోతో యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. అనిల్ గీలా మెయిన్ లీడ్ లో సిరీస్ అనడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. మొతం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త సాగదీశారు. పర్శి అనితని లేపుకుపోయే సీన్ అయితే ఫుల్ గా నవ్వుకోవాల్సిందే. మూడో ఎపిసోడ్ నుంచి సిరీస్ ఆసక్తిగా నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మోతెవరి లవ్ స్టోరీ మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంది. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ప్రస్తుత జనరేషన్ లవ్ స్టోరీతో పాటు 1970 ల్లో జరిగిన లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు.

అక్కడక్కడా కామెడీతో నవ్విస్తూ, కాస్త ఎమోషన్ తో కన్నీళ్లు తెప్పిస్తూ, కాస్త సాగదీసి బోర్ కొట్టిస్తూ సాగింది ఈ సిరీస్. ప్రతి సీన్ లో, డైలాగ్స్ లో తెలంగాణ యాస, పద్ధతులు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో గతంలో పలు సిరీస్ లు వచ్చినా అంతగా ప్రభావం చూపించలేదు. కానీ ఈ సిరీస్ మాత్రం ఫ్యామిలీలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం, అనిల్ గీలా చేయడంతో తెలంగాణ సిరీస్ అని భావం రావడంతో తెలంగాణ వరకు అయితే ఈ సిరీస్ కనెక్ట్ అవుతుంది. మోతెవరి అంటే తెలంగాణ పల్లెల్లో కాస్త డబ్బు ఉన్నవాళ్లు, పెద్ద మనిషి అనే అర్ధం వస్తుంది. సిరీస్ కి తగ్గట్టు టైటిల్ బాగానే సెట్ అయింది.

mothevari love story

నటీనటుల పర్ఫార్మెన్స్.. అనిల్ గీలా మెయిన్ లీడ్ లో తనకున్న కామెడీ స్టైల్ తో బాగానే నటించాడు. వర్షిణి ఇప్పటి జనరేషన్ అమ్మాయిలా కనిపిస్తూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ, రీల్స్ పిచ్చిలో ఉండే అమ్మాయిలా కనిపించింది. కానీ వర్షిణి పాత్ర చూస్తే అక్కడక్కడా చిరాకు రావడం ఖాయం. కాకపోతే సిరీస్ కోసం ఆ పాత్రను అలాగే రాసుకున్నారేమో. ఫ్లాష్ బ్యాక్ లో మోతెవరి గా నటించిన రాజ్, హనుమవ్వగా నటించిన మాన్సి మాత్రం తమ నటనతో మెప్పిస్తారు. మురళీధర్ గౌడ్, నంద అన్నదమ్ములుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. చాలా వరకు మై విలేజ్ షోలో నటించేవాళ్ళు, ఊళ్ళల్లో ఉండే లోకల్ నటీనటులనే తీసుకున్నారు.

Also Read : Su From So : ‘సు ఫ్రం సో’ మూవీ రివ్యూ.. కామెడీ హారర్.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ విజువల్స్ బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. రియల్ విలేజ్ లొకేషన్స్ లో షూట్ చేయడం సిరీస్ కి మరింత కలిసొచ్చింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రెండు లవ్ స్టోరీలు రాసుకొని, వాటికి లింక్ ఇస్తూ రెగ్యులర్ కథే అయినా కాస్త కొత్త కథనంతో, ప్యూర్ తెలంగాణ డైలాగ్స్ తో బాగానే రాసి తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా లిమిటెడ్ బడ్జెట్ తోనే ఈ సిరీస్ ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ప్రమోషన్స్ లో కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే తీసాం అని చెప్పడం గమనార్హం.

మొత్తంగా ‘మోతెవరి లవ్ స్టోరీ’ రెండు లవ్ స్టోరీలతో తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన వెబ్ సిరీస్. ఫ్యామిలీతో చూడొచ్చు. కాసేపు నవ్వుకోవచ్చు.

గమనిక : ఈ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.