Hathya Review : ‘హత్య’ మూవీ రివ్యూ.. మర్డర్ మిస్టరీ..
'హత్య' సినిమా ఓ రాజకీయ నేపథ్యం ఉన్న మర్డర్ మిస్టరీని సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపించే ప్రయత్నం చేసారు.

Dhanya Balakrishna Pooja Ramachandran Hathya Movie Review and Rating
Hathya Movie Review : ధన్య బాలకృష్ణ, రవివర్మ, భరత్, పూజ రామచంద్రన్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా హత్య. మహాకాల్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీవిద్య బసవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన హత్య సినిమా నేడు జనవరి 24న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. ఇల్లందులో రాజకీయ నాయకుడు అయిన ధర్మేంద్ర రెడ్డి(రవి వర్మ) హత్యకు గురవుతారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులకు ఎలాంటి క్లూస్ దొరక్కపోవడంతో కేసుని ముఖ్యమంత్రి కిరణ్(భరత్) ఐపీఎస్ ఆఫీసర్ సుధా(ధన్య బాలకృష్ణ)కు అప్పగిస్తారు. మరి సుధ ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది? ఈ క్రమంలో ధర్మేంద్రకు సలీమా (పూజా రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏంటి? అసలు ధర్మేంద్ర రెడ్డిని హత్య చేసింది ఎవరు? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు) ఏం చేసింది? ఈ హత్యకు రాజకీయాలు కారణమా? ఆర్ధిక సమస్యలు కారణమా? కుటుంబ కలహాలు కారణమా? ఈ హత్య ఎలా జరిగింది? ఎందుకు చేసారు? సుధా ఈ కేసుని ఎలా డీల్ చేసింది? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ.. ఈ సినిమా చూస్తుంటే ఏపీలోని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గుర్తొస్తుంది. ట్రైలర్ రిలీజయినప్పుడే అందరికి ఇదే డౌట్ వచ్చింది. కానీ బయట ఏమి జరిగింది అని సంబంధం లేకుండా కొన్ని కల్పిత పాత్రలతో విన్న కథలతో ఈ సినిమాని ఒక మర్డర్ మిస్టరీగా బాగానే రాసుకున్నారు.
ఫస్ట్ హాఫ్ హత్య జరిగింది చూపించి, ఆ కేసుని స్పెషల్ ఆఫీసర్ కి అప్పగించడం, ఆఫీసర్ హంతకుడిని పట్టుకోవడానికి వెతుకులాట అన్నట్టు సాగుతుంది. మొదట్లో ఆసక్తిగా ఉన్నా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా కాస్త బోరింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ ఒకటి పెట్టారు. ఇది విడిగా లవ్ స్టోరీ పరంగా బాగానే ఉన్నా ఈ మర్డర్ మిస్టరీలో లవ్ స్టోరీ అవసరమా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ని మాత్రం చాలా ఎంగేజింగ్ గా నెక్స్ట్ ఏంటి, హత్య ఎవరు చేసారు అని ఆసక్తి కలిగిస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. క్లైమాక్స్ లో మంచి ఎమోషన్ పండించారు. హత్య విజువల్స్ కూడా దారుణంగా చూపించారు. ఓ రాజకీయ నేపథ్యంలో జరిగిన హత్య కేసుని సస్పెన్స్ థ్రిల్లింగ్ గా ప్రజెంట్ చేసారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సినిమాలో ధన్య బాలకృష్ణ పోలీసాఫీసర్ పాత్రలో బాగా నటించింది. రవివర్మ కాస్త ఏజ్ ఉన్న రాజకీయ నాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. చాన్నాళ్ల తర్వాత కనిపించిన పూజా రామచంద్రన్ సినిమాలో కాసేపే కనిపించినా ఆ పాత్ర చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. భరత్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమా సాంకేతికంగా మాత్రం చాలా బాగుంది. సరికొత్త గ్రేడింగ్ లో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సస్పెన్స్ ని బాగా పండించింది. మద లాంటి సినిమాతో మెప్పించిన శ్రీవిద్య బసవ ఓ రాజకీయ కోణంలో పాయింట్ ని తీసుకొని మర్డర్ మిస్టరీగా బాగానే తెరకెక్కించింది. నిర్మాణ పరంగా కూడా ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘హత్య’ సినిమా ఓ రాజకీయ నేపథ్యం ఉన్న మర్డర్ మిస్టరీని సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.