Dil Raju Sing a Song in Naga Chaitanya First Movie Josh
Dil Raju : టాలీవుడ్ లో దిల్ రాజు ప్రస్తుతం అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి నిర్మాతగా మారి వరుస సూపర్ హిట్ సినిమాలు అందించి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఆల్మోస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు తీశారు దిల్ రాజు. ఇటీవల తన కూతురితో దిల్ రాజు ప్రొడక్షన్స్ కూడా స్థాపించి చిన్న సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
అయితే దిల్ రాజు సినిమాలు చాలా వరకు హిట్ అవుతాయని, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారని ఇండస్ట్రీలో ఒక పేరు ఉంది. కథల మీద కూడా దిల్ రాజుకి మంచి గ్రిప్ ఉంటుందని, సినిమా కథ డిస్కషన్స్ లో దిల్ రాజు కూడా కూర్చుంటాడని టాక్ ఉంది. అయితే నిర్మాతగానే కాకుండా దిల్ రాజులో ఇంకో ట్యాలెంట్ కూడా ఉంది. అదే సింగింగ్. దిల్ రాజు ఓ సినిమాలో పాట కూడా పాడారు. దిల్ రాజుకి మ్యూజిక్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది. అందుకే ఆయన నిర్మించే సినిమాల్లో పాటలు కూడా బాగుంటాయి.
నాగ చైతన్యను హీరోగా పరిచయం చేస్తూ వాసువర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జోష్’. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో JD చక్రవర్తి కాలేజీకి వస్తున్నప్పుడు అక్కడి స్టూడెంట్స్.. అన్నయ్య వచ్చినాడో.. వెలుగుల వెన్నెల తెచ్చినాడో.. అనే ఓ పాట పాడతారు. ఈ పాట ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. అయితే ఈ పాట ఒరిజినల్ గా పాడింది దిల్ రాజు. చాలా మందికి ఈ విషయం తెలీదు.
Also Read : Komatireddy Venkat Reddy : తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరో తెలుసా? పాతికేళ్ల రాజకీయ అనుభవం..
గతంలో రాఘవేంద్రరావు సౌందర్య లహరి అనే ప్రోగ్రాం నిర్వహించగా ఆ కార్యక్రమంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. దిల్ రాజు దీని గురించి మాట్లాడుతూ.. నాకు మ్యూజిక్ మీద మంచి పట్టు ఉంది. మ్యూజిక్ ఎప్పుడూ హమ్ చేస్తుంటాను. సినిమాల్లో మ్యూజిక్, లిరిక్స్ కూడా ఒకసారి చూసుకుంటాను. ఆ సినిమా సమయంలో నేను వద్దన్నా డైరెక్టర్ వాసు వర్మ ఇబ్బంది పెట్టేసరికి పాడాను అని తెలిపారు. రాఘవేంద్రరావు కూడా.. అందుకే దిల్ రాజు సినిమాల్లో సాంగ్స్ బాగుంటాయని అన్నారు. ఇది పాత వీడియో అయినా ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది.
దీంతో దిల్ రాజులో ఈ ట్యాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలు, మరికొన్ని సినిమాలు తెరకెక్కిస్తున్నారు.