ఇప్పటికే నీరు కొంటున్నాం.. భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకూడదు..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ప్రముఖ సినీనటి సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి తాజాగా తన నివాసంలో మూడు మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా శిల్పా రెడ్డి మాట్లాడుతూ… ‘చెట్లను నాటడం అనేది మానవ జీవితంలో ఒక భాగం. ఇలా మనం మాత్రమే చెట్లను నాటడం కాకుండా మన ఇంట్లో వాళ్ళందరిని అలాగే చుట్టూ పక్కల వారిని బంధు మిత్రులను ఇందులో భాగస్వామ్యం చేస్తే రాబోవు తరాల వారికి ఒక గొప్ప బహుమతి ఇచ్చిన వాళ్లమవుతాం.. అలాగే నాటిన ప్రతీ మొక్కను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే అది భవిష్యత్ తరానికి బాసటగా నిలుస్తుంది’ అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇంతటి గొప్ప కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ గారికి అలాగే సినీనటి సమంత కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే శిల్పారెడ్డి మరో నలుగురిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి నామినేట్ చేశారు. అందులో అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, సుస్మిత కొణిదెల, మంచు లక్ష్మీ అలాగే సామ్రాట్ రెడ్డి ఉన్నారు.
శిల్పా రెడ్డి విసిరిన ఛాలెంజ్ లో భాగంగా టాలీవుడ్ యువ నటుడు సామ్రాట్ పాల్గొని మొక్కలు నాటాడు.
ఈ సందర్భంగా సామ్రాట్ మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా విజయవంతమైంది. హరితహారం స్ఫూర్తితో గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. నన్ను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే మనం నీరు కొనుక్కుంటున్నాం.. భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకూడదు. భవిష్యత్ తరాలకు మనము ఇచ్చేది ఒకటే. మంచి వాతావరణాన్ని అందించడం.. కాబట్టి మనందరం కూడా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని’ పిలుపునిచ్చారు. నేను కూడా ప్రతిరోజు ఆఫీసుకి వెళ్ళే సమయంలో తప్పకుండా నేను నాటిన మొక్క రక్షించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా సమయంలో కూడా చెట్లు నాటే కార్యక్రమం ఆగకూడదు అన్నారు సామ్రాట్.