హ్యాపీ బర్త్‌డే సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్
సూపర్‌స్టార్ రజినీకాంత్ డిసెంబర్ 12 నాటికి 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు..

సూపర్‌స్టార్ రజినీకాంత్ డిసెంబర్ 12 నాటికి 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు..
సిల్వర్ స్క్రీన్ సూపర్‌స్టార్, రియల్ లైఫ్ సూపర్ హీరో రజినీకాంత్ డిసెంబర్ 12న తన 69వ పుట్టినరోజు జరపుకుంటున్నారు. బస్ కండక్టర్‌గా ప్రారంభమైన ప్రస్థానం, తనదైన శైలిలో వేసిన విజిల్, నడచిన నడక, సిగరెట్ నోట్లో వేసే స్టైల్.. ఇవన్నీ కలగలిపి శివాజీరావు గైక్వాడ్‌ని రజీనీకాంత్‌గా మార్చాయి.
ఆయన సినీ జీవితం తెరచిన పుస్తకం.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమిళనాట స్టార్ హీరోగా వెలుగొందుతూనే, తెలుగులో కూడా అంతే స్థాయిలో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు రజినీ.
తన గురువు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వరాగంగల్’ సినిమాతో తెరంగేట్రం చేసిన రజినీ.. ‘అంతులేని కథ’ తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తమిళనాట సూపర్‌స్టార్‌గా స్థిరపడ్డారు.
రజినీ కెరీర్.. ‘బాష’తో మరో కీలక మలుపు తీసుకుంది. ఆటోడ్రైవర్ మాణిక్ బాషగా, అండర్ వరల్డ్ డాన్ మాణిక్ బాషగా రజినీ నటనకు బాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
‘పెదరాయుడు’ లో పాపారాయుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రజినీ.. ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహా’, ‘చంద్రముఖి’ ‘శివాజీ’, ‘రోబో’, ‘కబాలి’, ‘కాలా’, ‘2.0’, ‘పేట’ చిత్రాలతో అలరించారు.
60 ఏళ్లు పై బడ్డా 20 ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా పనిచేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు రజినీ. తొలిసారి మురుగదాస్ దర్శకత్వంలో నటించిన ‘దర్బార్’ 2020 జనవరి 9న విడుదల కానుంది.
రజినీ బర్త్‌డే సందర్భంగా ఒక్కరోజు ముందుగానే సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెకక్కనున్న ‘రజినీ 168’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రారంభమైంది.
సినిమాల్లో తనను అమితంగా అభిమానించి ఆదరించిన అభిమానులకు, తమిళ ప్రజలకు సేవ చేయడానికి రజినీ త్వరలో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రానున్నారు.
రజినీ పుట్టినరోజుని పురస్కరించుకుని దాదాపు 25 ఏళ్ల తర్వాత ‘బాషా’ చిత్రం డిజిటల్ రీ మాస్టర్డ్ వెర్షన్ రిలీజ్ చేయడం విశేషం. డిసెంబర్ 12న తలైవార్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.