Hero Nani : హీరో నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ‘కోర్టు మూవీ న‌చ్చ‌కుంటే.. నా హిట్ 3 ని ఎవ్వ‌రూ చూడ‌కండి..’

కోర్టు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Hero nani comments in Court Movie pre release event

ప్రియదర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘కోర్ట్‌’–స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ’. రామ్ జ‌గ‌దీశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని నాని వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి జంట‌గా న‌టిస్తున్నారు.

శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలక పాత్ర‌ల‌ను పోషించారు. ఇక ఈ చిత్రం హోలీ సంద‌ర్భంగా మార్చి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హీరో నాని ప్రోడక్షన్‌ హౌస్‌ నుంచి వ‌స్తుండడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో ట్రైల‌ర్‌ను నాని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాను సినీ ప‌రిశ్ర‌మలోకి వ‌చ్చి 16 ఏళ్లు దాటింద‌న్నారు. అయిన‌ప్ప‌టికి ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌లానా సినిమా చూడాల‌ని తానెప్పుడు చెప్ప‌లేద‌న్నారు. కానీ.. కోర్టు మూవీని ప్ర‌తి ఒక్క‌రు చూడాల‌న్నారు.

ఇప్పుడు సినిమాల్లో దూరిపోయి, అందులో పాత్ర‌ల ఎమోష‌న్‌తో క‌నెక్ట్ అయిపోయి, వాటితో పాటు న‌వ్వి, ఎడ్చి.. ఆ చిత్ర ప్ర‌పంచంలోకి తీసుకువెళ్లే క‌థలు బాగా త‌గ్గిపోయాన‌న్నారు. కానీ అలాంటి అనుభూతిని కోర్టు చిత్రంతో తాను పొందాన‌ని, ఇప్పుడా అనుభూతిని ప్రేక్ష‌కులు పొందాల‌నేదే త‌న తాప‌త్ర‌యం అని చెప్పారు.

అందుక‌నే ఇంత‌గా చెబుతున్నాన‌ని తెలిపారు. ఒక‌వేళ ఈ చిత్రం గ‌నుక తాను చెప్పిన‌ట్లు లేకున్నా, అంచ‌నాల‌ను అందుకోలేకుంటే మ‌రో రెండు నెల‌ల్లో విడుద‌ల కానున్న త‌న చిత్రం హిట్ 3ని ఎవ‌రూ చూడొద్ద‌ని నాని కామెంట్స్ చేశారు. కోర్టు మూవీపై పెట్టిన దానికంటే హిట్ 3 మూవీ పై ఎక్కువ‌గా ఖ‌ర్చుపెట్టాన‌న్నారు. ఇంత‌లా ఎందుకు చెబుతున్నానో ఆలోచించాల‌న్నారు.

Jr NTR : మూడు పండుగలకు మూడు సినిమాలు.. ఫుల్ స్పీడ్‌లో జూ.ఎన్టీఆర్

ఈ నెల 14 వ‌ర‌కు మాత్ర‌మే తాను కోర్టు మూవీ చూడాల‌ని చెబుతాన‌ని, ఆ త‌రువాత ఆడియ‌న్స్ అయిన మీరే అంద‌రికి సినిమా చూడాల‌ని చెబుతార‌ని నాని అన్నారు.