‘‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’’ విడుదలకు హైకోర్టు బ్రేక్..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’’ విడుదలకు హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ సినిమాపై గతకొద్ది రోజులుగా ఈ సినిమా టైటిల్ గురించి, ఇతరత్రా రాజకీయ అంశాల గురించి చర్చలు జరగడం, కేసులు పెట్టడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి.
నవంబర్ 29న సినిమా విడుదల పక్కా, ఒకవేళ సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేస్తే ‘‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’’ అని టైటిల్ మారుస్తానని ప్రకటించిన వర్మ, గురువారం మధ్యాహ్నం ‘‘దండాలు’’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. ఇంతలో KRKR సినిమా విడుదల గురించి కోర్టు వర్మ ఊహించని తీర్పు వెల్లడించింది..
‘‘ఇప్పటి వరకు ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదని సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు తెలుపగా.. వారం రోజుల్లో సినిమా చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని, రెండు కులాల మధ్య చిచ్చు రగిలించేలా ఉన్న టైటిల్‌ను మార్చాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు సూచించింది. అయితే ఇప్పటికే టైటిల్ మార్చామని, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ డిమాండ్ చేస్తున్నాడు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతానికి ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ విడుదల వాయిదా పడింది..