Jinn Movie Review
Jinn Movie Review : సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్ పై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన సినిమా ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు డిసెంబర్ 19న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. ఓ కాలేజ్ స్టూడెంట్ రాత్రి పూట అనుకోకుండా కాలేజీ లైబ్రరీలో ఒక్కడే ఇరుక్కుపోవడం, అక్కడ కొన్ని వింత అనుభవాలు ఎదురవడంతో కథ మొదలవుతుంది. బాషా(పర్వేజ్ సింబా) అతని ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఓ ఎగ్జామ్ రాయడానికి భూతనాల చెరువు దగ్గర్లో ఉన్న కాలేజీకి వెళ్తారు. కానీ అక్కడ ఏదో ప్రేతాత్మ శక్తి వల్ల వారి శరీరాలు బయటే యాక్సిడెంట్ అయి పడిపోయి కేవలం ఆత్మలు మాత్రమే కాలేజీ లోపలి వెళ్తాయి. యాక్సిడెంట్ అయిందని బాషా, అతని స్నేహితులు కోమాలో హాస్పిటల్ లో ఉంటారు. వాళ్ళ ఆత్మలు మాత్రం కాలేజీలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటాయి.
ఓ ముస్లిం భూత వైద్యుడు మౌల్వి(అమ్మిత్ రావు) దీని గురించి తెలుసుకొని వీరి ఆత్మలను బయటకు తీసుకురావడానికి జిన్ సాయంతో ప్రయత్నిస్తాడు. ఈ కేసుని దయ్యాలు, దేవుడు అంటే నమ్మని అశ్వత్ నారాయణ అనే పోలీస్ ఆఫీసర్ డీల్ చేస్తాడు. అసలు ఆ కాలేజీలో ఏం జరిగింది? ఆత్మలు కాలేజీ నుంచి బయటకు రాకుండా ఏ శక్తి ఆపుతుంది? మౌల్వి ఆ నలుగురు ఆత్మలను బయటకు రప్పించాడా? ఆ కాలేజీలో ఉన్న ప్రేతాత్మ శక్తి ఏంటి? అసలు ఈ జిన్ ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Avatar Fire and Ash : ‘అవతార్ 3 : ఫైర్ అండ్ ఆష్’ మూవీ రివ్యూ.. మళ్ళీ పార్ట్ 2నే తీశారు కదరా బాబు..
జిన్ అనే కొత్త టైటిల్ తో హారర్ సినిమా అనడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. జిన్ అంటే ముస్లిం మతం ప్రకారం కంటికి కనపడని అతీంద్రియ జీవులు. వీటిలో మంచివి, చెడువి ఉంటాయి. ముస్లిం భూత వైద్యులు వీటిని తమ ఆధీనంలో ఉంచుకొని పనులు చేయించుకుంటారు. దీంతో కొత్త కాన్సెప్ట్ తో హారర్ కథగా ఈ జిన్ ని రాసుకున్నారు.
ఫస్ట్ హాఫ్ అంతా నలుగురు స్నేహితులు కాలేజీకి వెళ్లడం, వాళ్ళు ఆత్మలు అయ్యారని తెలుసుకోవడం, మౌల్వి రావడం, కాలేజీ లో హారర్ సంఘటనలతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఏదో ప్రేతాత్మ శక్తి కాలేజీలో ఆత్మలు బయటకు వెళ్లనివ్వకుండా చేస్తుందని, ఆ శక్తి ఏంటని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా మౌల్వి ఆత్మలను బయటకు తీసుకురావడానికి ఏం చేసాడు, జిన్ ని ఎలా వాడాడు అని సాగుతుంది.
అయితే ఆ జిన్ కాన్సెప్ట్ ని పూర్తిగా చెప్పలేదు. జిన్ ని ఓ రెండు మూడు సార్లు సినిమాలో వాడతారు కానీ సినిమా కథ దాని చుట్టూ తిరగదు. మరి ఈ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో. జిన్ గురించి ఇంకాస్త చూపించాల్సింది. ఇక ఏదో ప్రేతాత్మ శక్తి ఉందని చూపించారు కానీ అదేంటి? దాని కథేంటి మాత్రం చెప్పలేదు. కాలేజీలో చిక్కుకున్న బాషా ఆత్మకు ఈ జిన్ గురించి ఎలా తెలుస్తుంది, మౌల్వి వీళ్ళను బయటకు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎలా తెలుస్తాయి అని క్లారిటీ ఇవ్వలేదు. అసలు కాలేజీలో చాలా ఆత్మలు ఎందుకు ఉన్నాయి, అవి ఎవరివి అనే క్లారిటీ కూడా ఇవ్వలేదు.
క్లైమాక్స్ ట్విస్టులు బాగున్నా కథని ఎలా ముగించాలో తెలియక సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడా కామెడీతో నవ్వించినా హారర్ పరంగా ఇంకా భయపెట్టాల్సింది. ఇది కన్నడ డబ్బింగ్ సినిమా కావడం గమనార్హం.
నటీనటుల పర్ఫార్మెన్స్.. బాషా పాత్రలో నటించిన పర్వేజ్ సింబా బాగానే నటించాడు. ముస్లిం భూత వైద్యుడు మౌల్వి పాత్రలో అమ్మిత్ రావు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ లో మెప్పిస్తాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన వ్యక్తి బాగా నటించారు. బాషా అంకుల్, పోలీస్ కానిస్టేబుల్ అక్కడక్కడా నవ్వించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : MissTerious Review : ‘మిస్టీరియస్’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ ట్విస్టులు మాములుగా లేవుగా..
సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టడానికి బాగా హెల్ప్ అయింది. డైరెక్టర్ కొత్త కాన్సెప్ట్ తీసుకున్నా కథని క్లారిటీగా చెప్పడంలో కాస్త తడబడ్డారు. స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాసుకున్నారు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. కన్నడ సినిమా కావడంతో తెలుగు డబ్బింగ్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ పరంగా రెండు మూడు లొకేషన్స్ లోనే సినిమా అంతా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘జిన్’ అనే సినిమా ఓ కొత్త కాన్సెప్ట్ తో భయపెట్టే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.