Avatar Fire and Ash : ‘అవతార్ 3 : ఫైర్ అండ్ ఆష్’ మూవీ రివ్యూ.. మళ్ళీ పార్ట్ 2నే తీశారు కదరా బాబు..

అవతార్ ఫస్ట్ పార్ట్ 2009లో రిలీజయినప్పుడు చాలా కొత్తగా, వింతగా ఉండటం, స్టోరీ కూడా కొత్తగా ఉండటంతో అందరికి నచ్చి పెద్ద హిట్ అయింది. (Avatar Fire and Ash)

Avatar Fire and Ash : ‘అవతార్ 3 : ఫైర్ అండ్ ఆష్’ మూవీ రివ్యూ.. మళ్ళీ పార్ట్ 2నే తీశారు కదరా బాబు..

Avatar Fire and Ash

Updated On : December 19, 2025 / 3:59 PM IST

Avatar Fire and Ash : హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అవతార్ సిరీస్ లో భాగంగా వచ్చిన పార్ట్ 3 ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. 20th సెంచరీ స్టూడియోస్ ఈ సినిమాని నేడు డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఇండియాలో కూడా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది.(Avatar Fire and Ash)

కథ విషయానికొస్తే.. అవతార్ పార్ట్ 2 లో జేక్ సల్లీ(సామ్ వార్తింగ్టన్), అతని ఫ్యామిలీ వాటర్, సముద్రం ఆధారంగా బతికే మెట్కయినా జాతిలో కలిసిపోయి అక్కడ జీవిస్తూ ఉంటారు. ఖ్వారిచ్(స్టీఫెన్ లంగ్) కొడుకు స్పైడర్(జాక్ ఛాంపియన్) అవతార్ గా మారకపోయినా వీళ్ళ ఫ్యామిలీతో కలిసి పోయి ఉంటాడు. ఇక పార్ట్ 3 అక్కడనుంచే కథ మొదలయి ఖ్వారిచ్, అతని ఆర్మీ జేక్ సల్లీ, స్పైడర్ ని వెతికే పనిలోనే ఉంటారు. స్పైడర్, జేక్ సల్లీ ఫ్యామిలీ మెట్కయినా జాతిలో కలిసి హ్యాపీగా బతికేస్తూ ఉంటారు. కానీ స్పైడర్ కోసం మిలిటరీ ఎప్పటికైనా వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారని తెలుస్తుంది.

అందుకు స్పైడర్ ని వేరే జాతితో పంపించేద్దామని స్పైడర్ కి నచ్చకపోయినా జేక్ సల్లీ, అతని ఫ్యామిలీ ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలో స్పైడర్ ని విడిచిపెట్టి రావడానికి వర్తక జాతితో జేక్ సల్లీ, అతని ఫ్యామిలీ కూడా వెళ్తారు. ఈ దారిలో అగ్ని, బూడిదతో బతికే మాంగ్క్వాన్ జాతి వీరిపై దాడి చేస్తారు. అదే సమయంలో ఖ్వారిచ్, అతని మనుషులు కూడా జేక్ సల్లీ ఫ్యామిలీపై దాడి చేస్తారు. మరి జేక్ సల్లీ ఫ్యామిలీ వారి నుంచి ఎలా బయటపడింది? మిలటరీ వాళ్ళు మళ్ళీ మెట్కయినా జాతిపైకి యుద్దానికి ఎందుకు వచ్చారు? మాంగ్క్వాన్ జాతి కథేంటి?స్పైడర్ ఎవరివైపు ఉంటాడు? మధ్యలో స్పైడర్, జేక్ సల్లీ కూతురు ప్రేమ కథ.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : MissTerious Review : ‘మిస్టీరియస్’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ ట్విస్టులు మాములుగా లేవుగా..

సినిమా విశ్లేషణ..

అవతార్ ఫస్ట్ పార్ట్ 2009లో రిలీజయినప్పుడు చాలా కొత్తగా, వింతగా ఉండటం, స్టోరీ కూడా కొత్తగా ఉండటంతో అందరికి నచ్చి పెద్ద హిట్ అయింది. అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. పార్ట్ 2 సినిమా 2022 లో రిలీజయినప్పుడు కథ పరంగా సింపుల్ గా ఉన్నా విజువల్స్ తో మెప్పించారు. ఇప్పుడు పార్ట్ 3 రిలీజయింది. ఈ సినిమా అయిదు పార్టులు, పంచ భూతాలు లాగా కథ నడుస్తుందని చెప్పారు.

ఫస్ట్ పార్ట్ అడవుల్లో కథ నడవగా, సెకండ్ పార్ట్ నీళ్ళల్లో, మూడో పార్ట్ అగ్నితో అని చెప్పి ప్రమోట్ చేసారు. పార్ట్ 3 కి టైటిల్ ఫైర్ & ఆష్ అనే పెట్టారు. తీరా చూస్తే సినిమా మొత్తం మళ్ళీ నీళ్ల చుట్టే తిరుగుతుంది. ఫైర్ జాతి మధ్యలో ఒకటి రెండు సార్లు వస్తారు. వాళ్ళ కథ ఏం చెప్పరు, వాళ్ళ విన్యాసాలు సింపుల్ గానే చూపించారు. ఇక కథ పరంగా మళ్ళీ పార్ట్ 2నే తీశారు అనిపిస్తుంది. జేక్ సల్లీ గురించి వెతకడం, తుకున్ అనే భారీ సముద్ర జీవుల కోసం ప్రయత్నించడం, మళ్ళీ నీళ్ల జాతి మీదకు యుద్దానికి రావడం కథ అంతా పార్ట్ 2నే అనిపిస్తుంది.

కేవలం స్పైడర్, జేక్ సల్లీ మిలిటరీ వాళ్లకు దొరికితే ఎలా తపించుకున్నారు, అగ్ని జాతి మిలిటరీ వాళ్లకు ఎలా సపోర్ట్ చేసింది అని రెండు పాయింట్స్ కొత్తగా జత చేసారు అంతే. ఎమోషన్ కూడా ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు. జేక్ సల్లీ ఫ్యామిలీ ఎమోషన్ ని మళ్ళీ సాగదీశారు. నిడివి కూడా 3 గంటల 17 నిముషాలు కావడంతో ఫస్ట్ హాఫ్ ని బాగా సాగదీశారు. సెకండ్ హాఫ్ మాత్రం కొంత ఫైట్ సీన్స్ తో ఆసక్తిగానే నడిపించారు. విజువల్స్ పరంగా గత సినిమాల్లో ఉన్నవే ఉన్నా గొప్పగానే చూపించారు. ఇందులో కొత్తగా గాలిలో ఓడలు నడిపే చేపలు, అగ్ని జాతి, క్లైమాక్స్ లో వచ్చే కొన్ని జంతువులు కొత్తగా చూపించారు. ఇక అవతార్ పార్ట్ 4 కి కూడా లీడ్ ఇచ్చారు. ఈసారి మాత్రం పార్ట్ 4 లో జేక్ సల్లీని పక్కన పెట్టి స్పైడర్ ని హీరో చేస్తారు అని సినిమా ముగించిన దాన్నిబట్టి తెలుస్తుంది.

Avatar Fire and Ash

నటీనటులు, సాంకేతిక అంశాలు..

ఫస్ట్ పార్ట్ నుంచి ఉన్న నటీనటులే ఈ సినిమాలో అదే పాత్రల్లో కమిటీన్యూ చేస్తూ మెప్పిస్తున్నారు. జేక్ సల్లీ, అతని భార్య, స్పైడర్, కిరి, లోక్, ఖ్వారిచ్.. ఈ పాత్రలు అన్నిట్లో నటీనటులు బాగా మెప్పించారు. కొత్తగా యాడ్ అయిన అగ్ని రాణి వరంగ్ పాత్రలో ఊనా చాప్లిన్ నెగిటివ్ షేడ్స్ లో బాగా నటించింది. అవతార్ ఆల్రెడీ రెండు పార్ట్స్ చూసాం కాబట్టి సాంకేతికంగా ఈ సినిమాకు వంక పెట్టడానికి ఏం ఉండదు. విజువల్స్, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ మాత్రం ఎమోషనల్ గా మరింత కనెక్ట్ అయ్యేలా ఉంటే బాగుండు. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ పార్ట్ లో కొన్ని సాగదీసిన సీన్స్ కట్ చేయొచ్చు. జేమ్స్ కామెరాన్ విజువల్స్, టేకింగ్ పరంగా అద్భుతంగా చూపించినా కథ, కథాంశం పార్ట్ 2 లో తీసింది మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి తీసాడు అనిపిస్తుంది.

మొత్తంగా అవతార్ 3 ఫైర్ అండ్ ఆష్ సినిమా విజువల్స్ కోసం, వింతగా కొత్తగా ఉంటుంది పిల్లలను తీసుకెళ్లి చూపించాలి అనుకుంటే చూడొచ్చు. ఈ సినిమాకు ఫైర్ అండ్ ఆష్ కాకుండా మళ్ళీ పార్ట్ 2 టైటిల్ ది వే ఆఫ్ వాటర్ అని పెడితేనే బాగుంటుందేమో.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.