Lambasingi Review : లంబసింగి మూవీ రివ్యూ.. పోలీస్ కానిస్టేబుల్‌కి, లేడీ నక్సలైట్‌కి మధ్య ప్రేమ కథ..

బిగ్‌బాస్ ఫేమ్ 'దివి' నటించిన 'లంబసింగి' ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా రివ్యూ ఏంటి..?

Lambasingi Review

Lambasingi Review : బిగ్‌బాస్ భామ ‘దివి’ నటించిన కొత్త సినిమా ‘లంబసింగి’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. భారత్ రాజు హీరోగా నటించిన ఈ సినిమాని నవీన్ గండి డైరెక్ట్ చేసారు. ధృవన్ సంగీతం అందించారు. ట్రైలర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు థియేటర్స్ లోకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. వీరబాబు(జై భారత్ రాజు)కి లంబసింగిలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో అక్కడికి వస్తాడు. లంబసింగిలో దిగిన వెంటనే అక్కడ మార్కెట్లో హరిత(దివి)ను చూసి ప్రేమలో పడతాడు. లంబసింగి చుట్టుపక్కల అడవుల్లో నక్సలైట్స్ ఎక్కువగా ఉంటారు. అందులో చాలామంది లొంగిపోయామని వస్తారు. అక్కడ ఎస్పీ పోలీస్ ఆఫీసర్ వీళ్లందరితో మాట్లాడి జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చేస్తాడు. అయితే వీరందరినీ ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టాలని చెప్తాడు. ఈ లొంగిపోయిన నక్సలైట్స్ లో హరిత తండ్రి, నక్సలైట్ దళం లీడర్ కోనప్ప కూడా ఉంటాడు. కోనప్ప కాలికి గాయమైంది అని చెప్పి రాలేను అనడంతో అతని దగ్గర సంతకం తీసుకోవడానికి రోజూ వీరబాబు వెళ్తాడు.

అక్కడే హరిత కోనప్ప కూతురు అని తెలుసుకొని ఆమెకు దగ్గరవడానికి ప్రయత్నిస్తాడు. హరిత అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తూ, చుట్టుపక్కల కూడా పేదవారికి సేవలందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో హరితకు వీరబాబు ప్రపోజ్ చేసినా నో చెప్తుంది. ఒక పేషెంట్ ని బతికించడంలో అర్ధరాత్రి పూట వీరబాబు హరితకు సహాయం చేస్తాడు, కానీ ఎమ్మెల్యే వల్ల ఆ పేషంట్ చనిపోతాడు. ఈ సంఘటనతో వీరబాబు మంచివాడని హరితకు ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఒక భూమి పూజకు వస్తే ల్యాండ్ మైండ్ పేలి చనిపోతాడు. దీంతో ఇది కోనప్ప, అతని దళం సభ్యులు చేశారని ఎంక్వయిరీలో తేలుతుంది. అదే రోజు రాత్రి లంబసింగి పోలీస్ స్టేషన్ కి వీరబాబు నైట్ డ్యూటీ లో ఉండగా కొంతమంది నక్సలైట్స్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి వీరబాబుని గాయపరిచి, అక్కడ ఉన్న ఆయుధాల్ని ఎత్తుకెళ్తారు.

Also read : Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కోసం వైజాగ్‌కి చరణ్.. ఫ్యాన్స్‌ని చూసి షాక్ అయిన ఎస్‌జె సూర్య..

అప్పుడే ఆ దళం సభ్యుల్లో హరితను కూడా చూసి వీరబాబు షాక్ అవుతాడు. అలా ఇంటర్వెల్ కి ఒక మంచి ట్విస్ట్ తో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తితో సెకండ్ హాఫ్ కి లీడ్ ఇస్తారు. అసలు హరిత నక్సలైట్స్ లోకి ఎందుకు వెళ్ళింది? హరిత నక్సలైట్ అని తెలిసిన తర్వాత వీరబాబు ఏం చేశాడు? మళ్లీ హరితను కలిసాడా? హారితకు తన ప్రేమ గురించి మళ్లీ చెప్పాడా? Sp పోలీస్ ఆఫీసర్ నక్సలైట్స్ ని పట్టుకున్నాడా? హరిత వీరబాబు ప్రేమని ఒప్పుకుంటుందా? నక్సలైట్స్ కి హరిత ఓ పోలీస్ కానిస్టేబుల్ తో తిరుగుతుందని తెలిసి ఏం చేశారు? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఇది ఒక మామూలు ప్రేమ కథ అయినా ఒక లేడీ నక్సలైట్ కి, ఒక పోలీస్ కానిస్టేబుల్ కి మధ్య పెట్టడం విశేషం. ఓ పక్క లంబసింగి అందాలను చూపిస్తూనే, మరోపక్క ప్రేమ కథను నడిపిస్తారు. ఇంకోపక్క నక్సలైట్ కథను కూడా నడిపిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా వీరబాబు హరిత వెనకాల పడటం, హరిత గురించి తెలుసుకోవడం, మరో పోలీస్ కానిస్టేబుల్ తో కొన్ని కామెడీ సీన్లు, ఆ తర్వాత ఎమ్మెల్యే చనిపోవడం.. వంటి సీన్స్ తో సాగుతుంది.

ఇంటర్వెల్ కి ముందు హరిత కూడా నక్సలైట్ అని చెప్పి ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తారు. దీంతో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తాము. ఇక సెకండ్ హాఫ్ లో కొంచెం లవ్ స్టోరీ తో పాటు నక్సలైట్స్ పోలీసు మధ్యలో కాల్పుల సీన్లు, చివర్లో ఎవరూ ఊహించని మరో ట్విస్ట్, ఓ ఎమోషన్ తో సినిమా ముగుస్తుంది.

నటీనటులు.. వీరబాబుగా పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో భరత్ రాజ్ మెప్పిస్తాడు. బిగ్ బాస్ తో సేమ్ తెచ్చుకున్న దివి ఇన్నాళ్లు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో అలరించింది. ఓ పక్క అచ్చు పల్లెటూరి అమ్మాయిలా నటించి మరోపక్క నక్సలైట్ గా కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. కోనప్ప, పోలీస్ ఆఫీసర్, మరో పోలీస్ కానిస్టేబుల్, రాజుగారు, రాజుగారి భార్య పాత్రల్లో నటించిన నటీనటులు కూడా ఫర్వాలేదనిపిస్తారు.

సినిమా విశ్లేషణ.. ముఖ్యంగా లంబసింగి సినిమాకు చెప్పుకోవాల్సింది కెమెరా విజువల్స్, సంగీతం. ఈ సినిమాలోని పాటలు గతంలో 1990, 2000 సంవత్సరాల్లో వచ్చిన సినిమాల్లో ఉండే సాంగ్స్ లా అనిపిస్తాయి. ప్రేమ కథకు అలాగే నక్సలైట్ కథకు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. లంబసింగి అందాలను ప్రతి ఫ్రేమ్ లోను చక్కగా చూపించారు. సినిమా అంతా లంబసింగి ఆ పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేశారు. లంబసింగి చూడని వారు కూడా ఆ ప్రదేశం ప్రకృతితో ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా కెమెరా విజువల్స్ ఉంటాయి.

కథ కథనంలో మొదట ఒక అరగంటసేపు కాస్త బోర్ అనిపించినా ఆ తర్వాత నుంచి ఆసక్తిగా సాగేలా రాసుకున్నారు. దర్శకుడిగా నవీన్ గాంధీ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి బంగారు రాజు, సోగ్గాడే చిన్నినాయన లాంటి హిట్ సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా మారారు. ఆల్రెడీ డైరెక్టర్ గా సక్సెస్ అయిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి నిర్మాణ విలువల్లో ఎక్కడ తగ్గకుండా క్వాలిటీ మెయింటైన్ చేసి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

మొత్తంగా లంబసింగి సినిమా ఓ పోలీస్ కానిస్టేబుల్, లేడీ నక్సలైట్ మధ్య జరిగే ప్రేమ కథ. సరదాగా సాగుతూనే ట్విస్టులు ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.