Atti Satyanarayana : థియేటర్ల బందుకు తెరలేపింది దిల్ రాజు, సురేష్ బాబులే.. పవన్ నిర్ణయం బాధ కలిగించింది.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు..

నేడు అత్తి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు..

Janasena Leader Exhibitor Atti Satyanarayana Sensational Comments on Dil Raju and Suresh Babu

Atti Satyanarayana : గత కొన్ని రోజులుగా నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య పర్శంటేజ్ విధానం థియేటర్స్ సమస్య నడుస్తుంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ బంద్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పై, థియేటర్స్ పై సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చేసింది ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత, రాజమండ్రి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ అని ఇండైరెక్ట్ గా ఆరోపించారు. ఈ ఘటనలో ఆయన పేరు బాగా వినపడటంతో జనసేన పార్టీ అతన్ని పదవి నుంచి తప్పించి సస్పెండ్ చేసింది.

దీంతో నేడు అత్తి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.. నాపై దిల్ రాజు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. థియేటర్ల బంద్ విషయంలో మంత్రి దుర్గేష్ గారితో మాట్లాడాను. బందుకు తెరలేపింది దిల్ రాజు, సురేష్ బాబులే. కొత్తవారిని ఎవరిని వీళ్ళు బతకనివ్వరు. దిల్ రాజు దురుద్దేశంతో మాట్లాడారు. దిల్ రాజు అతని తమ్ముడు శిరీష్ ను కాపాడుకునేందుకు నామీద అభియోగం మోపారు. మా సమావేశంలో బంద్ అనే ప్రసక్తే ఎత్తలేదు. ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి అనే విషయం మాత్రమే చర్చించుకున్నాము. మునుగడ సాగించలేక థియేటర్లు మూతపడుతున్నాయి. మాతోపాటు గీత ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ వారికి కూడా తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్లు ఉన్నాయి.

East Godavari Exhibitors : జనసేన నేత సస్పెండ్.. ఆయన తప్పేం లేదు.. మా సపోర్ట్ ఆయనకే అంటున్న ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు..

మేము సమావేశం పెట్టుకునే నాటికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. సురేష్ బాబు, దిల్ రాజు ఒత్తిడి చేసి హరిప్రసాద్ చేత లేఖ ఇప్పించారు. దిల్ రాజు ప్రమేయాన్ని అడుగడుగునా సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. ఆయన కుట్రపూరితంగా చేసి నా మీద, నా పార్టీ మీద బురద జల్లాలని చూస్తున్నారు. దిల్ రాజు నటనలో కమలహాసన్ ను మించిపోయారు. ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో థియేటర్ల అద్దెలు తక్కువగా ఉంటాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ సినిమా ఆపే ప్రసక్తే లేదు. నా దేవుడు సినిమా నేను ఎందుకు ఆపుకుంటాను. నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. మాలాంటి వారిని అడ్డం పెట్టుకొని దిల్ రాజు నైజాం నవాబుగా ఏలుదాం అనుకుంటున్నాడు. దిల్ రాజు ప్రెస్ మీట్ లో సురేష్ బాబు, సునీల్ ఎందుకు లేరు? రాంప్రసాద్ మీద ఒత్తిడి చేసి ఫిలిం ఛాంబర్ లో లేఖ పెట్టించింది మీరు కాదా? మూడు సెక్టార్లలో జూన్ 1 నుంచి బందు అని ప్రకటించింది శిరీష్ రెడ్డి కాదా? ఇండస్ట్రీలో సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు వీరు ముగ్గురు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో నన్ను టార్గెట్ చేసి మీరు దుస్సాహసానికి దిగారు. తప్పు చేసిన వారిని ఎవరిని పవన్ కళ్యాణ్ విడిచిపెట్టరు. ఆ నలుగురు అంటే దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్.

Also Read : Movie Theaters Issue : హీరోలు అందరూ ఆ పని చేసి మమ్మల్ని బతికించండి.. చేతులెత్తి దండం పెడుతున్నాం.. ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు..

జనసేన పార్టీ పెట్టినప్పుడు నుంచి పవన్ కళ్యాణ్ వెంటనే ఉన్నాను. వ్యాపారాలు కూడా వదులుకున్నాను. ప్రస్తుతం నిర్ణయం నాకు చాలా బాధ కలిగించింది. నా మీద చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపించండి. లేకపోతే కోర్టుకు వెళ్తాను. నా భవిష్యత్తును నాశనం చేశారు. భారతదేశంలో నీతి నిజాయితీకి పెట్టింది పేరు పవన్ కళ్యాణ్. నా ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ తోనే ఉంటాను. ఆయనకు మచ్చ తెచ్చే పనులు ఎట్టి పరిస్థితుల్లోను చేయను. జనసేన పార్టీకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. నాపై వచ్చిన ఆరోపణలు నూటికి నూరు శాతం అవాస్తవం. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకుంటాను. అని తెలిపారు. మరి అత్తి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్, సురేష్ బాబు, సునీల్ స్పందిస్తారా చూడాలి.