ఎన్టీఆర్ కొత్త అడుగులు: చిన్న సినిమాల కోసమే!

  • Publish Date - November 10, 2019 / 07:22 AM IST

హీరోలు నిర్మాతలుగా మారడం.. సినిమాలు తీయడం… బ్యానర్‌లు పెట్టడం చూస్తూనే ఉంటాం కదా? చాలావరకు అలా హీరోలు పెట్టిన బ్యానర్‌లలో వాళ్లే హీరోలుగా మారుతుంటారు. అయితే యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత.. ఇలా వరుస హిట్లతో టాప్ గేర్‌లో ఉన్న జూనియర్ ఎన్‌టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మహేశ్‌బాబు, రామ్‌చరణ్, కళ్యాణ్ రామ్, రానా, నాని, విజయ్ దేవరకొండ వంటి టాప్ హీరోలు సినిమాలను నిర్మిస్తున్నారు. ఇదే దారిలో ఎన్‌టీఆర్ కూడా నిర్మాణ సంస్థను పెట్టి సినిమాలను తీయాలని భావిస్తున్నారట. చిన్న సినిమాలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారట. కొత్త ఏడాదిలో ఈ విషయంపై సరైన స్పష్టత ఇస్తారని సమాచారం.

ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి రామకృష్ణ సినీ స్టూడియోస్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, ఎన్‌బీకే ఫిల్మ్స్ బ్యానర్లు ఉన్నాయి. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి నాలుగో నిర్మాణ సంస్థగా ఎన్టీఆర్‌ సొంత నిర్మాణ సంస్థ ప్రారంభం కాబోతుంది.  ఎన్‌టీఆర్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా 2020 జూలై నెలాఖరున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.