Site icon 10TV Telugu

Thug Life : ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ.. కమల్ హాసన్ – మణిరత్నం కాంబో మెప్పించిందా?

Kamal Haasan Mani Ratnam AR Rahman Simbu Trisha Thug Life Movie Review and Rating

Kamal Haasan Mani Ratnam AR Rahman Simbu Trisha Thug Life Movie Review and Rating

Thug Life Movie Review : కమల్ హాసన్ మెయిన్ లీడ్ లో శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘థగ్ లైఫ్’. రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. థగ్ లైఫ్ సినిమా నేడు జూన్ 5న థియేటర్స్ లో రిలీజయింది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేసారు.

కథ విషయానికొస్తే.. రంగరాయ శక్తి రాజన్(కమల్ హాసన్), మాణిక్యం(నాజర్) ఇద్దరూ ఢిల్లీలో గ్యాంగ్ స్టర్స్. ఓసారి వీళ్ళ మీద జరిగిన పోలీస్ షూట్ అవుట్ లో ఓ పేపర్ వేసే వ్యక్తి చనిపోతాడు. అతని కొడుకు అమర్, కూతురు చంద్ర ఆ గందరగోళంలో తప్పిపోతారు. అమర్ ని తీసుకొని పోలీసుల నుంచి తప్పించుకుంటాడు శక్తి. తన చెల్లి చంద్రని ఎలా అయినా వెతికి తెస్తానని అమర్ కి మాటిస్తాడు శక్తి. అమర్(శింబు) పెద్ద అయ్యేసరికి శక్తి ఢిల్లీలో పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారుతాడు. రాను అనే వ్యక్తిని చంపిన కేసులో శక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. దీంతో అంతా అమర్ చూసుకుంటాడు అని చెప్పి వెళ్తాడు.

ఇది మాణిక్యం, అతని కింద ఉండే మనుషులకు నచ్చదు. శక్తి జైలు నుంచి బయటకు వచ్చేసరికి అతని శత్రువు సదానంద్(మహేష్ మంజ్రేకర్)తో అమర్, మాణిక్యం చేతులు కలుపుతారు. శక్తి జైలు నుంచి బయటకు వచ్చాక అతని మీద అటాక్ జరగడంతో అమర్ ని అనుమానిస్తాడు. మరో పక్క రాను అన్న(అలీ ఫజల్) శక్తి, అమర్ లను చంపాలనుకుంటాడు. ఇదే మంచి టైం అని మాణిక్యం, అతని మనుషులు తన తండ్రిని చంపింది శక్తినే అని అమర్ కి అబద్దం చెప్పి అందరూ కలిసి శక్తిని చంపాలని చూస్తారు. మరి శక్తిని చంపారా? శక్తికి వీళ్ళు అందరూ కలిసి చేసేది ఎలా తెలుస్తుంది? శక్తి ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు? చంద్ర – అమర్ లను కలుపుతాడా? ఈ మధ్యలో శక్తిని పట్టుకోడానికి పోలీస్ ఆఫీసర్ జైరాం(అశోక్ సెల్వన్) ఏం చేస్తాడు? రాను అన్న రివెంజ్ తీర్చుకుంటాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Also Read : Thug Life : థ‌గ్ లైఫ్ ట్విట్ట‌ర్ రివ్యూ.. క‌మ‌ల్ హాస‌న్ హిట్ కొట్టాడా?

సినిమా విశ్లేషణ.. మణిరత్నం – కమల్ హాసన్ కాంబో అనగానే సూపర్ హిట్ నాయకుడు సినిమా గుర్తొస్తుంది. ఆ కాంబోలో మరోసారి చాలా గ్యాప్ తర్వాత సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ లోనే ఓ గ్యాంగ్ స్టార్ కి అతను పెంచిన వ్యక్తికి విబేధాలు వస్తాయి అని కథని చెప్పేసారు. ఫస్ట్ హాఫ్ అంతా డ్రామాతోనే సాగదీశారు. శక్తి, అతని చుట్టూ ఉండే పాత్రలు, అమర్ ఎదగడం, శక్తిని అందరూ కలిసి చంపడానికి ప్లాన్ వేయడం.. ఇలా బాగా సాగదీశారు. మధ్యలో శక్తి భార్యతో సీన్స్, త్రిష తో అఫైర్ సీన్స్ వస్తాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తిగా ఉంటుంది. ఇంటర్వెల్ కి శక్తి ఎలా తిరిగొస్తాడు అని ఓ ఆసక్తి అయితే నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో శక్తి పాత్ర హిమాలయాల్లో సర్వైవల్ అయ్యే సీన్స్ చాలా బాగుంటాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా శక్తి ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనే సాగుతుంది.

సినిమా అంతా ఎక్కువగా ఎమోషనల్ డ్రామా మీదే నడిపించారు. సినిమా తీసిన విధానం మణిరత్నం నాయకుడు సినిమానే గుర్తొస్తుంది. అందులో గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదుగుతాడు అయితే, ఇందులో గ్యాంగ్ స్టర్ అయ్యాక జీవితం ఎలా ఉంటుంది అని థగ్ లైఫ్ టైటిల్ కి తగ్గట్టు చూపించే ప్రయత్నం చేసారు. త్రిష ఇంద్రాణి పాత్ర, ఇంద్రాణితో ఓ పక్క శక్తి అఫైర్ మరో పక్క అమర్ కూడా ఇంద్రాణి ని కావాలనుకోవడం ఈ సీన్స్ కి సినిమా కథకి సంబంధమే లేదు. ఈ సీన్స్ కూడా చూడటానికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. మరి అవి ఎందుకు పెట్టాడో మణిరత్నంకే తెలియాలి. సినిమాలో ఒకటిరెండు ట్విస్టులు ఉన్నా ఈజీగా ఊహించేయొచ్చు. థగ్ లైఫ్ చూస్తుంటే తెలుగులో బాలు, పంజా, ప్రస్థానం లాంటి సినిమాలు గుర్తుకురావడం ఖాయం. ఫస్ట్ హాఫ్ తో నీరసించిపోయిన ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ కొంత ఊరటనిస్తోంది. త్రిష షుగర్ బేబీ అంటూ అందాలతో అలరించిన వీడియో సాంగ్ సినిమాలో ఉండదు. యాక్షన్ సీక్వెన్స్ సినిమా అనుకోని వెళ్తే ఎమోషన్ డ్రామాతో ఎక్కువ సాగదీస్తారు కాబట్టి అంచనాలు లేకుండా వెళ్లడం బెటర్.

నటీనటుల పర్ఫార్మెన్స్.. కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏజ్ లో కూడా యాక్షన్ సీక్వెన్స్ లు అదరగొడుతూ, రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించారు. శింబు కమల్ హాసన్ కి వ్యతిరేక పాత్రలో ధీటుగా నటించాడు. అభిరామి భార్య పాత్రలో సింపుల్ గృహిణిగా ఒదిగిపోయింది. త్రిష ఓ వ్యాంప్ పాత్రలో అప్పుడప్పుడు కనిపించి అలా వెళ్ళిపోతుంది. నాజర్, అలీ ఫైజల్, జాజు జార్జ్, మహేష్ మంజ్రేకర్.. పలువురు నెగిటివ్ పాత్రల్లో బాగానే నటించారు. అశోక్ సెల్వన్ పోలీస్ పాత్రలో మెప్పిస్తాడు. ఐశ్వర్య లక్ష్మి కూడా అక్కడక్కడా కనిపించి అలరిస్తుంది. తనికెళ్ళ భరణి, సంజన, వడివుక్కరాసి, భగవతి పెరుమాళ్.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Tollywood : రూటు మార్చిన టాలీవుడ్ హీరోయిన్స్ ..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా క్వాలిటీగా లొకేషన్, టైం లైన్ కి తగ్గట్టు బాగా చూపించారు. ఏ ఆర్ రహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు మాత్రం ఒక్కసారి వినడం కూడా కష్టమే. పాత బిల్డింగ్స్, కొన్ని లొకేషన్స్ కోసం చేసిన వర్క్ కి ఆర్ట్ డిపార్ట్మెంట్ ని కూడా అభినందించాల్సిందే. రొటీన్ కథని మణిరత్నం ఎక్కువగా ఎమోషనల్ డ్రామాతో సాగదీస్తూ అక్కడక్కడా యాక్షన్ మెరుపులతో తన పాత స్టైల్ లో థగ్ లైఫ్ ని చూపించారు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘థగ్ లైఫ్’ సినిమా రొటీన్ కథ, కథనంతో ఎమోషనల్ డ్రామాగా సాగిన ఓ గ్యాంగ్ స్టర్ కథ. ఏ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్తే బెటర్. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Exit mobile version