Bharateeyudu 2 : భారతీయుడు 2 రివ్యూ.. సేనాపతి తిరిగొచ్చి ఏం చేశాడు?

కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా నేడు జులై 12న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.

Kamal Haasan Shankar Bharateeyudu 2 Movie Review and Rating

Bharateeyudu 2 Movie Review : కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా నేడు జులై 12న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ తో పాటు సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ, SJ సూర్య, సముద్రఖని.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే..
చిత్ర అరవింద్(సిద్దార్థ్), అతని స్నేహితులు ఇండియాలో జరుగుతున్న దారుణాలు, అవినీతి, ఆత్మహత్యల కారణాలు.. ఇలాంటి వాటి మీద స్పూఫ్ వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసి సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటారు. రోజు రోజుకి ఇండియాలో పెరిగిపోతున్న దారుణాలు చూసి వెళ్లిపోయిన సేనాపతి(కమల్ హాసన్) మళ్ళీ తిరిగిరావాలని చిత్ర అరవింద్, అతని స్నేహితులు #comebackindian అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు. థాయిలాండ్ లో నివసిస్తున్న సేనాపతికి ఈ విషయం తెలిసి మీలో మార్పు వచ్చి పిలుస్తారని ఎదురుచూస్తున్నాను అని ఇండియాకి తిరిగొస్తాడు. ఫస్ట్ పార్ట్ లో సేనాపతిని పట్టుకోవడానికి ట్రై చేసిన CBI ఆఫీసర్ కృష్ణస్వామి కొడుకు ప్రదీప్(బాబీ సింహ) CBI ఆఫీసర్ గా సేనాపతిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. సేనాపతి ఇండియాకి తిరిగొచ్చి నా పని నేను చేస్తాను, మీ చుట్టూ తప్పులు, అవినీతి చేసేవాళ్ళని మీరు పట్టించండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారేమో చుడండి అని యువతకు సందేశం ఇస్తాడు.

మరి సేనాపతి ఇండియాకు తిరిగొచ్చి ఏం చేశాడు? చిత్ర అరవింద్ అతని స్నేహితులు సేనాపతిని కలిసారా? వాళ్ళేం చేసారు? సేనాపతి ఇండియాని బాగుచేసాడా? సేనాపతిని ఇండియన్స్ ఎందుకు చీదరించుకుంటారు? చివరికి సేనాపతి ఏమయ్యాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Ram Charan : రామ్ చరణ్ కొత్త కారు చూశారా? ఎన్ని కోట్లో తెలుసా? హైదరాబాద్‌లో ఈ కార్ ఫస్ట్ చరణ్‌కే..

విశ్లేషణ..
భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో కేవలం లంచం మీద మాత్రమే పోరాటం చేస్తాడు. కానీ ఈ సినిమాలో లంచంతో పాటు దేశంలో ఉండే సమస్యలన్నీ ప్రశ్నిస్తాడు. అయితే ఇందులో ముఖ్యంగా మీ ఇంట్లో కూడా తప్పు చేస్తారు, మీరు తప్పు చేస్తారు అనే పాయింట్ ని గట్టిగా చెప్పారు. అయితే మనదాకా వచ్చినప్పుడే మనకు తప్పు అనిపించదు ఆ పాయింట్ ని బలంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో చిత్ర అరవింద్ అతని స్నేహితులు దారుణాలపై పోరాడటం, సేనాపతిని పిలవడం, సేనాపతి కోసం ప్రదీప్ వెతుకులాట, సేనాపతి కొంతమందిని చంపడం చూపిస్తారు. ఇంటర్వెల్ అంత గొప్పగా ఏమి అనిపించదు. సెకండ్ హాఫ్ లో స్టోరీ మొత్తం రివర్స్ అయి అందరూ సేనాపతిని ఎందుకు విమర్శిస్తారు అనే విషయం మాత్రం చాలా బాగా చెప్పారు. క్లైమాక్స్ అర్దాంతరంగా ముగించేసి పార్ట్ 3 లీడ్ ఇవ్వడం గమనార్హం.

ఎమోషనల్ సీన్స్ కి స్కోప్ లేకపోయినా కావాలని చొప్పించినట్టు ఉంటుంది. ఇక కమల్ చేసే ఫైట్స్, మర్మ కల బాగా చూపించారు. అయితే సినిమా ఓవరాల్ గా చూస్తే మాత్రం భారతీయుడు పార్ట్ 1 ఉన్నంత గొప్పగా ఉండదు. కమల్ పాత్ర అయితే కథలా కాకుండా సీన్స్, సీన్స్ గా షూట్ చేసినట్టు ఉంటుంది. ఇక శంకర్ సినిమా సాంగ్స్ అంటే చాలా రిచ్ గా ఉంటాయని తెలిసిందే. ఈ సినిమాలో కూడా సాంగ్స్ విజువల్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి.

నటీనటుల విషయానికొస్తే..
కమల్ హాసన్ నటన గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 100 ఏళ్ళు పైబడిన ముసలాయన గెటప్ లో గెటప్స్ మారుస్తూ కమల్ హాసన్ మాత్రం అద్భుతంగా నటించాడు. సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, అతని స్నేహితులు సమాజంలో జరిగే దారుణాలని ప్రశ్నించే పాత్రలో సీరియస్ గానే నటించారు. సిద్దార్థ్ లవర్ పాత్రలో రకుల్ మాత్రం ఏదో ఉంది అన్నట్టు ఉంటుంది. బాబీ సింహ సేనాపతిని పెట్టుకోవాలనే పాత్రలో ఎక్కువ సేపే కనిపించి మెప్పించాడు. SJ సూర్య బిజినెస్ మెన్ గా ఓకే అనిపిస్తాడు. బ్రహ్మానందం ఒక్క సీన్ లో డైలాగ్స్ లేకుండా జస్ట్ అలా కనిపిస్తారు. ఇక సముద్రఖని ACB ఆఫీసర్ గా మెప్పిస్తారు. వివేక్, నెడుముడి వేణు షూటింగ్ సమయంలోనే చనిపోవడంతో AI తో ఆ పాత్రల్ని కొన్ని సీన్స్ లో రీ క్రియేషన్ చేసారు. చిన్న చిన్న పాత్రల్లో చాలా మంది తమిళ నటీనటులు మెప్పించారు.

Also Read : Varalaxmi Sarathkumar Wedding : ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి.. ఫోటోలు వైర‌ల్..!

సాంకేతిక అంశాలు..
డైరెక్టర్ శంకర్ సినిమాలో టెక్నికల్ అంశాల్లో వంక పెడదామన్నా దొరకదు. ఈ సినిమాలో కూడా అంతే సాంకేతికంగా సినిమా గొప్పగానే ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. మ్యూజిక్ ఈ సినిమాకి చాలా మైనస్ అవుతుంది. పాటలు యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ లో తప్ప అంతగా వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా మర్మకాలతో చేసే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోతుంది. లంచం, అవినీతిపై పోరాటం అని కథ అందరికి తెలిసినా మీ ఇంట్లో కూడా తప్పు చేస్తారు, వాళ్ళని పట్టించండి అని ఓ కొత్త పాయింట్ ని బాగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లాగే ఉంటుంది. దర్శకుడిగా శంకర్ అదరగొట్టాడు అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాణ విలువల పరంగా కూడా భారీగానే ఖర్చుపెట్టారు ఈ సినిమాకి.

మొత్తంగా భారతీయుడు 2 సినిమా డైరెక్ట్ గా సేనాపతి రంగంలోకి దిగడమే కాకుండా యువతని కూడా ప్రశ్నించమని చెప్పడంతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అని కమర్షియల్ గా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు