బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 17 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కాగా.. ఇటీవలే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కంగనా ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ కీలక పాత్రలను పోషించగా జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇక బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్పందన రాకపోయినప్పటికి ఓటీటీలో మాత్రం ఈ చిత్రం రికార్డులను సృష్టిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో.. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ సినిమాల జాబితాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపించాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కంగనా షేర్ చేస్తూ రిప్లై ఇచ్చింది. అమెరికా లాంటి దేశం ఇలాంటి సినిమాలను గుర్తించడానికి ఇష్టపడదని అంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలను వారు అణచివేస్తారని, అదే ఎమర్జన్సీలో చూపించామని చెప్పింది. వారి సిల్లీ ఆస్కార్‌ను వారి వద్దే ఉంచుకోనివ్వండి, మాకు నేషనల్ అవార్డులు ఉన్నాయని కంగనా తెలిపింది.