Ghantasala The Great
Ghantasala The Great : లెజెండరీ సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవిత చరిత్ర ఆధారంగా ‘ఘంటసాల ది గ్రేట్’ అనే సినిమాను తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణంలో సి.హెచ్. రామారావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఘటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. ఈ సినిమా నేడు జనవరి 2న థియేటర్స్ లో రిలీజయింది.(Ghantasala The Great)
ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలు, సంగీతం గురించి తెలిసినంతగా ఆయన జీవితం గురించి అందరికి తెలియదు. ఈ సినిమాలో ఆయన పాటల గొప్పదనం మాత్రమే కాకుండా ఆయన జీవితాన్ని ఆవిష్కరించారు. ఘంటసాల (అతులిత్/కృష్ణ చైతన్య) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. గొప్ప సంగీత విద్వాంసుడు కావాలి అని తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టేందుకు ఘంటసాల విజయనగరంలోని సంగీత పాఠశాలలో చేరాలని అనుకుంటాడు. కానీ అక్కడ అతనికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. చివరకు పట్రాయని సీతారామశాస్త్రి వద్ద శిష్యుడిగా చేరతాడు. పొట్టకూటి కోసం ఘంటసాల వీధుల్లో భిక్షాటన చేస్తుండేవాడు.
చివరకు సంగీత కళాశాలలో చేరడం, గురువు వద్ద శిక్షణను అభ్యసించడంతో తిరిగి తన సొంత గ్రామానికి వెళ్తాడు. ఆ సమయంలోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్తాడు. ఆ తరువాత తనకు వరసైన పార్వతమ్మ (మృదుల)ని ఘంటసాల వివాహాం చేసుకుంటాడు. ఆపై సముద్రాల రాఘవాచారి (జె.కె. భారవి) ప్రోద్బలంతో మద్రాసుకి వెళ్తాడు. ఇక మద్రాసుకి వెళ్లిన తరువాత ఘంటసాలకు సినీ పరిశ్రమలో ఎదురైన అనుభవాలు ఏంటి? గొప్ప గాయకుడిగా, సంగీత విద్వాంసుడిగా ఎలా ఎదిగాడు? ఘంటసాల చివరి దశలో ఆయనకు వచ్చిన కష్టం ఏంటి? ఆయన తీరని చివరి కోరిక ఏంటి.. అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Nilakanta Review : ‘నీలకంఠ’ మూవీ రివ్యూ.. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ యాక్షన్ డ్రామా..
ఈ జనరేషన్ కి, కాస్త ముందు జనరేషన్ కి ఘంటసాల అంటే పాటల రూపంలోనే తెలుసు. అలాంటి ఓ గొప్ప సంగీత దర్శకుడి జీవితాన్ని ఈ జనరేషన్ లో అందరికి తెలియడానికి ఈ ఘటసాల చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఎప్పుడో తెరకెక్కించినా పలుమార్లు వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజ్ అయింది.
ఫస్ట్ హాఫ్ అంతా ఘంటసాల పడిన కష్టాలు, పొట్టకూటి కోసం పడిన బాధలు, సంగీతాన్ని నేర్చుకునే క్రమంలో ఎదుర్కొన్న అవమానాలతో సాగుతుంది. ఘంటసాలను వెంటాడే ఓ పీడకలతో ఇంటర్వెల్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి అయితే నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఘంటసాల సక్సెస్ అవడం, ఆయన వైభోగం, ఎలా ఎదిగారు, ఆయన సాధించిన విజయాలతో వేగంగానే నడుస్తుంది కథ. ఆయనతో పాడాలని, ఆయన్ని పొగడాలని వేరే సింగర్స్ తహతహలాడటం లాంటి సీన్స్ బాగుంటాయి.
అయితే క్లైమాక్స్ లో మాత్రం ఆయన గాత్రం మూగబోవడం, చివరి కోరిక తీరకుండానే స్వర్గస్తులు అవ్వడం.. లాంటి సీన్లతో కంటతడి పెట్టిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా బాధలతో నిదానంగా కాస్త సాగదీస్తే సెకండ్ హాఫ్ మాత్రం చక్కగా కథ నడుస్తుంది. మహానటి లాగా కమర్షియల్ హంగులు పోకుండా ఘంటసాల జీవితాన్ని కొంతవరకు చూపించే ప్రయత్నం చేసారు.
ఆయన్ని, ఆయన పాటలను అభిమానించేవాళ్ళు, బయోపిక్ లను, అప్పటి కాలం కథలను ఇష్టపడే వాళ్ళు ఘంటసాల సినిమా చూడొచ్చు. అయితే ఈ సినిమాకు కాస్త ప్రమోషన్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్తే ఎక్కువ రీచ్ అవుతుంది. ప్రమోషన్స్ చేస్తే పాటల మీద అభిమానం ఉన్న ఇప్పటి జనరేషన్ కూడా ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. ఈ రోజుల్లో ప్రమోషన్స్ ఎక్కువగా చేయకపోతే జనాలకు దగ్గరవడం కష్టమే.
సింగర్ కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో జీవించాడు అని చెప్పొచ్చు. తన సంగీత గాత్రంతో మెప్పిస్తునే నటనలో కూడా అలరించాడు. ఎమోషన్ సీన్స్ లో కూడా చక్కగా నటించాడు. చైల్డ్ ఘంటసాల పాత్రలో అతులిత్ చక్కగా నటించాడు. ఘంటసాల సతీమణి పార్వతమ్మ పాత్రలో మృదుల గ్రామీణ యువతిగా చక్కగా ఒదిగిపోయింది. సుమన్, సుబ్బరాయ శర్మ, జె.కె. భారవి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Sahakutumbaanaam : ‘సఃకుటుంబానాం’ మూవీ రివ్యూ.. కొత్తరకం ఫ్యామిలీ స్టోరీ..
సంగీత విద్వాంసుడి కథ చెప్పాలంటే సినిమాకు సంగీతం, పాటలు చాలా ముఖ్యం. ఇందుకోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అప్పటి కాలానికి తగ్గట్టు బాగా ఇచ్చారు. ఇక పాటలు అయితే అప్పట్లో ఘంటసాల పాడిన పాటలే వినిపిస్తూ మెప్పించారు. సంగీతం, పాటలు ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల మాత్రం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అప్పటి కాలానికి తగ్గట్టు లొకేషన్స్, వస్తువులు చూపించడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకాస్త కష్టపడాల్సింది. ఎడిటింగ్ కూడా బాగుంది. దర్శకుడు ఘంటసాల జీవితంలోని కష్టాలు, కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని పాటల సినిమాగా తెరకెక్కించారు. సాంకేతికంగా మాత్రం ఇంకాస్త క్వాలిటీ మెయింటైన్ చేయాల్సింది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఘంటసాల’ సినిమా ఆ లెజెండరీ సంగీత విద్వాంసుడి జీవిత కథని ఒక పాటల సినిమాగా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.