Nilakanta Review : ‘నీలకంఠ’ మూవీ రివ్యూ.. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ యాక్షన్ డ్రామా..

'నీలకంఠ' సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కబడ్డీ ఆట నేపథ్యంలో వచ్చిన యాక్షన్ డ్రామా. (Nilakanta Review)

Nilakanta Review : ‘నీలకంఠ’ మూవీ రివ్యూ.. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ యాక్షన్ డ్రామా..

Nilakanta Review

Updated On : January 2, 2026 / 12:51 PM IST

Nilakanta Review : మాస్టర్ మహేంద్రన్, యష్ణ ముత్తులూరి, నేహా పఠాన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా నీలకంఠ. LS ప్రొడక్షన్స్ బ్యానర్ పై మర్లపల్లి శ్రీనివాసులు,దివి వేణుగోపాల్ నిర్మాణంలో రాకేష్ మాధవన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. స్నేహా ఉల్లాల్, రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను,సత్య ప్రకాష్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. నీలకంఠ సినిమా నేడు జనవరి 2న థియేటర్స్ లో రిలీజ్ అయింది.(Nilakanta Review)

కథ విషయానికొస్తే..

సరస్వతిపురం గ్రామంలో తప్పు చేస్తే ఆ గ్రామ పెద్ద రాఘవయ్యా( రాంకీ) కఠిన శిక్షలు విధిస్తాడు. అదే ఊళ్ళో టైలర్ నాగ భూషణం (కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ( మాస్టర్ మహేంద్రన్) బాగా చదువుతాడు కానీ 10th క్లాస్ లో చేసిన ఓ తప్పుకి నీలకంఠ 15 ఏళ్ళు ఊరు దాటకూడదు అని, చదువు కూడా చదవకూడదు అని శిక్ష వేస్తారు. నీలకంఠ 10th క్లాస్ లోనే ఆ ఊరు సర్పంచ్(పృథ్వీ)కూతురు సీత(యష్ణ ముతులూరి)ని ఇష్టపడతాడు.

కానీ 10th తర్వాత సీత పై చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళిపోతుంది. చదువుకి దూరం అయిన నీలకంఠ కబడ్డీ ఆటలో ఆ ఊరిలోనే తోపుగా నిలబడతాడు. కానీ అతనికి ఉన్న శిక్ష కారణంగా ఊరు దాటి వెళ్లలేక మండల స్థాయి కబడ్డీ ఆటల్లో పాల్గనలేకపోతాడు. నీలకంఠ లేని సరస్వతి గ్రామ కబడ్డీ టీమ్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ఓడిపోతూనే ఉంటుంది. మరి నీలకంఠ ఊరు దాటాడా? కబడ్డీ పోటీల్లో గెలిచాడా? 15 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది? సీత మళ్ళీ ఆ ఊరికి తిరిగి వచ్చిందా? నీలకంఠ ప్రేమకథ ఏమైంది? అసలు నీలకంఠ ఏం తప్పు చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Psych Siddhartha Review : ‘సైక్ సిద్దార్థ’ రివ్యూ.. దరిద్రం అంతా వీడి లైఫ్ లోనే ఉందిగా..

సినిమా విశ్లేషణ..

చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మెయిన్ ప్లాట్ చూస్తే గతంలో కబడ్డీ కబడ్డీ, పందెం.. లాంటి చాలా సినిమాలు ఇదే కథతో వచ్చాయి. అయితే చాలా సినిమాల్లో తప్పు చేస్తే ఊరు నుంచి వెలివేయడం చూసాం కానీ ఇందులో ఊరు నుంచి బయటికి పోకుండా చేయడం అనేది కొత్తగా ఉంటుంది.

సినిమా మొదలయిన పది నిమిషాలకే అసలు కథలోకి తీసుకెళ్లడంతో ఆసక్తి నెలకొంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో కథతోనే ఎక్కువగా సాగుతుంది. హీరో, అతని లవ్ సీన్స్, అతనికి పడే శిక్షతో సాగుతుంది. ఇంటర్వెల్ కి కాస్త ఇంట్రెస్టింగ్ సీన్ తోనే బ్రేక్ ఇస్తారు. సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ సీన్స్, కబడ్డీ ఆటని చూపిస్తారు. అంతే కాకుండా కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉంటుంది. కబడ్డీ ఆట సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

చివరి అరగంట సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ముందు నుంచి చెప్పిన పాయింట్స్ కి క్లైమాక్స్ లో మంచి ముగింపు ఇచ్చారు. ఇక సినిమాని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేసారు. కథలో ఐటెం సాంగ్ కాస్త అడ్డంకి అనిపిస్తుంది. ఈ ఐటెం సాంగ్ కోసం ఒకప్పటి హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ని తీసుకురావడం గమనార్హం. కథ పాతది అయినా ఓ కొత్త పాయింట్ ని జత చేసి విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కికించారు.

Nilakanta Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న మాస్టర్ మహేంద్రన్ హీరోగా కూడా బాగానే మెప్పించాడు. కబడ్డీ, యాక్షన్ సీన్స్ లో మాస్ హీరోగా బాగానే కష్టపడ్డాడు. యష్ణ ముత్తులూరి గ్రామీణ యువతి పాత్రలో సహజంగా నటించింది. ఒకప్పటి హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఇందులో ఐటెం సాంగ్ తో రీ ఎంట్రీ ఇచ్చి తన డాన్స్ తో మెప్పించింది. సీనియర్ నటులు రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also See : Dil Raju : భార్య, కొడుకుతో కలిసి దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. దుబాయ్ లో వెకేషన్.. ఫొటోలు..

సాంకేతిక అంశాలు.. విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మెలోడీ సాంగ్ బాగున్నా మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. కబడ్డీ గేమ్ కంపోజింగ్ బాగా చేసారు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కావడంతో ఎడిటింగ్ కూడా బాగా చేసారు. యాక్షన్ సీక్వెన్స్ లు కొత్తగా డిజైన్ చేసారు. పాత కథనే తీసుకున్నా కొత్త పాయింట్ తో కొత్తగా చూపించాడు దర్శకుడు. కొన్ని డైలాగ్స్ కూడా బాగా రాశారు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘నీలకంఠ’ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కబడ్డీ ఆట నేపథ్యంలో వచ్చిన యాక్షన్ డ్రామా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.