Maharashtra Politicians Fires on Rashmika Mandanna Vicky Kaushal Chhaava Movie Dance Seen Director Reacts
Rashmika Mandanna : రష్మిక మందన్న ఇటీవలే పుష్ప 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది. ఫిబ్రవరి 14న రష్మిక తన నెక్స్ట్ సినిమా చావా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్కీ కౌశల్, రష్మిక మెయిన్ లీడ్స్ లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా చావా సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
శివాజీ తర్వాత శంభాజీ మరాఠా రాజ్యాన్ని ఎలా కాపాడాడు, ఎలా పాలించాడు, మొఘలులకు వ్యతిరేకంగా పోరాడి సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాడు, ఎలా వీరమరణం పొందాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో శంభాజీ కలిసి లెజిమ్ డ్యాన్స్ వేసినట్టు చూపించారు. విక్కీ కౌశల్, రష్మిక ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేశారు. ట్రైలర్ లోనే ఈ షాట్ చూపెట్టారు. దీంతో ఈ డ్యాన్స్ పై విమర్శలు వస్తున్నాయి.
శివాజీ అభిమానులు, మహారాష్ట్ర నాయకులు సినిమాలోని సాంగ్ పై విమర్శలు చేసారు. మహరాష్ట్ర మంత్రి ఉదయ్ సావంత్ అయితే.. శంభాజీ లాంటి గొప్ప యోధుడి కథ చెప్పడం మంచిదే కానీ ఇలాంటి డ్యాన్సులతో చూపించడం కరెక్ట్ కాదు. ఇలాంటి సినిమాలు తీస్తే ముందు చరిత్రకారులు చూపించి ఆ తర్వాత తీయాలి. ఆ డ్యాన్స్ సినిమాలోంచి తీయకపోతే సినిమా రిలీజ్ ని అడ్డుకుంటాం అని అన్నారు. ఇలా పలువురు మహారాష్ట్ర నాయకులు చావా సినిమాలోని డ్యాన్స్ పై విమర్శలు చేయడంతో దర్శకుడు స్పందించాడు.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ విమర్శలతో బాల్ ఠాక్రే కుటుంబానికి చెందిన రాజ్ ఠాక్రేని కలిశారు. ఆయనతో సినిమా గురించి చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ మీడియాతో మాట్లాడుతూ.. నేను రాజ్ ఠాక్రే గారిని కలిసాను. సినిమా గురించి కొన్ని సలహాలు ఆయన దగ్గర్నుంచి తీసుకున్నాను. ఆయన ఇచ్చిన సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన్ను కలిసిన తర్వాత చావా సినిమాలో లెజిమ్ డ్యాన్స్ సన్నివేశాలను తీసేయాలని నిర్ణయం తీసుకున్నాను. నాకు ఆ డ్యాన్స్ ముఖ్యం కాదు. శంభాజీ లాంటి వీరుని కథ చెప్పడం ముఖ్యం. అందుకే ఆ సీన్ తీసేసి సినిమా రిలీజ్ చేస్తాను అని తెలిపారు.