Guntur Kaaram : ‘గుంటూరు కారం’ రివ్యూ.. పండక్కి ఘాటు ఎక్కించి.. ఎమోషన్‌తో కన్నీళ్లు తెప్పించిన బాబు..

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ హైపెడ్ మూవీ 'గుంటూరు కారం' థియేటర్స్ లోకి వచ్చేసింది. సినిమా ఎలా ఉంది..?

Mahesh Babu Trivikram Srinivas Guntur Kaaram Movie Review full report

Guntur Kaaram : అతడు, ఖలేజా సినిమాల తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో మహేష్ ఇప్పటివరకు కనిపించినంత మాస్ రోల్‌ చేస్తుండడంతో అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు.

కథ విషయానికొస్తే.. కొన్నేళ్ల క్రితం గుంటూరులో సత్యం(జయరాం) మిర్చి గోడౌన్ మార్క్స్(జగపతి బాబు) తగలపెట్టేస్తాడు. అనుకోకుండా మార్క్స్ తమ్ముడిని చంపడంతో సత్యం జైలుకెళ్లడం, ఆ గోడౌన్ తగలబెట్టినప్పుడు ఓ నిప్పురవ్వ రమణ(మహేష్ బాబు) కంట్లో పడి ఎడమ కన్ను కొద్దిగా కనిపించకపోవడం, దీంతో వసుంధర(రమ్యకృష్ణ) భర్త, బాబుని వదిలేసి తండ్రి వెంకటస్వామి(ప్రకాష్ రాజ్) దగ్గరికి వెళ్లి ఇంకో పెళ్లి చేసుకొని పెద్ద రాజకీయనాయకురాలిగా ఎదుగుతుంది.

అక్కడ నుంచి కథ ప్రస్తుతానికి తీసుకొస్తే.. రమణ గుంటూరులో తనకున్న మిర్చి బిజినెస్ చూసుకుంటాడు. ఒకసారి తన తాత వెంకటస్వామి రమణని పిలిచి తన తల్లికి, తనకి సంబంధం లేదని, వారసత్వం లేదని సంతకాలు పెట్టమంటాడు. చిన్నప్పట్నుంచి దూరమైన తన తల్లిని చూస్తే సంతకం పెడతాను అని గొడవ పెట్టుకుంటాడు. వసుంధర రమణని కలవదు. వెంకటస్వామి ప్రత్యర్థుల నుంచి తన రాజకీయాన్ని కాపాడుకోవడానికి రమణతో ఎలాగైనా సంతకం పెట్టించాలని తన లాయర్ పాణి(మురళి శర్మ)కి చెప్తాడు. దీంతో తాను ఎన్ని విధాలుగా ట్రై చేసినా అవ్వకపోవడంతో తన కూతురు అముద(శ్రీలీల)కి ఆ పని అప్పచెప్తాడు. దీంతో అముద గుంటూరులో ఉన్న రమణ దగ్గరికి సంతకం పెట్టించడానికి తన తండ్రి అసిస్టెంట్ బాలు(వెన్నెల కిషోర్)తో కలిసి వస్తుంది. అముద రమణతో సంతకం పెట్టించిందా? రమణ తన తల్లిని చూశాడా? వసుంధర ఎందుకు కొడుకు, భర్తలని వదిలి వెళ్ళిపోయింది? వెంకటస్వామి రాజకీయ భవిష్యత్తు ఏమైంది? చివరకు తల్లి కొడుకులు కలిశారా? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. త్రివిక్రమ్ సినిమాలంటే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా చూపిస్తూనే హీరోకి తగ్గ మాస్, ఎలివేషన్స్ కూడా ఇస్తాడు. గుంటూరు కారం సినిమాలో కూడా తనకి బాగా కలిసొచ్చిన అదే ఫార్ములాని నమ్ముకున్నాడు గురూజీ. ఫస్ట్ హాఫ్ అంతా రమణ గురించి, రమణ సంతకం కోసం వెంకటస్వామి చేసే పనులు, శ్రీలీల, బాలు కలిసి గుంటూరు వెళ్లి రమణ సంతకం కోసం ట్రై చేయడం, అక్కడక్కడా కామెడీతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో శ్రీలీలతో స్పెషల్ డ్యాన్స్ ఎపిసోడ్ కూడా సెట్ చేసి అదరగొట్టారు. దానికి మహేష్ తోడయి అభిమానుల్ని ఎంటర్టైన్ చేశాడు.

ఇక ఇంటర్వెల్ ముందు చాలా ఏళ్ళ తర్వాత మొదటి సారి అమ్మని చూడటం, అమ్మ తనని కొట్టడంతో రమణ బాధపడే ఎమోషనల్ సీన్ తో తర్వాత ఏం జరుగుతుంది అని సెకండ్ హాఫ్ లో హై ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో తన తల్లికి యాక్సిండెంట్ చేయించడంతో అక్కడనుంచి రమణ తల్లి కోసం చేసే ప్రయత్నాలు, చివర్లో ఒక్కొక్కొటి ఊహించని ట్విస్టులు రివీల్ చేయడం, తల్లికొడుకుల ఎమోషన్ తో ప్రేక్షకుల మనసుకి హత్తుకుంటుంది.

మహేష్ ఈ సినిమాలో బీడీ కాల్చే స్టైల్ అదిరిపోతుంది. మహేష్ స్టైల్, స్వాగ్ అదిరిపోతుంది. కొన్ని సీన్స్ లో రజినీకాంత్ సిగరెట్ తాగే స్టైల్ గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ లో స్పెషల్ డ్యాన్స్ ఎపిసోడ్, అక్కడ కామెడీ ప్రేక్షకులకి నచ్చేస్తుంది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ, శ్రీలీల డ్యాన్స్ తో, తల్లి సెంటిమెంట్ తో నవ్విస్తూనే ప్రేక్షకులని ఎమోషనల్ గా మెప్పిస్తుంది గుంటూరు కారం.

నటీనటుల విషయానికొస్తే.. మహేష్ బాబు ఖలేజా సినిమాలోని యాక్టింగ్, టైమింగ్, డైలాగ్ డెలివరీ అంటే అందరికి చాలా ఇష్టం. ఆ రేంజ్ లో మళ్ళీ అదే టైమింగ్, డైలాగ్ డెలివరీతో పాటు గుంటూరు యాసలో మాట్లాడి అదరగొట్టాడు మహేష్. ఇక మాస్, యాక్షన్ సీన్స్ లో స్టైలిష్ గా కనిపించాడు. డ్యాన్సుల్లో అయితే గత సినిమాల కంటే రెచ్చిపోయి మరీ శ్రీలీలకు పోటీగా వేశాడు. ఫస్ట్ హాఫ్ లో డ్యాన్స్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్స్ లో బాబు డ్యాన్స్ అదరగొట్టేస్తాడు.

Also read : Hanuman Review : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..

ఇక శ్రీలీల ఎప్పటిలాగే తన అందంతో, క్యూట్ మాటలతో పాటు డ్యాన్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తుంది. మహేష్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ మొదట్లో విలన్ గా అనిపించినా చివర్లో ఎమోషన్ తో మెప్పిస్తుంది. మహేష్ ని చిన్నప్పటి నుంచి పెంచిన అత్త పాత్రలో ఈశ్వరరావు కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది. తండ్రి పాత్రలో జయరాం, తాత పాత్రలో ప్రకాష్ రాజ్, వసుంధర రెండో భర్త పాత్రలో రావు రమేష్, రెండో కొడుకు పాత్రలో అమాయకుడిగా రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలతో మెప్పిస్తారు. మీనాక్షి చౌదరి మహేష్ కి మరదలిగా నటించినా స్క్రీన్ మీద ఎక్కువ సేపు కనపడే స్కోప్ రాలేదు. వెన్నెల కిషోర్ తన కామెడీతో నవ్విస్తాడు. అజయ్ ఘోష్, సునీల్, జగపతి బాబు, మురళి శర్మ.. తమ పాత్రల్లో అలరించారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ లో పూర్ణ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి కవ్విస్తుంది.

సాంకేతిక అంశాలు.. ముందుగా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. యాక్షన్, ఎలివేషన్ సీన్స్ తో పాటు, ఎమోషనల్ సీన్స్ లో కూడా తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి మెప్పించాడు. పాటలు వినడానికి బాగుంటాయి. ఇక సినిమాటోగ్రఫీ విలువలు కూడా పెద్ద బడ్జెట్ సినిమా కావడంతో దానికి తగ్గట్టు బాగుంటాయి. ప్రతి ఫ్రేమ్ లో అందర్నీ అందంగా చూపించారు. ఎలివేషన్, ఫైట్ సీన్స్ లో మహేష్ షాట్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. గుంటూరు మిర్చి గోడౌన్స్ సెట్స్ నిజంగానే మిర్చి గోడౌన్స్ అనిపించేలా అద్భుతంగా వేశాడు. కథ, కథనం, డైలాగ్స్ పరంగా త్రివిక్రమ్ గురించి మనకి తెలిసిందే. ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషన్ కథని తీసుకొని తన మాటలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి ప్రేక్షకుల హృదయాన్ని తాకుతాడు. త్రివిక్రమ్ ఆల్రెడీ స్టార్ డైరెక్టర్, ఆయన దర్శకత్వం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

మొత్తంగా మహేష్ బాబు తన స్టైల్ స్వాగ్ తో గుంటూరు కారం సినిమాతో సంక్రాంతికి బాగా ఘాటు ఎక్కించి ఎమోషన్స్ తో కన్నీళ్లు తెప్పించి పండక్కి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చేసాడు. ఈ సినిమాకి 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.