Hanuman Review : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..

హనుమాన్ సినిమా కచ్చితంగా చూడాల్సిన సినిమా. చిన్న పిల్లలు, ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి హ్యాపీగా చూసేయొచ్చు.

Hanuman Review : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..

Teja Sajja Prashanth Varma Hanuman Movie Review and Rating Here A goosebumps Subject

Updated On : January 12, 2024 / 11:59 AM IST

Hanuman Review : యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా మన పురాణాల్లోని హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో కథగా తెరకెక్కిన సినిమా హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అమృత అయ్యర్, గెటప్ శీను, వెన్నెల కిషోర్, సత్య, వినయ్ రాయ్.. పలువురు ముఖ్య పాత్రలు చేశారు.

ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయ్. టీజర్, ట్రైలర్స్ వచ్చిన తర్వాత హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఒక రోజు ముందుగానే నేడు సాయంత్రం నుంచే ప్రీమియర్ షోస్ వేశారు. ఆల్మోస్ట్ 350 కి పైగా ప్రీమియర్ షోలు వేయగా అన్ని ఫిల్ అవ్వడం విశేషం. ఆ రేంజ్ లో హనుమాన్ పై అంచనాలు, ఆసక్తి ఉన్నాయి.

హనుమాన్ కథ విషయానికొస్తే.. మన పురాణాల్లో.. ఆంజనేయస్వామి సూర్యుడిని పండు అనుకోని మింగడానికి వెళ్తే అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం విసురుతాడు. అప్పుడు హనుమంతుడి నుంచి ఒక రక్తపు చుక్క భూమి మీద ఓ సెలయేరులో పడుతుంది. కాలక్రమేణా అది ఓ లింగంలా(రుధిర మణి) మారుతుంది. ఈ కథని గ్రాఫిక్స్ లో చెప్పి అసలు సినిమా మొదలవుతుంది. ఆ సెలయేరు పక్కనే అంజనాద్రి అనే ఓ పల్లెటూరు అందులో హనుమంత్(తేజ సజ్జ), అంజమ్మ(వరలక్ష్మి శరత్ కుమార్) అక్క తమ్ముళ్లు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతారు. హనుమంతు సరదాగా దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. అదే ఊరి అమ్మాయి మీనాక్షి(అమృత)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు.

ఆ ఊళ్ళో పాలెగాళ్ళు అని ఊరి పెద్ద గజపతి ఉంటాడు. అతని వల్ల ఊళ్ళో వాళ్ళు సమస్యలు ఎదుర్కుంటారు. అతన్ని మీనాక్షి ప్రశ్నించడంతో బందిపోట్ల రూపంలో ఆమెపై దాడి చేయించగా ఆమెని హనుమంత్ కాపాడతాడు. కానీ బందిపోట్లు హనుమంత్ ని కొట్టి ఆ సెలయేరులో పడేస్తారు. అలా హనుమంత్ ఆంజనేయస్వామి రక్తపు చుక్కతో ఏర్పడిన రుధిర మణి దగ్గరకు వెళ్తాడు. ఆ రుధిర మణి సూర్యుడికి పెట్టి చూస్తే హనుమంతుడికి ఉన్న పవర్స్ వస్తాయని గ్రహించి ఊళ్ళో వాళ్ళని కాపాడటం మొదలుపెడతాడు హనుమంత్.

అయితే మరో వైపు మైఖేల్(వినయ్ రాయ్) చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని కలలు కంటాడు, దాని కోసం ఏమైనా చేస్తాడు. అనుకోకుండా హనుమంత్ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని తెలియడంతో ఆ ఊరు వస్తాడు. మరి మైఖేల్ ఆ సూపర్ పవర్స్ ఉన్న రుధిర మణి తీసుకున్నాడా? హనుమంత్ అతన్ని ఎలా ఎదుర్కున్నాడు? అసలు ఆ రుధిర మణి హనుమంత్ కే ఎందుకు దొరికింది? హనుమంత్, మీనాక్షిల ప్రేమ ఏమైంది? సూపర్ హీరో అయ్యాక హనుమంత్ చేసే పనులేంటి? ఆంజనేయస్వామి వస్తాడా? అనేవి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా విశ్లేషణ.. హాలీవుడ్ లో ఎన్నో సూపర్ హీరో సినిమాలు ఉన్నా, ఇండియాలో చాలా తక్కువగా క్రిష్, మిన్నన్ మురళి.. ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అయితే హనుమాన్ సూపర్ హీరో కథ అని చెప్పినా ఒక కథ అనుకోని దాంట్లో సూపర్ హీరో పాత్రని ఇమడ్చినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా హనుమంత్ మీనాక్షి వెంట పడటం, ఆంజనేయస్వామి కథ, లింగం హనుమంత్ కి దొరకడం, ఊళ్ళో సమస్యలు, హనుమంత్ కి లింగం దొరికి సూపర్ హీరో అయ్యాక చేసే పనులతో సాగుతుంది.

ఇక సెకండ్ హాఫ్ లో విలన్ ఆ లింగం కోసం ప్రయత్నం, అక్క తమ్ముడు సెంటిమెంట్స్, హీరో ఊరి కోసం ఏం చేశాడు? చివర్లో ఆంజనేయస్వామి వచ్చే సీన్స్ తో అదరగొడుతుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది అనుకునేలోపే క్లైమాక్స్ అరగంట వేరే లెవల్ కి తీసుకెళ్లి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. చివర్లో సముద్రఖని ఇచ్చే ట్విస్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఒక సూపర్ పవర్ హీరోకి దొరికితే, సూపర్ హీరో అవ్వాలన్న విలన్ దాన్ని సాధించడానికి ఏం చేశాడు, హీరో అది అతనికి దక్కకుండా ఏం చేశాడు అనే కథాంశంతో చాలా చక్కగా హనుమాన్ ని తీర్చిదిద్దారు.

కాకపోతే సూపర్ హీరోగా చేసే విన్యాసాలు ఇంకొన్ని పెడితే బాగుండు అనిపిస్తుంది. సత్య, గెటప్ శీను పాత్రలతో అక్కడక్కడా కామెడీతో నవ్విస్తారు. సినిమా మొదటి నుంచి చివరి దాకా ఒక కోతి క్యారెక్టర్ ఉంటుంది. ఆ కోతికి మన మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఇవ్వడం విశేషం.

నటీనటుల విషయానికొస్తే.. సూపర్ హీరో పాత్రలో హన్మంత్ గా తేజ సజ్జా జీవించాడనే చెప్పొచ్చు. గెటప్ శీనుకి ఒక కొత్త గెటప్ వేసి ప్రేక్షకులని మెప్పించారు. వరలక్ష్మి శరత్ కుమార్ హన్మంత్ అక్క పాత్రలో ఇటు ఎమోషన్ తో పాటు, తమ్ముడి మీద చెయ్యిస్తే ఎదురెళ్ళే అక్కగా మాస్ గా కూడా కనిపించి అదరగొట్టింది. హీరోయిన్ అమృత కూడా అలరిస్తుంది. సముద్రఖని సినిమాలో అక్కడక్కడా కనిపించినా చివర్లో ఇచ్చే ట్విస్ట్ తో ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. విలన్ గా వినయ్ రాయ్, అతని అసిస్టెంట్ గా వెన్నెల కిషోర్, ఊళ్ళో సత్య, రోహిణి.. ఇలా అందరూ తమ పాత్రల్లో మెప్పించారు.

Image

సాంకేతిక అంశాల విషయానికొస్తే.. ముందుగా హనుమాన్ సినిమా గురించి చెప్పాలంటే గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. సినిమాలో చాలా గ్రాఫిక్స్ షాట్స్, VFX సీన్స్ వాడారు. చాలా తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి అవుట్ పుట్ ఇవ్వడం చాలా గ్రేట్. VFX ఉన్న అన్ని సీన్స్, షాట్స్ చాలా బాగుంటాయి, చాలా న్యాచురల్ గా ఉంటాయి. చివర్లో ఆంజనేయస్వామి షాట్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

ఇక సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవల్. సినిమాలో చాలా షాట్స్, రాత్రి, పగలు, నీళ్ళల్లో.. ఇలా ప్రతి షాట్, సీన్ అద్భుతంగా చూపించారు. మారేడుమిల్లిలో ఈ సినిమా షూట్ చేయగా అక్కడి అందాలని చాలా అందంగా చూపించారు. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ షాట్స్ తో మంచి హై వస్తుంది. మ్యూజిక్ విషయానికొస్తే మాములు కథ జరిగేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నార్మల్ గా అనిపించినా, ఎలివేషన్, యాక్షన్, హనుమంతుడి సీన్స్ లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. గతంలో సూపర్ హీరో అనే ఓ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. ఆ సాంగ్ వినడానికి, చూడటానికి చాలా బాగుంటుంది కానీ అది సినిమాలో లేకపోవడం గమనార్హం. కథ కథనం ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా స్మూత్ గా సాగుతుంది. ఇక డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ గతంలోనే తన క్రియేటివిటీని చూపించి సక్సెస్ అయ్యాడు. హనుమాన్ సినిమాతో మరోసారి 100కి 100 శాతం సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు.

హనుమాన్ సినిమా కచ్చితంగా చూడాల్సిన సినిమా. చిన్న పిల్లలు, ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి హ్యాపీగా చూసేయొచ్చు. హనుమాన్ చూస్తుంటే క్లైమాక్స్ లో మాత్రం గూస్ బంప్స్ రావాల్సిందే. జై హనుమాన్ అనాల్సిందే. సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసి దానికి తగ్గ లీడ్ తో హైప్ ఇచ్చి ముగించడంతో సినిమా ఇంకో లెవెల్ కి వెళ్ళిపోయింది. మొత్తానికి హనుమాన్ చూశాక మంచి సినిమా అని మెచ్చుకోకుండా ఉండలేము, జై హనుమాన్, జై శ్రీరామ్ అనకుండా ఉండలేము. చిన్న సినిమాగా, తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన హనుమాన్ మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమాకు రేటింగ్ 3.5 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.