రామ్మోహన్ నాయుడిని ప‌రామ‌ర్శించిన‌ మెగాస్టార్ చిరంజీవి

  • Publish Date - December 7, 2020 / 08:34 AM IST

సుదీర్ఘ అనుభవం కలిగి ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక ఇంట్లోనే ఉంటున్న సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడును ఆదుకునేందుకు.. ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేనున్నా అంటూ ముందుకు వచ్చారు. సినీ, రాజకీయాలతో మంచి అనుబంధం ఉండి ప్ర‌జారాజ్యం పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుకైన పాత్ర‌ పోషించిన రామ్మోహన్ నాయుడుతో చిరంజీవికి మంచి అనుబంధం ఉంది.



మూడు నెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రామ్మోహన్ నాయుడును మెగాస్టార్ చిరంజీవి గారు పరామర్శించారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం బాలేదన్న విషయం తెలిసిన వెంటనే ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు చిరంజీవి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ AIG హాస్పిటల్‌లో చికిత్స‌ను అందించే ఏర్పాటు చేశారు.




ఈ సంధర్భంగా మాట్లాడిన చిరంజీవి..  “ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరు ఉంది” అని ప్రశంసించారు. నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందని ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని ఆకాంక్షించారు.