Stalin Re Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అభిమానులను అలరించాయి. రీ రిలీజ్ లోనూ కొన్ని సినిమాలు సత్తా చాటాయి. వాటికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆ సినిమాలు చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ స్టాలిన్.
తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన స్టాలిన్ 2006లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ మూవీ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. రీ రిలీజ్ డేట్ ను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు.
తన పుట్టిన రోజున ఆగస్ట్ 22న స్టాలిన్ రీ రిలీజ్ కానుందని చిరంజీవి తెలిపారు. ఇందుకోసం చిత్ర నిర్మాత, తన తమ్ముడు నాగబాబు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఈ మూవీలో సామాజిక సేవకుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిరంజీవి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. మణిశర్మ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా పాటలు అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి.
చిరంజీవి సూపర్ హిట్ చిత్రం స్టాలిన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి థియేటర్లలో సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సినిమాను ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్‌డే కానుకగా విడుదల చేయబోతున్నారు. మెరుగైన దృశ్య అనుభవం కోసం 8K వెర్షన్‌గా మారుస్తోంది. ఈ మూవీలో కుష్బూ, ప్రకాశ్ రాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.
”ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మంచి సందేశాన్ని సమాజానికి అందించింది. ఒక వీర జవాన్ గా దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రువులతో పోరాటం కాదు దేశం లోపల ఉన్న శత్రువులతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుని.. ఈ సమాజంలో అంతర్ యుద్ధం చేయ తలపెట్టిన ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారతాడు ఈ చిత్ర హీరో స్టాలిన్.
ఈ సొసైటీలో తాను చేస్తున్న మంచి వల్ల ప్రయోజనం పొందిన వాళ్లు కృతజ్ఞతలు చెప్పడం కాకుండా అలాంటి మంచి పనే మరో ముగ్గురికి చేసి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి చేసుకుంటూ వెళ్లాలి అనేది ఒక్క చక్కటి సందేశాన్ని, మంచిని ప్రబోధించే ఒక ప్రయోగం ఇందులో ఉంది. ఈ తరం ప్రేక్షకులకు వినోదమే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజెప్పే చిత్రం మీ స్టాలిన్.
అలాగే ఈ మూవీలో నటించిన ఖుష్బూ, త్రిష, ఇతర సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా స్వరబ్రహ్మ మణిశర్మకు, డైరెక్టర్ మురుగదాస్ కు, చోటా కె నాయుడు, నా తమ్ముడు నాగబాబుకి నా హృదయపూర్వక అభినందనలు.
అలాగే ఈ చిత్రం మీ అందరికి ఒక మంచి అనుభూతిని ఇస్తుందని అనటంలో ఎలాంటి సందేహం లేదని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను” అని చిరంజీవి అన్నారు. (Stalin Re Release)
Also Read: సౌబిన్ సాహిరా మజాకా.. ఎన్ని కోట్లు పెట్టి కారు కొన్నాడో తెలుసా.. ఆ వీడియో చూస్తే..
Straight from the HEART of the BOSS ❤️🔥#Stalin Reporting in Theatres on 22nd August 🌟@KChiruTweets @trishtrashers @NagaBabuOffl pic.twitter.com/vDRxTa9YfC
— Anjana Productions (@Anjana_Prod) August 16, 2025