Minister Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy: సినీ కార్మికుల సమ్మెపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. టాలీవుడ్ సమస్యలపై ఆయన కీలక సూచనలు చేశారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. మేము ఎప్పటికీ కార్మికుల పక్షానే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే, నిర్మాతల సమస్యను కూడా అర్థం చేసుకోవాలంటూ కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొండి పట్టుదలకు పోతే మీరే నష్టపోతారు అని అన్నారు. విడతల వారీగా వేతనాల పెంపునకు అంగీకరించండి అంటూ కార్మికులకు సూచించారు.
రేపు మరోసారి ఫిలిం ఛాంబర్ లో కూర్చుని మాట్లాడుకోండి అంటూ మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సెక్రటేరియట్ లో ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో మంత్రి కోమటిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. మేము ఎప్పటికీ కార్మికుల పక్షానే ఉంటామన్న మంత్రి.. పట్టువిడుపులతో సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.
రేపటి భేటీలో అంతిమ నిర్ణయం- అనిల్ వల్లభనేని
మా పరిస్థితిని మంత్రి కోమటిరెడ్డికి వివరించామని, పలు అంశాలకు ఆయన సానుకూలంగా స్పందించారని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తెలిపారు. మేము చెప్పిన సమస్యలపై నిర్మాతలతో మంత్రి ఫోన్ చేసి చెప్పారని, రేపటి సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వస్తా అని అన్నారని వెల్లడించారు. రేపటి ఛాంబర్ భేటీలో సానుకూల స్పందన వస్తుంది అనుకుంటున్నామన్నారు. రేపటి భేటీలో అంతిమ నిర్ణయం ఉంటుందని చెప్పారు. మా తరపున కమిటీ ఉంది.. కమిటీ సభ్యులు హాజరు అవుతారు అని అనిల్ తెలిపారు.