Mirnaa Menon : సినిమాలోని కార్ యాక్సిడెంట్ రియల్ గా చేశాం.. ఉగ్రం సినిమా సీక్రెట్స్ రివీల్ చేసిన హీరోయిన్..
ఉగ్రం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మిర్నా మీనన్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియచేసింది.

Mirnaa Menon shares about Ugram movie interesting facts
Mirnaa Menon : అల్లరి నరేష్(Allari Naresh), మిర్నా(Mirnaa) మీనన్ జంటగా నాంది(Nandi) లాంటి హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉగ్రం(Ugram). ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసే అల్లరి నరేష్ నాంది నుంచి తన పంథా మార్చి సీరియస్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు అదే నాంది డైరెక్టర్ కాంబినేషన్ లో మరో పవర్ ఫుల్ స్టోరీ ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఉగ్రం సినిమా మే 5న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా ఉగ్రం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మిర్నా మీనన్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియచేసింది.
మిర్నా మాట్లాడుతూ.. తెలుగులో గతంలో క్రేజిఫెలో సినిమాలో నటించాను. ఇప్పుడు ఉగ్రం ద్వారా మళ్ళీ తెలుగులో కనపడుతున్నాను. ఈ సినిమా నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఒకే సినిమాలో కాలేజీ స్టూడెంట్ లా, గృహిణిలా, ఓ బిడ్డకు తల్లిలా మూడు షేడ్స్ లో కనిపించాను. ఒకే సినిమాలో ఇలా మూడు వేరియేషన్స్ లో నటించడం చాలా నచ్చింది. ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ఉగ్రం సినిమాకు నేను దాదాపు 70 రోజులు షూట్ చేశాను. అందులో 55 రోజులు నైట్ షూట్ చేశాం. ఒక షెడ్యూల్ లో అయితే వరుసగా 15 రోజులు నైట్ షూట్ చేశాం. ఓ సారి బ్రేక్ లేకుండా ఏకంగా 48 గంటలు వర్క్ చేశాను ఉగ్రం సినిమా కోసం. ఇది చాలా డిఫరెంట్ అనుభూతిని ఇచ్చింది. ట్రైలర్ లో మీరు చూసిన కార యాక్సిడెంట్ సీన్ రియల్ గా షూట్ చేశారు. ఎలాంటి డుప్స్ లేకుండా నేను, నరేష్ గారు చేశాం. నాకైతే చాలా భయమేసింది. ఈ సీన్ లో నరేష్ గారికి గాయాలు కూడా అయ్యాయి అని తెలిపింది.
తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం రజినీకాంత్ గారి జైలర్ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నాను. సూపర్ స్టార్ తో కలిసి చేయడం చాలా బాగుంది. అలాగే తమిళ్ లో ఒక సినిమా, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను అని తెలిపింది.