సింగర్‌పై కేసు నమోదు – నిర్మాతకు ఏడాది జైలుశిక్ష

టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్‌కు ఏడాది శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా..

  • Published By: sekhar ,Published On : March 7, 2020 / 03:19 PM IST
సింగర్‌పై కేసు నమోదు – నిర్మాతకు ఏడాది జైలుశిక్ష

Updated On : March 7, 2020 / 3:19 PM IST

టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్‌కు ఏడాది శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా..

సింగర్‌ సిప్పీ గిల్‌పై కేసు
ప్రముఖ పంజాబీ సింగర్‌ కమ్ యాక్టర్‌ సిప్పీ గిల్‌పై కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితం యూట్యూబ్‌లో అతడు విడుదల చేసిన ‘గూండాగర్ది’ అనే పాట హింసను ప్రొత్సహించేవిధంగా ఉందంటూ పండిత్‌ రావ్‌ అనే లెక్చరర్‌ శనివారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ పాట హింసను ప్రోత్సహించేలా ఉందని, ముఖ్యంగా యువకులు ఆకర్షితులవుతారని వారిపై ఈ పాట ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండిత్‌ రావ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీంతో మోగ ఎస్పీ.. సిప్పీ, పండిత్‌లను తన ఆఫీసుకు పిలిపించారు. అయితే సిప్పీ అక్కడికి వెళ్లకపోవటం గమనార్హం. కాగా, పంజాబ్‌లోని మోగ జిల్లా రౌలి గ్రామానికి చెందిన సిప్పీ, 2007లో తన సింగింగ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్‌ల ద్వారా బాగా పాపులర్‌ అయ్యాడు. 2014లో సి​ప్పీ పాడిన ‘10 మింట్‌’ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. 
నిర్మాత నట్టి కుమార్‌కు ఏడాది జైలుశిక్ష..
టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్‌కు వివాదాలు కొత్తేం కాదు. తాజాగా చెక్‌ బౌన్స్‌ కేసులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ నట్టి కుమార్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ స్థానిక మొబైల్‌ మెజిస్ట్రేట్‌ కె.దీప దివ్యకృప శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుని తరపు న్యాయవాది ఇనుగంటి రమేష్‌ తెలిపిన వివరాలు.. నట్టి కుమార్‌ కరుణాలయ ఫిల్మ్స్‌ పేరుతో విశాఖలో సినీ డిస్ట్రిబ్యూషన్‌ చేసేవారు. 2009 సెప్టెంబర్‌లో విజయనగరంలోని రాజ్యలక్ష్మీ థియేటర్‌లో ‘శంఖం’ సినిమా (గోపిచంద్ హీరో) రెండు వారాల పాటు ప్రదర్శించేందుకు థియేటర్‌ యాజమాన్యంతో రూ.6.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే, వారం రోజుల తరువాత సినిమా ప్రదర్శన నిలిపివేయడంతో యాజమాన్యానికి, నిర్మాతకు మధ్య వివాదం తలెత్తింది. పెద్దల జోక్యంతో నిర్మాత రూ.5.5 లక్షలు థియేటర్‌ యాజమాన్యానికి ఇవ్వడానికి అంగీకరించి చెక్‌ను థియేటర్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ ఎ.రవికుమార్‌కు ఇచ్చారు. అయితే, నట్టి కుమార్‌ ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అయ్యింది. దీనిపై రవికుమార్‌ కోర్టును ఆశ్రయించగా, నట్టికుమార్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్‌ తీర్పు చెప్పారు.