Mohan Babu Interesting Comments on Sr NTR Last Movie Major Chandrakanth
Mohan Babu : 50 ఏళ్లుగా హీరో, విలన్, కమెడియన్.. ఇలా ఎన్నో పాత్రల్లో అనేక సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు మోహన్ బాబు. ప్రస్తుతం తన విద్యాసంస్థలు చూసుకుంటూ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. మంచు విష్ణు మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
మోహన్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, దాసరి నారాయణ రావు గురించి, సీనియర్ ఎన్టీఆర్ గురించి, రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఈ క్రమంలో మోహన్ బాబు ఎన్టీఆర్ తో తీసిన మేజర్ చంద్రకాంత్ సినిమా సంగతి గురించి మాట్లాడుతూ.. నా ఆస్తులు అన్ని తాకట్టు పెట్టి సినిమా తీయడానికి రెడీ అయ్యాను. అన్నగారు అప్పుడు సీఎం పదవిలో లేరు. ఆయనతో మేజర్ చంద్రకాంత్ సినిమా చేద్దామని వెళ్లి అడిగితే వద్దన్నారు. రెండు మూడు సార్లు వెళ్లి అడిగాను. నేను ఇప్పుడు పదవిలో లేను, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా, నాతో ఇప్పుడు సినిమా వద్దు బ్రదర్ అని తిట్టారు. అయినా వినలేదు. నా మొండితనం చూసి ఓకే చెప్పారు. అలా అన్నగారి చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ లో నేను నటిస్తూ నిర్మించాను. ఆ సినిమా చేసేటప్పుడు అన్నగారితో మీరు మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పాను. 1993 లో సినిమా రిలీజయింది. 94 లో అన్నగారు సీఎం అయ్యారు అని తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ నటించిన చివరి సినిమా మేజర్ చంద్రకాంత్. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయి 100 రోజులు కూడా ఆడింది. అయితే ఎన్టీఆర్ సినిమాల్లో చివరగా రిలీజ్ అయింది మాత్రం శ్రీనాథ కవి సార్వభౌమాన.