Mohan Babu : నిర్మాతగా నా ఫస్ట్ సినిమా.. అప్పుడు చంద్రబాబు సినిమాటోగ్రఫీ మినిస్టర్.. నా కోసం ఎన్టీఆర్ 40 కిలోమీటర్లు..

మోహన్ బాబు నిర్మాతగా కూడా అనేక సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే.

Mohan Babu Tells about his First Movie as Producer Opening with Chandrababu Naidu and NTR

Mohan Babu : ఎన్నో వందల సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన హీరో మోహన్ బాబు ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు మోహన్ బాబు.

మోహన్ బాబు నిర్మాతగా కూడా అనేక సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. తన కూతురు లక్ష్మి ప్రసన్న పేరుతో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మించారు. ఆ బ్యానర్ గురించి ఆ బ్యానర్ పై మొదటి సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపారు మోహన్ బాబు.

Also Read : Priyanka Chopra : మహేష్ తర్వాత అల్లు అర్జున్ తో.. హాలీవుడ్ ని వదిలేసి టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న ప్రియాంక చోప్రా..?

మోహన్ బాబు మాట్లాడుతూ.. హీరోలందరికీ సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. నాకు కూడా ఎందుకు ఉండకూడదు అనుకున్నాను. 1982 లో నా కూతురి పేరు మీద శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్థాపించాను. కన్నడలో ఫ్లాప్ అయిన ఓ సినిమా కథని తీసుకొని దాంట్లో కొన్ని మార్పులు చేసి నిర్మాతగా నా మొదటి సినిమాని తెరకెక్కించాను. ఆ సినిమా పేరు ప్రతిజ్ఞ. అప్పటికే నాకు ఎన్టీఆర్ అన్నతో మంచి అనుబంధం ఉంది. ఇలా బ్యానర్ మొదలుపెట్టాను, ఓపెనింగ్ కి రావాలి అని అడిగాను. కానీ ఆయనకు అదే రోజు షూటింగ్ ఉంది. నా సినిమా ఓపెనింగ్ నుంచి ఆయన షూటింగ్ కి 40 కిలోమీటర్లు దూరం. నా సినిమా ముహూర్తం ఉదయం 6.45 కి. షూటింగ్ ఉంది కదా అన్నగారు రారేమో అనుకున్నాను. కానీ నా కోసం ఎన్టీఆర్ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి 6.45 ముహూర్తంకు కొబ్బరికాయ కొట్టి వెళ్లారు.

చంద్రబాబు నాయుడు నాకు బంధువులు అవుతారు. అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ హయాంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా చేస్తున్నారు. ఓపెనింగ్ కి రమ్మన్నాను. నా మొదటి సినిమాకు చంద్రబాబు వచ్చి క్లాప్ కొట్టారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది అని తెలిపారు.